
- గురుకులాల కార్యదర్శిగా బడ్జెట్..ఖర్చుపై అవగాహన ఉంది
- కేసీఆర్, కేటీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా?
- దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి సరే..పల్లెలు, గూడాల సంగతేంది?
- ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు పాపం తాకుద్ది
కాగజ్ నగర్, వెలుగు: ఆదివాసీల అభివృద్ధికి ప్రతీ సంవత్సరం రూ.15 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నా గూడాల్లో ఉన్న ఆదివాసీ గిరిజనుల బతుకులు మారడం లేదని, వానాకాలం వాగులు ఉప్పొంగి వాటిని దాటలేక ప్రజలు ప్రాణాలు పోతుండడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్ సర్కార్.. గిరిజనులకు చేసిన మేలు, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఏడేండ్ల పాటు గురుకులాల కార్యదర్శిగా పని చేసిన తనకు బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల మీద పూర్తి అవగాహన ఉందని, దమ్ముంటే సీఎం కేసీఆర్, కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
ఆదివాసీల అభివృద్ధి కోసం కొమురం భీమ్ స్పూర్తితో మరో పోరాటం చేయక తప్పదన్నారు. తాను చచ్చినా బతికినా సిర్పూర్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాగజ్ నగర్, సిర్పూర్(టి) మండలాల్లోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిర్పూర్ లో ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవ సభలో మాట్లాడుతూ రూ. వంద కోట్లతో హైదరాబాద్ దుర్గం చెరువు మీద రంగుల బ్రిడ్జి కట్టిన కేటీఆర్.. పల్లెల్లో, గూడాల్లో ఎందుకు రోడ్లు, బ్రిడ్జిలు కట్టరని ప్రశ్నించారు. దుర్గం చెరువు బ్రిడ్జి మీద వెళ్లేవాళ్లు మాత్రమే ఓట్లు వేయలేదని, సిర్పూర్ లోని పల్లె ప్రజలు కూడా వేశారని గుర్తుంచుకోవాలన్నారు. వాగు దాట లేక అవస్థ పడిన టీచర్లు తమ గోడు చెప్పుకుంటే సస్పెండ్ చేయించిన ఎమ్మెల్యే కోనప్పకు వారి పాపం తగులుద్దన్నారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప తనను ఎదిరించిన వాళ్లమీద కేసులు పెట్టించి జైలుకు పంపుతున్నాడని ఆరోపించారు.
గిరిజన నాయకుడు సోయం చిన్నన్న మీద ‘ఉపా’ కేసు పెట్టి జైలుకు పంపారని, దీన్ని ఆదివాసీ సమాజం గుర్తించాలని కోరారు. ఆదివాసీ బిడ్డలు అడవులు, గూడాలు దాటి కార్లల్లో తిరుగుతూ, డాలర్లు సంపాదించాలని, దీనికోసం తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత నెల సీఎం గొప్పగా పోడు పట్టాలు ఇచ్చినట్టు చేసి ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లతో గుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, దీన్ని సహించేది లేదన్నారు. సిర్పూర్ టి మండలం కేశవపట్నంలోని 40 మంది నుంచి పోడు పట్టాలు వాపస్ ఇవ్వాలని ఫారెస్ట్ ఆఫీసర్లు ఒత్తిడి చేస్తున్నారని, ఇది ఆపకపోతే ఊరుకునేది లేదన్నారు. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి, అర్షద్ హుస్సేన్, జిల్లా అధ్యక్షుడు మోర్లే గణపతి,రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కని సంజయ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్, అసెంబ్లీ అధ్యక్షుడు రామ్ ప్రసాద్ పాల్గొన్నారు.
గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలి
గ్రూప్-2 పరీక్షను 3 నెలలు వాయిదా వేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్చేశారు. కాగజ్ నగర్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒకే నెలలో గ్రూప్ –4, గురుకులం, గ్రూప్ –2 ఎంట్రెన్స్ పరీక్ష రాయడం ఎంత కష్టమో సర్కార్ కు తెలియదా అని ప్రశ్నించారు. గ్రూప్ 2 పరీక్ష డేట్ మార్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదన్నారు. దీనిపై సీఎం ప్రకటన చేయాలన్నారు. గృహలక్ష్మి పథకానికి అప్లై చేసుకోవడానికి మూడు రోజుల టైం పెట్టడం కరెక్ట్కాదన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయితీల్లో నిధుల దుర్వినియోగంపై వారంలో కలెక్టర్ చర్యలు తీసుకోకపోతే రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి కలెక్టరేట్ముట్టడిస్తామని హెచ్చరించారు.