‘వన్ వెబ్ ఇండియా 1’ ప్రయోగం : 36 శాటిలైట్లతో నింగిలోకి ఇస్రో ‘బాహుబలి’ రాకెట్

‘వన్ వెబ్ ఇండియా 1’ ప్రయోగం : 36 శాటిలైట్లతో నింగిలోకి ఇస్రో  ‘బాహుబలి’ రాకెట్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ  ‘ఇస్రో’  ప్రతిష్ఠాత్మక ‘వన్ వెబ్ ఇండియా 1’ మిషన్  ప్రయోగాన్ని అర్ధరాత్రి 12 గంటల 7 నిమిషాలకు నిర్వహించింది. తిరుపతిలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి బాహుబలి రాకెట్  ‘జీఎస్ఎల్వీ మార్క్–3’ నింగిలోకి దూసుకెళ్లింది. 5,200 కిలోల బరువున్న 36 ఉపగ్రహాలను మోసుకొని నిర్ణీత కక్ష్యలోకి చేరింది. రాకెట్‌ భూమి నుంచి ఎగిరి.. విడతల వారీగా ఉపగ్రహాలను లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లోని నిర్ణీత కక్ష్యల్లోకి ప్రవేశపెట్టింది. అనంతరం వాటిని యూకేకి చెందిన గ్రౌండ్‌స్టేషన్‌ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కమర్షియల్‌ ప్రాతిపదికన నిర్వహించిన తొలి మల్టీ శాటిలైట్‌ మిషన్‌గా ఈ ప్రయోగం చరిత్రలో నిలిచిపోయింది. ఇక అంతకుముందు శుక్రవారం అర్ధరాత్రే ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ మొదలైంది.  శనివారం ఉదయం  నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరీ దేవి ఆలయంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి పూజలు జరిపారు. 

‘వన్ వెబ్’ లో ఎయిర్ టెల్ ఒక భాగస్వామి..

 ‘వన్ వెబ్’  అనేది  లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే  మల్టీనేషనల్  ప్రైవేట్‌ శాటి‌లైట్‌ కమ్యూ‌ని‌కే‌షన్‌ కంపెనీ. ఇందులో యూకే ప్రభుత్వంతో పాటు మన దేశానికి చెందిన భారతీ ఎయిర్ టెల్, ఫ్రాన్స్ కంపెనీ యూటెల్ శాట్ ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. ఇది 108 బ్రాడ్‌‌బ్యాండ్‌ కమ్యూ‌ని‌కే‌షన్‌ శాటి‌లై‌ట్ల ప్రయోగానికి సంబంధించి ఇస్రోకు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) తో గతంలో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే తొలి విడతగా 36 కమర్షియల్ బ్రాడ్‌‌బ్యాండ్‌ కమ్యూ‌ని‌కే‌షన్‌ శాటి‌లై‌ట్లను ఇవాళ GSLV–మార్క్‌3 (ఎల్‌వీ-ఎం 3) రాకెట్‌ ద్వారా రోదసీలోకి  పంపించారు. వచ్చే ఏడాది మార్చిలోపు మరో నాలుగు రాకెట్ల ద్వారా మిగతా 72 ఉపగ్రహాలను  కూడా అంతరిక్షంలోకి పంపనున్నారు.  

ఎల్‌వీ-ఎం 3  రాకెట్‌ విశేషాలు..

  • GSLV–మార్క్‌3 (ఎల్‌వీ-ఎం 3) రాకెట్‌ అనేది ఇస్రో నిర్మించిన అత్యంత బరువైన రాకెట్. దీని బరువు 6.40 లక్షల కేజీలు.
  • దాదాపు 4వేల కిలోల బరువును జియో సింక్రోనస్ ఆర్బిట్‌లోకి, 8వేల కిలోల బరువును ఎర్త్ ఆర్బిట్‌లోకి మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం.  
  • ఈ రాకెట్ ఎత్తు 43. 43 మీటర్లు, వ్యాసం 4 మీటర్లు.  
  • క్రయోజెనిక్ దశ ద్వారా హెవీ పేలోడ్లను 600 కిలోమీటర్ల ఎత్తులో దిగువ భూ కక్ష్యలో ప్రవేశ పెట్టగలదు.
  • జీశాట్ సీరీస్ కు చెందిన 4 టన్నుల బరువున్న ఉపగ్రహాలను భూస్థిరకక్ష్యలోకి ప్రవేశపెట్టే సామర్ధ్యం కూడా దీనికి ఉంది.