చదివింది నాలుగు.. కోట్లలో మోసాలు

చదివింది నాలుగు.. కోట్లలో మోసాలు

హనుమకొండ, వెలుగు: చదివింది నాలుగో క్లాసే.. అయినా ఆన్​ లైన్​ బెట్టింగుల్లో ఆరి తేరాడు. ముంబైకి చెందిన బుకీలతో చేతులు కలిపి మూడు నెలల నుంచి  రూ.కోట్లల్లో దందా చేశాడు. చివరకు బాధితుల ఫిర్యాదుతో  కటకటాలపాలయ్యాడు. ఆన్​ లైన్​ బెట్టింగులతో కోట్లలో మోసం చేసిన వరంగల్​కు చెందిన వ్యక్తితోపాటు మహారాష్ట్రకు చెందిన మరొకరిని వరంగల్ పోలీసులు అరెస్ట్​ చేసి,  రూ.2.05 కోట్ల నగదుతో పాటు 8 సెల్​ ఫోన్లు, 43 బ్యాంక్​ పాస్​ బుక్​లు, 15 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులన వివరాలను వరంగల్ సీపీ డాక్టర్​తరుణ్​ జోషి సోమవారం వెల్లడించారు. కరీంనగర్ ​టౌన్​కు చెందిన మాడిశెట్టి ప్రసాద్​హనుమకొండలోని గోపాలపూర్​లో ఉండేవాడు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్​ హఫీజ్​పేటకు షిఫ్ట్​ అయి..  రెడీ మేడ్​ బట్టల వ్యాపారం చేసేవాడు.  తనకొచ్చే ఆదాయం సరిపోక ఈజీ మనీ కోసం ప్రయత్నించాడు. హఫీజ్ పేటలోని కొందరు ఫ్రెండ్స్​తో  కలిసి 2016 నుంచి క్రికెట్​ బెట్టింగులు మొదలుపెట్టాడు.  2018 నుంచి ఆన్​లైన్​ క్రికెట్​, పేకాట బెట్టింగులు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రసాద్​కు  ముంబైలో బెట్టింగులు నిర్వహించే మహారాష్ట్ర యావత్​ మాల్​ జిల్లా చోరియా టౌన్​ షిప్​కు చెందిన అభయ్​ విలాస్​ రావుతో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా బెట్టింగ్​లపై పట్టు సాధించి.. తానే తెలుగు రాష్ట్రాల్లో బుకీగా అవతారమెత్తాడు.

జైలుకు వెళ్లినా మార్పు రాలే
బెట్టింగులకు పాల్పడిన ప్రసాద్​తో పాటు మరో ఇద్దరిని 2019లో  చందానగర్, రామచంద్రపురం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత హైదరాబాద్​ నుంచి తన మకాం అత్తగారుండే హనుమకొండ జిల్లా గోపాలపురానికి మార్చాడు. ఇక్కడ నుంచి ఐపీఎల్​, టీ20 వర్డల్ కప్ తో పాటు  పేకాట  బెట్టింగ్ కొనసాగించాడు.  తక్కువ అమౌంట్​ కాసిన వారిని ఆకట్టుకునేందుకు ఈ ముఠా సభ్యులు భారీగా చెల్లించి..ఎక్కువ అమౌంట్​ బెట్​ కాసేలా ఎంకరేజ్​ చేసేవారు. ఎక్కువ మొత్తం కాయగానే వాళ్లను మోసగించి.. నిండా ముంచేవాళ్లు  హనుమకొండ కేయూసీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఇద్దరిని, హనుమకొండ పీఎస్​ పరిధిలో ఒకరిని ఇలా  మోసం చేశారు. ఆ బాధితులు పోలీసులకు  ఫిర్యాదు చేయగా.. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి ఆధ్వర్యంలో కేయూసీ  సైబర్ క్రైం పోలీసులు సంయుక్తంగా  దర్యాప్తు చేసి నిందితులను గుర్తించారు.బెట్టింగ్​ ద్వారా వచ్చిన లాభాన్ని పంచుకునేందుకు అభయ్​ సోమవారం ఉదయం హనుమకొండలోని ప్రసాద్​ ఇంటికి రాగా.. కేయూసీ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సీఐ జనార్ధన్​ రెడ్డి తన సిబ్బందితో వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ ద్వారా వచ్చిన రూ.2 కోట్ల 5 లక్షల 14 వేల తో పాటు  బ్యాంక్ పాసు బుక్​లు, ఏటీఎం కార్డులు,  సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సాల్వ్​చేసిన డీసీపీ  పుష్పారెడ్డి, హనుమకొండ  ఏసీపీ జితేందర్ రెడ్డి, కేయూ సీఐ  జనార్ధన్ రెడ్డి, ఎస్సై  సంపత్, ఏఏవోలు ప్రశాంత్, సల్మాన్‌‌‌‌‌‌‌‌షా, హెడ్ కానిస్టేబుల్ మల్లారెడ్డి, కానిస్టేబుళ్లు  రత్నాకర్​, అశోక్, మధు, జగదీష్ తదితరులను వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి అభినందించారు.

బాల్​ టు బాల్​ బెట్టింగ్​ 
అభయ్ తో పాటు ముంబైకి చెందిన మరికొంతమంది క్రికెట్​ బెట్టింగులకోసం ఓ వెబ్​ సైట్​ నిర్వహించేవారు. యూత్​ను అట్రాక్ట్​ చేసి వారికి వాట్సాప్​ ద్వారా వెబ్​సైట్​ లింకులు పంపి  ప్రతి మ్యాచ్​కు సంబంధించి ..  ఓవర్​ టు ఓవర్​, బాల్​ టు బాల్​ బెట్టింగులు నిర్వహించేవారు. క్రీజ్​ లో ఉండే బ్యాట్స్​ మెన్​, బౌలర్ల మీద కూడా బెట్టింగ్​చేయించేవారు. ఒక్కోసారి వెయ్యి బెట్ పెడితే లక్ష వరకు వస్తాయని నమ్మించేవారు. టీ20 వరల్డ్​ కప్​, న్యూజీలాండ్​, ఇండియా మ్యాచ్ లకు సంబంధించి జోరుగా  బెట్టింగ్​ చేశారు. బెట్​ కాసిన వారికి కొందరికి డబుల్​, మరికొందరికి  పది రెట్ల అమౌంట్​ చెల్లించేవారు. ఒకేసారిభారీగా అమౌంట్​ వస్తుండటంతో చాలామంది ఆన్​ లైన్​ క్రికెట్​, పేకాట బెట్టింగులకు అలవాటు పడ్డారు. ముంబై నిర్వాహకులు ప్రసాద్​కు మొత్తంలో కమీషన్ ఇచ్చేవారు. బెట్టింగ్​ చేయాలనుకునేవారు నగదుగా లేదంటే ఆన్​లైన్​లో ప్రసాద్​కు డబ్బులిస్తే వారికి వెబ్​సైట్​లింక్​ పంపేవాడు. రోజువారీ లావాదేవీల ప్రకారం తన కమీషన్​ తీసుకుని మిగతా అమౌంట్​ బుకీ అయిన అభయ్ కు పంపేవాడు. ఈ దందాలో క్యాష్​ రొటేషన్​ కోసం ప్రసాద్​ తన బంధువుల పేరున బినామీ అకౌంట్లు మెయింటేన్​ చేసేవాడు. ఇలా వచ్చిన డబ్బులతో ప్రసాద్​ ప్లాట్లు కొన్నాడు.