క్రెడిట్ కార్డు పేరుతో రూ. 1.75 లక్షలు టోకరా

క్రెడిట్ కార్డు పేరుతో రూ. 1.75 లక్షలు టోకరా

గండీడ్, వెలుగు: క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని ఫోన్ చేసి ఒ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి సైబర్ మోసగాళ్లు డబ్బులు మాయం చేశారు. ఈ ఘటన మహమ్మదాబాద్ మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. దేశాయిపల్లి గ్రామానికి చెందిన భీంరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత 5 నెలల క్రితం క్రెడిట్ కార్డు తీసుకొని 2 సార్లు ఆన్లైన్ షాపింగ్ చేశాడు. 2 నెలల తరువాత క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని సైబర్ మోసగాళ్లు ఫోనులో మాట్లాడారు. దీంతో అతను పెంచాలని వారికి సూచించాడు. వెంటనే క్రెడిట్ కార్డు అప్రూవ్ అయ్యిందని అతని ఫోన్ కి వెంట వెంటనే 5 సార్లు మెసెజ్ లు వచ్చాయి. అతరువాత ఆయన ఖాతాలో ఉన్న రూ, 1,75000 డబ్బులు ఖాళీ అయ్యాయి. 

ఆ వెంటనే భీంరెడ్డిని బ్యాంకు మెయిన్ బ్రాంచ్ నుంచి అధికారులు ఫోన్ చేసి ముందస్తు సమాచారం అందించారు. 5 సార్లు ఒకే మెసెజ్ వచ్చిందని.. ఫోన్ హాక్ అయ్యిందని అధికారులు చెప్పడంతో ఆయన షాక్ తిన్నాడు. దగ్గరలోని బ్రాంచ్ మేనేజర్ ను సంప్రదించి తన ఖాతాను నిలిపివేయించాడు. ఆన్లైన్ షాపింగ్ లో ఫ్రీ చార్జీ పేరిట మెసెజ్ వచ్చి డబ్బులను సైబర్ మోసగాళ్లు కాజేశారని భీంరెడ్డికి బ్యాంకు అధికారులు తెలిపారు. 

భీంరెడ్డి వెంటనే సైబర్ క్రైం అధికారులను సంప్రదించాడు. దగ్గరలోని పోలీస్టేషన్ లో బ్యాంకు ఖాతాకు సంబంధించిన పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలని బ్యాంకు అధికారులు సూచించారు. ఆ మేరకు వెంటనే బ్యాంకు ఖాతా నుంచి సైబర్ మోసగాళ్లు డబ్బులు మాయం చేశారని ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహమ్మదాబాద్ ఎస్సై తెలిపారు.