వైరు తెగింది.. సేవలు ఆగాయి

వైరు తెగింది.. సేవలు ఆగాయి

ఉప్పల్ ఆర్టీఏ ఆఫీస్​లో పూర్తిగా సేవలు నిలిచిపోయాయి. ఇంటర్ నెట్ కనెక్షన్  సర్వీస్ వైర్ తెగిపోవటంతో ఆన్ లైన్ సేవలు పనిచేయలేదు. ఉదయం పదిన్నర గంటలకు ఇంటర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్ పనిచేయటం లేదని గుర్తించిన అధికారులు దాదాపు రెండు గంటల పాటు వేచి చూశారు. ఆ తర్వాత కూడా ఇంటర్ నెట్ సేవలు పునరుద్దించే అవకాశం లేకపోవడంతో ఇక చేసేదేమీ లేక టెక్నికల్ రీజన్స్ కారణంగా సేవలు నిలిపివేసినట్లు బోర్డు పెట్టేశారు. ఆర్టీఏ కార్యాలయం గేట్లను మూసివేశారు. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం స్లాట్స్ బుక్ చేస్తుకున్న వారందరినీ తిరిగి పంపించేశారు. శనివారం స్లాట్ బుక్ చేసుకున్న వారందరీ స్లాట్స్ ఆటోమేటిక్ గా సోమవారం నాటికి మూవ్ అవుతాయని అధికారులు తెలిపారు. ఐతే  వాహనాదారులు మాత్రం ఆర్టీఏ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఏ సేవల కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారిలో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులే ఎక్కువగా ఉంటారు. వీరంతా తమకు వీలైన రోజు చూసుకొని స్లాట్ బుక్ చేసుకున్న వారే. కానీ శనివారం కాకుండా సోమవారం మళ్లీ రావాలంటే తమకు వీలు కావద్దా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీఏ లో జరిగిన తప్పులకు తాము ఇబ్బంది పడాలా అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంటర్ నెట్ సేవల వైర్లు తొలగించారు

ఉప్పల్ ఆర్టీఏ ఆఫీస్​సమీపంలో కరెంట్ పోల్ ఒరగడంతో దీన్ని బాగు చేసే క్రమంలో ఎలక్ట్రిక్ అధికారులు ఇంటర్ నెట్ సేవలు అందించే వైర్లను పూర్తిగా కత్తిరించేశారు. అదే పోల్ నుంచి బీఎస్ఎన్ఎల్, బీమ్ సర్వీస్ కేబుల్ ను ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయానికి సర్వీస్ అందిస్తున్నారు. దీంతో అటు బీఎస్ఎన్ఎల్, ఇటు బీమ్ కనెక్షన్లు రెండు పనిచేయకుండా పోయాయి.

సోమవారం రాకపోతే డబ్బులు పోయినట్లే

ఆర్టీఏ కార్యాలయాల్లో ఇంటర్ నెట్ సర్వీస్ సమస్య వచ్చినప్పుడల్లా జనాల జేబులకు చిల్లు పడుతోంది. ఏ రోజైతే సమస్య వచ్చిందో ఆ రోజు బుక్ అయిన స్లాట్లంన్నిటిని ఆటోమేటిక్ గా  మరుసటి రోజుకు మూవ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ ఆ మరుసటి రోజు వచ్చేందుకు వీలుకాని వారు చాలా మంది ఉంటున్నారు. వీరంతా స్లాట్ మోడిఫికేషన్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ అంతకముందు స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి కన్నా గంట ముందు లోపే మళ్లీ స్లాట్ మోడిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా మంది తాము స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి ఆర్టీఏ కార్యాలయాల్లోనే ఉండటంతో వారు మోడిఫికేషన్ చేసుకునే అవకాశం లేకుండా పోతోంది. మరుసటి రోజు వీలుకాక రాలేని వారు తాము కట్టిన ఫీజును లాస్ కావాల్సి ఉంటోంది. ఇక లర్నింగ్ లైసెన్స్ విషయానికొస్తే ఈ సేవలకు మోడీఫికేషన్ ఆప్షనే లేదు. దీంతో ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో శనివారం ఎల్.ఎల్. ఆర్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారంతా సోమవారం రావాల్సిందే. లేదంటే వారికి మరో అవకాశం లేనట్లే.