కేసీఆర్​ కుటుంబ పాలనకు రోజులు దగ్గరపడ్డయ్‌

కేసీఆర్​ కుటుంబ పాలనకు రోజులు దగ్గరపడ్డయ్‌

తెలంగాణ ప్రజలు సహనానికి సెలవు చెప్పి, మరోసారి యుద్ధానికి సిద్ధం కావడానికి సమయం ఆసన్నమయింది. ‘కేసీఆర్​ కుటుంబ పాలనకు రోజులు దగ్గరపడ్డయ్‌’ అని చాటిచెప్పడానికి, మునుగోడు ఉపఎన్నిక రూపంలో రాష్ట్ర ప్రజలకు మంచి అవకాశం వచ్చింది. ఈ ఉపఎన్నిక 2023లో తెలంగాణలో జరిగే శాసనసభ సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్‌ వంటిది. 2014లో టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో 32 పేజీలు, 2018లో 15 పేజీలుగా ప్రకటించింది. వాటిల్లో చెప్పిన అంశాల్లో ఎన్ని అమలు చేశారో,  నెరవేర్చారో వైట్​పేపర్ విడుదల చేసే దమ్మూ, ధైర్యం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉందా? చౌటుప్పల్‌ లో నెలరోజుల్లోపు డిగ్రీ కాలేజ్‌ ప్రారంభిస్తానని, 15 రోజుల్లో గట్టుప్పల్‌ను మండలంగా మారుస్తామని, లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని సీఎం కేసీఆర్‌ 2018 ఎన్నికల సందర్భంగా మునుగోడులో ఇచ్చిన హామీ ఏమైంది? ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఇటీవల గట్టుప్పల్‌ను మండల కేంద్రంగా ప్రకటించారు. విజ్ఞులైన తెలంగాణ ప్రజలు, మునుగోడు ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. మునుగోడు గడ్డ మీద కేసీఆర్‌ అడుగుపెట్టడానికి ముందు ఆయన గతంలో ఇచ్చిన హామీల అమలు ఏమైందో లెక్క చెప్పాలె.  ఆ తర్వాతే ఓట్లడగాలె.

ఇచ్చిన హామీలేమైనయ్..

మునుగోడులో లక్ష ఎకరాలకు సాగునీరు అందించారా? రైతులందరికీ రుణమాఫీ చేశారా? పాలిటెక్నిక్‌ కాలేజ్ వచ్చిందా? వందపడకల ఏరియా ఆసుపత్రిని ఏర్పాటు చేశారా? డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు నిర్మించిన్రా? ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెల1వ తేదీన జీతాలు ఇస్తున్రా? వాడ వాడకు సిమెంట్‌ రోడ్లు, డ్రైనేజీ ఏర్పాటు చేసిన్రా? ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి డాంబర్‌ రోడ్డు వేయించిన్రా? ఎస్టీలకు12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తమన్నరు? కల్పించిన్రా? ఈ అంశాలన్నీ 2014 టీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో అక్షర రూపంలో ఇచ్చిన హామీలే. వీటిలో ఎన్ని నెరవేర్చిన్రు, ఎన్ని నెరవేర్చలేదో తెలంగాణ సమాజం, విజ్ఞులైన మునుగోడు ప్రజలు ఆలోచించాలె. ఈ హామీలపై ఓట్ల కోసం మీ వద్దకు వచ్చే టీఆర్‌ఎస్‌ నాయకులను, కార్యకర్తలను నిలదీయాలె! ఇంటికో ఉద్యోగమంటిరి, ఇచ్చిన్రా? ఉద్యోగం ఇయ్యలేకపోతే, నిరుద్యోగ భృతి నెలకు రూ.3,016 ఇస్తమంటిరి కనీసం అదైనా ఇచ్చిన్రా? ఇస్తే ఎంతమందికి ఇచ్చిన్రో కేసీఆర్‌ లెక్క చెప్పాలె. కేజీ టు పీజీ ఉచిత విద్య నా కల అన్న మీరు, ఫీజులు కట్టలేక జనం అప్పుల పాలైతుంటే చోద్యం చూస్తుంటిరి. చదువుకునే బడిని, బతుకుదెరువు చూపే కాలేజీని బాగు చెయ్యకపోతిరి. కష్ట పడి చదువుకున్నోళ్లకు ఉద్యోగమూ ఇయ్యకపోతిరి. మరి మీకెందుకు ఓట్లెయ్యాలె? తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ యువతకు ఈ లెక్క చెప్తేనే, టీఆర్‌ఎస్‌ నాయకులకు మునుగోడులో ఓట్లు అడిగే హక్కు ఉంటుంది. రైతన్నకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తమంటిరి, చేసిన్రా? ఉచిత ఎరువులు ఇస్తమంటిరి, ఏమాయె? మొన్న యాసంగిలో వరేస్తే ఉరే అని రైతులను అరిగోస పెట్టి, నష్టాల్లో ముంచితిరి. మీ వల్ల  రైతులకు ఏం మేలు జరిగిందో లెక్కలు చెప్పి మునుగోడులో ఓట్లు అడగండి. 

