
కేరళలోని కన్హన్గడ్లో ఉంటోంది పార్వతి. అక్కడ్నించి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువతూర్ చంద్రామతి సొంతూరు. ఈ ఇద్దరు రిటైర్డ్ స్కూల్ టీచర్స్ ట్రెడిషనల్ కాటన్, ఖాదీ చీరల్ని అమ్ముతూ నెలకి చెరో ఇరవై వేలు సంపాదిస్తున్నారు. డిగ్రీ చదువుతున్న ఇరవై మూడేండ్ల ఆశ కూడా కుర్తీలు అమ్ముతూ నెలకి పాతికవేల దాకా సంపాదిస్తోంది. అయితే ఈ ముగ్గురూ వాళ్ల ప్రొడక్ట్స్‌ని మార్కెట్ చేస్తోంది మాత్రం ‘ఎంపవరింగ్ విమెన్ ఎంపవర్మెంట్’ అనే ప్లాట్ఫామ్లో. వీళ్లలాంటి మరెందరో ఎంట్రప్రెనూర్స్కి అతిపెద్ద మార్కెట్‌గా నిలుస్తున్న ఈ ప్లాట్‌ఫామ్ నడుపుతోంది 35 ఏండ్ల సంగీత అభయ్. అందుకుగానూ ఈ మధ్యే ‘వరల్డ్ విమెన్ ఎంట్రప్రెనూర్’ అవార్డు అందుకుంది ఆమె.
ఈవీ (ఎంపవరింగ్ విమెన్ ఎంపవర్మెంట్)లో నెలల పిల్లల నుంచి తొంభై ఏండ్ల బామ్మల వరకు కావాల్సిన బట్టలు ఉంటాయి. అవి కూడా మగ్గంపై నేసినవి. వెదురు, మట్టి, అరటి నార, కొబ్బరి చిప్పలు, ఆల్చిప్పలతో చేసిన డెకరేషన్ ఐటమ్స్, జువెలరీ కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. అలాగే ఆడవాళ్లు ఈ వెబ్సైట్లో చీరలు, చుడిదార్లు కొని..మళ్లీ అందులోనే అమ్మేయొచ్చు. అందుకోసం ఎలాంటి ఫ్రాంచైజీ ఫీజు కట్టాల్సిన పనిలేదు. ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు. ఈ గ్రూప్‌లో చేరితే చాలు, ప్రపంచంలో ఏ మూల నుంచైనా బట్టలు, వస్తువుల్ని వెబ్సైట్, సోషల్ మీడియా ద్వారా సేల్ చేయొచ్చు. అందుకోసం ట్రైనింగ్ కూడా ఇస్తారు వీళ్లు. ఇది ఎలా మొదలైందంటే..
భర్త ప్రోత్సాహంతో..
బయో కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా చేరింది సంగీత . కానీ, చిన్నప్పట్నించీ ఆమె మనసంతా ఫ్యాషన్ డిజైనింగ్ మీదే ఉండటంతో బిడ్డ పుట్టాక అటుగా వెళ్లింది. ఫ్యాషన్ డిజైనింగ్‌కు సంబంధించిన కోర్సు ఒకటి చేసింది. ఆ తర్వాత బట్టలు, ఇతర ఫ్యాషన్ యాక్సెసరీస్‌ని ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా కొనడం, అమ్మడం మొదలుపెట్టింది. ఆలోపు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న భర్త తిరిగి ఇండియాకి వచ్చాడు. సొంత బిజినెస్ వైపుగా ఆమెని ప్రోత్సహించాడు. దాంతో షాపు తెరవడానికి కేరళలోని నిలేశ్వర్లో ఒక గది అద్దెకు తీసుకున్నా.. కొన్ని కారణాల వల్ల ఆ షాపు ఆలోచన పక్కనపెట్టింది. వీవర్స్, కస్టమర్స్‌కి మధ్యనున్న గ్యాప్‌కి ఒక వారధిలా ఉండేలా ఏదైనా చేయాలనుకుంది.
ఆ ఆలోచనే ముందుకు నడిపించింది
ఆ ఆలోచనతోనే ‘ఈవీ’ ని తీసుకురావాలనుకుంది. కేరళ స్టేట్ స్టార్టప్ మిషన్ సహకారానికి తోడు పది లక్షల లోన్ తీసుకొని ముందుకెళ్లింది. మొదటి ప్రయత్నంగా పదిహేడు మంది చేనేత కార్మికులతో కలిసి వెబ్సైట్లో బట్టలు అమ్మింది. ఆ ఫార్ములా సక్సెస్ కావడంతో పెద్దపెద్ద ఇన్వెస్టర్స్ వెతుక్కుంటూ వచ్చారామె దగ్గరకు. దాంతో బిజినెస్ మరింత విస్తరించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 225 మంది విమెన్ ఎంట్రప్రెనూర్స్ ఉన్నారు ఈవీ వెట్సైట్లో. వీళ్లలో ప్రతి ఒక్కరికీ వెబ్సైట్లో సబ్ డొమైన్స్ ఉంటాయి. దీనివల్ల వాళ్ల బ్రాండ్స్‌ని కస్టమర్స్ ఈజీగా గుర్తుపట్టొచ్చు. అలాగే ఇందులో రీసెల్లర్స్ కోసం ప్రత్యేకంగా ఇ– స్టోర్లు ఉంటాయి. ఫేస్బుక్ పేజీ, వాట్సాప్ గ్రూప్‌లలో మాదిరే ఉంటుంది ఈ యాప్. ఇందులో వస్తువులు అమ్మొచ్చు, కొనొచ్చు. ఇంతమంది ఆడవాళ్లకి ఉపాధి చూపిస్తున్నందుకు హాంకాంగ్‌కి చెందిన ‘ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్’ సంగీతకి ఈ మధ్య వరల్డ్ విమెన్ ఎంట్రప్రెనూర్ అవార్డు ఇచ్చింది.
మార్కెటింగ్ తెలియక చాలామంది చేనేత కార్మికులు తక్కువ ధరకే సరుకుని వ్యాపారులకు అమ్ముతున్నారు. అలాకాకుండా వాళ్లని నేరుగా కస్టమర్స్‌తో కనెక్ట్ చేయడానికే ఈ ప్లాట్‌ఫాం తీసుకొచ్చాం. వ్యాపారం చేసే చొరవ.. టెక్నాలజీకి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఉన్న మహిళలు ఎవరైనా ఈవీ వర్చువల్ షాపు నడపొచ్చు. దీని ద్వారా వస్తువుల్ని అమ్మొచ్చు, కొనొచ్చు. స్టార్టప్ పెట్టిన ఐదేండ్లలోనే గ్లోబల్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది.
- సంగీత