మల్లారెడ్డి కంపెనీస్‭లో కొనసాగుతున్న ఐటీ విచారణ

మల్లారెడ్డి కంపెనీస్‭లో కొనసాగుతున్న ఐటీ విచారణ

హైదరాబాద్‌‌,వెలుగు : మల్లారెడ్డి గ్రూప్‌‌ ఆఫ్ కంపెనీస్ కేసులో ఐటీ విచారణ కొనసాగుతోంది. బషీర్‌‌‌‌బాగ్‌‌ ఆయకార్ భవన్‌‌లోని ఐటీ ఆఫీస్‌‌లో మంగళవారం రెండో రోజు విచారణ జరిగింది. పన్ను ఎగవేత, రూ.వంద కోట్లకు పైగా డొనేషన్లు వసూలు చేశారనే ఆరోపణలపై గత వారమే ఐటీ అధికారులు మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లలో సోదాలు చేసిన సంగతి తెలిసిందే. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న నగదు, డాక్యుమెంట్ల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు సమన్లు జారీ చేశారు. మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్‌‌‌‌రెడ్డి సహా మొత్తం 12 మందిని సోమవారం విచారించారు. ఈ క్రమంలోనే సమన్లు అందుకున్న మల్లారెడ్డి సంస్థల సిబ్బంది ఐటీ అధికారుల ముందు హాజరయ్యారు. మంగళవారం జరిగిన విచారణకు మల్లారెడ్డి మెడికల్,ఇంజనీరింగ్‌‌ కాలేజీల ఆడిటర్‌‌‌‌ సీతారామయ్యతో పాటు కాలేజీల ప్రిన్సిపాల్స్, అడ్మినిస్ట్రేషన్‌‌ స్టాఫ్‌‌, అకౌంటెంట్లు హాజరయ్యారు. మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి,అల్లుడు రాజశేఖర్‌‌‌‌రెడ్డి బుధవారం మళ్లీ విచారణకు హాజరు కానున్నారు. 

మల్లారెడ్డి ఇన్ స్టిట్యూషన్స్‌‌కు చెందిన ఆడిటర్ సీతారామయ్య, ఇద్దరు అకౌంటెంట్స్‌‌ నుంచి ఐటీ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. మల్లారెడ్డి గ్రూప్‌‌ ఆఫ్‌‌ కంపెనీలకు చెందిన అకౌంట్ల వివరాలను సేకరించారు. బాలానగర్‌‌‌‌లోని క్రాంతి బ్యాంక్, ఎస్‌‌బీఐలో ఖాతాలపైనా ఆరాతీశారు. ప్రధానంగా సీట్లు, ఫీజులు, ఆదాయం, పన్ను చెల్లింపులకు సంబంధించిన వివరాలను సేకరించారు. అడ్మిషన్స్‌‌లో మేనేజ్‌‌మెంట్‌‌, కన్వీనర్ కోటాకు సంబంధించిన రికార్డులను పరిశీలించినట్లు సమాచారం. ఈ సీట్ల కేటాయింపు సమయంలో జరిగిన పేమెంట్‌‌ వివరాలను రికార్డ్‌‌ చేసినట్లు తెలిసింది. జారీ చేసిన రసీదులు, రికార్డుల్లో పేర్కొన్న  నగదు లావాదేవీల గురించి ప్రశ్నించినట్లు తెలిసింది. మల్లారెడ్డి మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్‌‌ మురళీ మోహన్‌‌, కేఎస్‌‌ రావు, ఇతర కాలేజీల ప్రిన్సిపాల్స్‌‌ ఏవీ నారాయణ, బీవీ అశోక్ ను ఆఫీసర్లు సుదీర్ఘంగా విచారించారు. కాలేజీల్లో స్టూడెంట్లు, స్టాఫ్‌‌కి సంబంధించిన వివరాలను రికార్డ్ చేశారు. ఈ క్రమంలోనే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు  వి.శ్రీనివాస్‌‌, రాజేశ్వర్‌‌‌‌రెడ్డి, ఉద్యోగి రవికాంత్‌‌ నుంచి వివరాలను సేకరించారు. తేదీల వారీగా డిపాజిట్​ చేసిన డబ్బుకు సంబంధించిన వివరాలతో ప్రశ్నించినట్లు తెలిసింది. రిజిస్టర్స్‌‌లో పేర్కొన్న ఖర్చులకు, బ్యాంకుల నుంచి జరిగిన ట్రాన్సాక్షన్ల మధ్య వ్యత్యాసాలు గుర్తించినట్లు సమాచారం. కొన్ని రికార్డులు, రసీదు బుక్స్‌‌లో నమోదైన క్యాష్ వివరాలతో బ్యాంకుల్లో డిపాజిట్స్‌‌ లేనట్లు తెలిసింది. దీంతో రూ.కోట్లు చెల్లింపులు లేకుండానే చేతులు మారినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.