ప్రతి వర్గం మోసపోయింది

దళితుడినే సీఎంను చేస్తనని దగా మాటలు చెప్పి, గద్దెనెక్కితిరి. మూడెకరాల భూమిస్తనని ఇంకోసారి మోసం చేస్తిరి. ఉపఎన్నికల నాటకంలో దళిత బంధు పాచికలేసి, గులాబీ అస్మదీయులకే పది లక్షలు ఇస్తుంటిరి. మీ వల్ల ఎంతమంది దళితులకు ఎలాంటి మేలు జరిగిందో లెక్క చెప్తేనే, మీకు మునుగోడులో ఓట్లు అడిగే హక్కు ఉంటుంది. ఎంబీసీలకు ప్రతి బడ్జెట్‌లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తమన్న మాట ఉత్తదే అని మొన్న ఆర్టీఐ ద్వారా మేం పెట్టిన దరఖాస్తుకు ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానమే సాక్ష్యం. బీసీలకు ఇస్తమన్న స్వయం ఉపాధి రుణాలు అటేపాయె. నేతన్నలను పట్టించుకుంటలేరాయే, గొల్ల కురుమలను, ముదిరాజ్‌లను కోటీశ్వరులను చేస్తమని కోటలు దాటే మాటలు చెప్పి ఏండ్లు దాటుతున్నా.. చేతలు మాత్రం నేటికీ గడప దాటకపాయె. గౌడన్నలను ఆదుకునేందుకు ఒక్క మంచి పని కూడా చెయ్యలె. మోడ్రన్‌ సెలూన్లు కట్టిస్తమని నాయీ బ్రాహ్మణులను, ప్రభుత్వ సంస్థల్లో ఉపాధి కల్పిస్తమని రజకులను.. ఇట్ల ఒక్కటేంది, బీసీల్లో ప్రతి వర్గాన్ని టీఆర్‌ఎస్‌ మాయ మాటలతో మోసం చేసింది. తెలంగాణలో ఉన్న బీసీలకు మీరు చేసిన మేలేంటో లెక్క చెప్పినంకనే మునుగోడులో ఓట్లు అడగాలె. 

ఉప ఎన్నిక వస్తేనే నిధులా?

కాంగ్రెస్‌ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల్లో 12 మందిని సంతలో పశువుల్లాగ కొనడం తెలంగాణ సమాజం ఎన్నటికీ మర్చిపోదు.  రాజీనామా చేయించకుండా, మీ పార్టీలో అప్రజాస్వామికంగా వారిని ఎందుకు చేర్చుకున్నరని అడిగితే, అభివృద్ధి కోసమేనంటూ ప్రచారం చేయడం సిగ్గుచేటు. టీఆర్‌ఎస్‌ లో చేరితేనే అభివృద్ధికి నిధులిస్తరా? ప్రజల గొంతు, ప్రతిపక్షం ఉండొద్దా? ప్రజాస్వామ్యం బతకొద్దా? ఇతర పార్టీల నుంచి అధికార పార్టీల్లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అదనంగా ఏపాటి అభివృద్ధి జరిగిందో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, సీఎం బహిరంగంగా లెక్కలు చెప్పాలె. బీజేపీ మీలాగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొని, వారిపై గులాబీ స్టాంపు వేసుకునే రకం కాదు. ఇప్పటి వరకు ఎవరు మా పార్టీలో చేరినా, వారి సభ్యత్యానికి రాజీనామా చేసినంకే వచ్చిన్రు. అది మా పార్టీ  నైతిక విలువల సిద్ధాంతం. 

