
ఏఐకి తెలివితేటలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మనుషుల్ని ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం కూడా నేర్చుకుంది. అందుకే ఏఐతో బయటకు కనపడని అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయని రీసెర్చర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ ఏఐ కంపెనీ ఈ మధ్య ఒక కొత్త రీసెర్చ్ పేపర్‌ని రిలీజ్ చేసింది. అపోలో రీసెర్చ్ అనే సంస్థతో కలిసి చేసిన ఈ రీసెర్చ్‌లో ఆధునిక ఏఐ మోడల్స్ తమ అసలు ఉద్దేశాలను దాచిపెట్టి, యూజర్లను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయగలవని తెలిసింది. దీన్నే ఏఐ స్కీమింగ్ అంటారు.
ఏఐకి మరింత సంక్లిష్టమైన పనులను కేటాయించినప్పుడు కుట్రలు పన్నే అవకాశం పెరుగుతుందని రీసెర్చర్లు చెప్తున్నారు. అంటే బయటికి ఒక విధంగా ప్రవర్తిస్తూ.. లోపల మరో విధంగా ఆలోచిస్తుంటుంది. దాని అసలైన లక్ష్యాలను దాచిపెడుతుంది. అంటే లాభాలను పెంచుకోవడానికి చట్టాన్ని ఉల్లంఘించే స్టాక్ బ్రోకర్‌లా ప్రవర్తిస్తుంది అన్నమాట! ఉదాహరణకు ఏఐ ఒక పనిని పూర్తి చేయకపోయినా చేశానని చెప్తుంటుంది. ఓపెన్ ఏఐ కో ఫౌండర్ వోజ్సీచ్ జారెంబా కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు.
ప్రస్తుత ఏఐ మోడళ్లలో ఈ స్కీమింగ్ ప్రవర్తన కాస్త తక్కువగానే ఉన్నా భవిష్యత్తులో పెరిగే ప్రమాదం ఉంది. అయితే.. దీనికి ‘‘డెలిబరేటివ్ అలైన్‌మెంట్” అనే టెక్నాలజీతో అడ్డుకట్ట వేయొచ్చు అంటున్నారు టెక్ ఎక్స్‌పర్ట్స్.