ఓయూలో కొనసాగుతున్న తెలుగు సాహిత్య సభలు

ఓయూలో కొనసాగుతున్న తెలుగు సాహిత్య సభలు

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘తెలుగు సాహిత్య మహాసభలు’ శుక్రవారం కొనసాగాయి. తెలుగు శాఖ అధ్యాపకుడు ప్రొఫెసర్ కాశీం​కన్వీనర్​గా వ్యవహరించారు. మొదటగా ‘నవలా సాహిత్యంపై సదస్సు’ జరిగింది. ప్రముఖ కవులు అంపశయ్య నవీన్, అల్లం రాజయ్య, బండి నారాయణస్వామి, కాసుల ప్రతాపరెడ్డి, పెద్దింటి అశోక్ కుమార్, కోట్ల హనుమంతరావు వక్తలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాహిత్యం, నవలా రచనల ప్రభావాన్ని వివరించారు.

నవలా వస్తు ఎంపిక, దాన్ని నిర్మించే సంపూర్ణ బాధ్యత రచయితకు ఉండాలని రచయిత బండి నారాయణస్వామి చెప్పారు. తాను రాసిన నవలా వస్తువుకు రాయలసీమ నేపథ్యం ఎలా దోహదపడిందో వివరించారు. నవలా రచనలో పాత్రలు నిర్మించుకునే విధానం గురించి ప్రముఖ నవలా రచయిత పెద్దింటి అశోక్ కుమార్ తెలిపారు. పాత్రకు ఉండాల్సిన లక్షణాలు, స్వభావాలను ముందుగా నిర్దేశించుకోవాలని, వాటికి తగ్గట్టు సన్నివేశాలను, తగినంత భాషను సమకూర్చుకోవాలని తెలిపారు. అప్పుడే ఆ పాత్ర పది కాలాలపాటు నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. వర్తమాన నాటకరంగంపై ప్రొఫెసర్ కోట్ల హనుమంతరావు మాట్లాడుతూ.. ఔత్సాహిక నాటక రంగమే తెలుగు నాటక రంగాన్ని బతికిస్తుందన్నారు. స్థల, కాలాల నేపథ్యం నుంచి సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుందని అల్లం రాజయ్య చెప్పారు. ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాల మధ్య ఉన్న ఘర్షణ నవలా సాహిత్యంలోని వస్తువు వైవిధ్యానికి కారణమన్నారు. మొదటి తెలుగు నవల కంబుకందర చరిత్ర అని తెలిపారు. తెలంగాణలో గడిచిన పదేండ్లలో వచ్చిన తెలంగాణ నవలలు నిరాశపరిచేటట్టుగా ఉన్నాయని దశాబ్ది తెలంగాణ నవల అనే అంశంపై మాట్లాడిన కాసుల ప్రతాపరెడ్డి అభిప్రాయపడ్డారు. దళిత జీవిత కోణంలోంచి వెలువడినంతగా, మధ్యతరగతి జీవితాన్ని చిత్రించే నవలలు రాలేదని చెప్పారు.

తన ఉస్మానియా జీవితమే ‘అంపశయ్య’ నవలకు నేపథ్యాన్ని, ప్రేరణను అందించిందని నవలా రచయిత అంపశయ్య నవీన్ తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నవలల్ని అధ్యయనం చేయాల్సిన బాధ్యతను ఆయన గుర్తుచేశారు. సాహిత్య అధ్యయనం కొరవడంతో సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోయిందని అభిప్రాయపడ్డారు. సమకాలీన జీవితాన్ని ప్రతిబింబించని వచన రచనను నవలగా అంగీకరించలేమని చెప్పారు. భోజన అనంతరం జరిగిన ‘విమర్శా దర్శనం’ అనే సెషన్​లో విమర్శతో నా ప్రయాణం అనే అంశంపై ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే ప్రసంగించారు. సాహిత్య విమర్శ పరికరాలు అనే అంశంపై కోయి కోటేశ్వరరావు మాట్లాడారు. ప్రముఖకవి డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి మాట్లాడుతూ ఏది తెలంగాణ సాహిత్య విమర్శ అవుతుంది? ఎవరు రాసింది? అని ప్రశ్నించారు. దశాబ్ది తెలంగాణ సాహిత్య విమర్శ అనే అంశంపై ఆయన  ప్రసంగిస్తూ, గతంలో వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు చేసిన సాహిత్య విమర్శను తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలే సాహితీ విమర్శను పుస్తకాలుగా ముద్రించిందన్నారు. సాహిత్య శిల్పం అంశంపై విస్తృత చర్చ జరిగింది. కె.ఎన్ మల్లీశ్వరి అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్​వెలుదండ నిత్యానందరావు, ఎస్వీ సత్యనారాయణ, గోగు శ్యామల పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు ఆర్ట్స్ కాలేజీ వద్ద కవితా పొద్దు జరిగింది. 20 మంది కవులు, గాయకులు పాల్గొన్నారు.