ఉప ఎన్నికలు జరిగిన దుబ్బాక, నాగార్జున సాగర్‌, హుజూరాబాద్‌ నియోజకవర్గాల్లో అదనంగా ఎన్ని నిధులు కేటాయించారు? ఎన్ని వరాలు కురిపించారన్నదాన్ని గమనిస్తే, ఉపఎన్నికలు జరిగితేనే నిధులు వస్తాయన్నది సుస్పష్టం. ఉపఎన్నిక వస్తేనే అభివృద్ధి చేస్తామన్నట్టుగా సాగుతున్న పక్షపాత పరిపాలనకు నిరసనగా విలువలకు కట్టుబడి, పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నిజాయితీగా బీజేపీలోకి వస్తున్న రాజగోపాల్‌ రెడ్డి నిర్ణయం సరైందా? లేక మీ అప్రజాస్వామిక, పక్షపాత విధానాలు సరైనవా? మునుగోడు నియోజకవర్గ ఓటర్ల ముందున్న గొప్ప అవకాశం, ఏది సరైందో తీర్పు చెప్పే ఓటు ఇప్పుడు వారి చేతిలో ఉంది. ఏది తప్పో, ఏది ఒప్పో హుజూరాబాద్‌ ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే తీర్పునిచ్చారు. 

కాంగ్రెస్​ను ప్రజలు ఎలా నమ్ముతరు?

12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయినప్పుడు, కనీసం ఒక నిరసన కూడా తెలపని కాంగ్రెస్‌ పార్టీ ఈ రోజు రాజగోపాల్‌ రెడ్డి మీద, బీజేపీ మీద బురద చల్లుతుంటే తెలంగాణ ప్రజలు పాలేవో, నీళ్లేవో  గుర్తించలేరనుకుంటున్నరా? సైకిల్‌ గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్‌ రెడ్డిని, కనీసం రాజీనామా కూడా చేయించకుండా 2017, అక్టోబర్‌ 31న కాంగ్రెస్‌ లో చేర్చుకున్నరు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయించకుండా, పరాయి పార్టీ ప్రజాప్రతినిధికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని అప్పగించిన విలువల్లేని పార్టీ కాంగ్రెస్‌. కనీస నైతిక బాధ్యతలేని ఆ పార్టీలో ఉన్న నాయకుల మాటల్ని తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్ముతరు? బీజేపీని బూచిగా చూపించి, పాలక పార్టీలకు కొమ్ముకాయడం వామపక్షాలకు అలవాటుగా మారిపోయింది. నాడు దొరల ఆగడాలకు ఎదురుతిరిగిన చరిత్ర వామపక్షాలకు ఉంది. కానీ, నేడు రాష్ట్రంలో దొరలాగ నియంతృత్వ పాలన చేస్తున్న కేసీఆర్‌కు పరోక్షంగా సహకరిస్తూ ‘‘ఎర్ర గులాబీల్లా’’ మారిపోవడం వారి చేతగానితనానికి నిదర్శనం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో సహా సీపీఐ నుంచి గెలిచిన దేవరకొండ ఎమ్మెల్యేను ప్రలోభాలకు గురి చేసి, టీఆర్‌ఎస్‌ ప్రతిపక్షాలను మింగుతుంటే ఈ వామపక్ష నాయకులు కొంచెమైన ప్రతిఘటించిన్రా? ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకోవాలని పాకులాడుతూ, పాలక పక్షానికి సహకరించడం తప్ప తెలంగాణ వచ్చినంక ఈ గడ్డకు మేలు చేసిన పోరాటమేదైనా వామపక్షాలవారు చేసిన్రా? శత్రువును గుర్తించకుండా యుద్ధాలు చేసేవాళ్లు మిత్రులను చంపేస్తరన్నట్టుగా, వామపక్షాల అగ్రనాయకత్వ వైఖరికి గ్రామ గ్రామాన వెలసిన అమరవీరుల స్తూపాలు ఘోషిస్తున్నయ్‌. ఎన్నికలొస్తే జూటా మాటలు, ఎన్నికలయిపోయినంక మాయ మాటలు ఎమిమిదేండ్ల సంది ఇయ్యే నడుస్తున్నయ్. ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఆటలు ఇక సాగవు. సాలు దొర సెలవు దొర .. చెప్పే సమయం దగ్గరకొచ్చింది. నీళ్లు నిధులు నియామకాలతో విలసిల్లే సస్యశ్యామల తెలంగాణ కోసం మునుగోడు నుంచి కవాతు చేద్దాం, గడీల రాజ్యానికి, కుటుంబ పాలనకు చరమగీతం పాడుదాం.

- బండి సంజయ్‌ కుమార్‌,
కరీంనగర్​ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు