భార్య సంపాదనపై భర్త పెత్తనం

భార్య సంపాదనపై భర్త పెత్తనం

హైదరాబాద్, వెలుగు: దేశంలో 14 శాతం మంది ఆడవాళ్ల సంపాదనపై పూర్తి పెత్తనం మగవాళ్లే చెలాయిస్తున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్‌‌‌‌ సైన్సెస్‌‌‌‌(ఐఐపీఎస్) వివాహిత మహిళలపై చేసిన సర్వే తేల్చింది. 18 శాతం మంది మహిళలే తమ డబ్బులను స్వేచ్ఛగా ఖర్చు పెడుతున్నారని సర్వే వెల్లడించింది.  దేశంలో 32 శాతం మంది ఆడవాళ్లు ఉద్యోగాలు, బిజినెస్ లాంటి రకరకాల పనులు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. కష్టం మహిళలదే అయినా, డబ్బులు ఖర్చు చేసే విషయంలో మాత్రం భర్తలే కీలకపాత్ర పోషిస్తున్నారు. తమ సంపాదనను ఎలా ఖర్చు చేయాలో భర్తలే నిర్ణయిస్తారని.. ఈ విషయంలో తమ అభిప్రాయానికి చోటు లేదని 14 శాతం మంది మహిళలు చెప్పినట్టు సర్వే వెల్లడించింది. అయితే, భర్తతో చర్చించి, ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటామని 68 శాతం మంది మహిళలు చెప్పుకొచ్చారు. 

రాష్ట్రంలో పరిస్థితి

తెలంగాణలో 53 శాతం మంది వివాహిత మహిళలు డబ్బులు సంపాదిస్తున్నట్టు సర్వేలో తేలింది. ప్రతి వంద మంది మహిళల్లో 25 మంది, తమ సంపాదనపై భర్తలే పెత్తనం చెలాయిస్తున్నట్టు చెప్పారు. మిగిలిన 75 శాతం మందిలో.. 60 శాతం భర్తతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, 15 శాతం మంది సొంతగానే నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సర్వే రిపోర్ట్‌‌‌‌ పేర్కొంది.