గద్వాలలో గందరగోళం!.. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ టికెట్

గద్వాలలో గందరగోళం!.. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ టికెట్
  • బీఆర్ఎస్  అభ్యర్థికి కోర్టు గండం
  • ప్యారాచూట్  లీడర్లకు టికెట్  వద్దంటూ కాంగ్రెస్ లో కుమ్ములాటలు
  • నాన్ లోకల్  లీడర్లు మాకొద్దంటూ ఫ్లెక్సీలు

గద్వాల, వెలుగు: గద్వాల రాజకీయాలు గందరగోళంగా మారాయి. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్యారాచూట్  లీడర్లకు టిక్కెట్  ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ లో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. టికెట్ ఆశిస్తున్న వారి మధ్య పోటీ పెరగడంతో ఫ్లెక్సీలు చింపేసుకుని పోలీసులకు కంప్లైంట్లు ఇచ్చే స్థాయికి విభేదాలు చేరాయి. ఇక సిట్టింగ్  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని గద్వాల బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కోర్టు గండం వెంటాడుతోంది. సుప్రీంకోర్టులో స్టే ఇవ్వకపోతే క్యాండిడేట్  మారే అవకాశాలు ఉన్నాయని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నాన్ లోకల్ లీడర్లకు టికెట్లు ఇవ్వొద్దంటూ, మన గద్వాల మన పాలన అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది.

గట్టు జడ్పీటీసీ జంప్  అయినట్లేనా?

బీఆర్ఎస్  కు చెందిన గట్టు జడ్పీటీసీ శ్యామల భర్త హనుమంతు బీఆర్ఎస్  పార్టీకి గుడ్​బై చెప్పినట్లేనని అంటున్నారు. బీఆర్ఎస్  పార్టీలో ఉంటూనే కాంగ్రెస్  పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం ఆయన దరఖాస్తు చేసుకోవడం ఇందుకు కారణం. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతారని చాలా రోజుల నుంచి ప్రచారం జరిగింది. విషయం తెలుసుకున్న ఆ పార్టీ నేతలు జడ్పీ చైర్మన్  పదవి ఇప్పిస్తామనడంతో వెనక్కి తగ్గాడు. ఇటీవల మరో మండలానికి చెందిన జడ్పీటీసీ కూడా తనకు జడ్పీ చైర్మన్  పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పడంతో పార్టీ మోసం చేస్తోందని భావించి పార్టీ వీడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యేకు కోర్టు గండం..

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని హై కమాండ్  బీఆర్ఎస్​ అభ్యర్థిగా డిక్లేర్  చేసినప్పటికీ, కోర్టు తీర్పు ఆయనకు అడ్డంకిగా మారిందని అంటున్నారు. హైకోర్టు అనర్హత వేటు వేయడంతో పాటు రూ.2.50 లక్షల జరిమానా విధించింది. సుప్రీంకోర్టులో ఏ తీర్పు ఇస్తుందోనని బీఆర్ఎస్  క్యాడర్  ఆందోళన చెందుతోంది. కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం అభ్యర్థిని మార్చే అవకాశాలున్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇలా అధికార పార్టీలోనూ గందరగోళం నెలకొంది.

కొత్తవారిపై కంప్లైంట్..

కాంగ్రెస్  పార్టీ టికెట్  కోసం 10 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కాంగ్రెస్  పార్టీకి చెందినవారు 8 మంది ఉండగా, బీఆర్ఎస్  పార్టీకి చెందిన వారు ఒకరు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి కన్వీనర్  రంజిత్ కుమార్  సైతం టికెట్  కోసం అప్లై చేసుకున్నారు. కాంగ్రెస్  పార్టీలో చేరిన బీఆర్ఎస్  కోవర్టులకు టికెట్  ఇవ్వవద్దని సీఎల్పీ లీడర్  భట్టి విక్రమార్కకు డీసీసీ అధ్యక్షుడు పటేల్  ప్రభాకర్ రెడ్డి, కో ఆర్డినేటర్లు విజయ్ కుమార్, రాజీవ్ రెడ్డి బుధవారం కంప్లైంట్ చేశారు. 

పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొన్న లీడర్లతో కలిసి తిరుపతికి వెళ్తుండగా ఎర్రవల్లి చౌరస్తా దగ్గర ఆయనకు స్వాగతం పలికి ఫిర్యాదు చేశారు. మినిస్టర్ కు అనుకూలంగా ఉన్న సరిత తిరుపతయ్య, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి ముప్పేనని తెలిపారు. ఈ వ్యవహారం పార్టీలో దుమారం రేపుతోంది. ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి ప్రచారం చేసుకుంటున్నారు. ఫ్లెక్సీలు చింపుకొని, పోలీసులకు కంప్లైంట్లు చేసుకున్నారు. ఇలా టికెట్  రాకముందే పార్టీలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడంతో కాంగ్రెస్​లో అయోమయ పరిస్థితి నెలకొంది.

తెరపైకి నాన్ లోకల్ నినాదం..

‘మన గద్వాల మన పాలన’.. మన ప్రాంతంలో అలంపూర్  లీడర్ల పెత్తనం ఏమిటంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నాన్ లోకల్ నినాదాన్ని తెరపైకి తెస్తున్నారు. కాంగ్రెస్  నుంచి టికెట్ ఆశిస్తున్న జడ్పీ చైర్​పర్సన్  సరిత, పీసీసీ సెక్రటరీ విజయ్ కుమార్​ అలంపూర్ కు చెందిన వారు కావడంతో వారికి టికెట్లు రాకుండా కాంగ్రెస్ లోని ఒక వర్గంతో పాటు అధికార పార్టీ లీడర్లు ఫ్లెక్సీలు వేయించారనే ప్రచారం జరుగుతోంది. ఇలా ఎన్నికలకు ముందే గద్వాల రాజకీయాలు గందరగోళంగా మారుతున్నాయి.