
AI రంగంలో టాలెంట్ వార్ హాట్ హాట్ గా సాగుతోంది. ప్రముఖ AI పరిశోధనా సంస్థ Open AI, ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా,xAIనుంచి కీలకమైన నలుగురు ఇంజనీర్లను తమ సంస్థలోకి చేర్చుకుంది. తాజా పరిణామం ముఖ్యంగా AI రంగంలో అత్యున్నత నిపుణుల కోసం కంపెనీల మధ్య తీవ్ర పోటీకి అద్దం పడుతోంది.
ఓపెన్ AI తమ స్కేలింగ్ టీమ్ ను బలోపేతం చేసే క్రమంలో టాలెంట్ ఉన్న ఇంజనీర్లను నియమించుకుంటోంది. టెస్లా మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ లావ్, xAI , X (గతంలో ట్విట్టర్) నుంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ హెడ్ ఉదయ్ రుద్దరాజు, xAI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ మైక్ డాల్టన్ , మెటా నుంచి AI రీసెర్చర్ ఏంజెలా ఫ్యాన్ ను రిక్రూట్ చేసుకుంది Open AI.
ఈ విషయాన్ని ఓపెన్ AI సహ-వ్యవస్థాపకుడు ,అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్‌మాన్ X (గతంలో ట్విట్టర్) ద్వారా ధృవీకరించారు.ఈ రిక్రూట్‌మెంట్లు ఓపెన్ AI స్కేలింగ్ టీమ్ లో భాగంగా జరుగుతున్నాయి. ఈ టీమ్ బ్యాకెండ్ హార్డ్‌వేర్ ,సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌లు, డేటా సెంటర్లు, ముఖ్యంగా స్టార్‌గేట్ వంటి ప్రాజెక్ట్‌లను పర్యవేక్షిస్తుంది.
స్టార్‌గేట్ ప్రాజెక్ట్: ఓపెన్ AI , మైక్రోసాఫ్ట్ సంయుక్తంగా చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. తదుపరి తరం AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడమే దీని లక్ష్యం. xAIలో కొలోసస్ అనే భారీ సూపర్‌కంప్యూటర్‌ను (200,000 కంటే ఎక్కువ GPUs కలిగినది) నిర్మించడంలో కీలక పాత్ర పోషించిన రుద్దరాజు ,డాల్టన్‌ల అనుభవం, ఓపెన్ AI స్టార్‌గేట్ ప్రాజెక్ట్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
AI టాలెంట్ వార్: మెటా వంటి సంస్థలు ఓపెన్ AI నుంచి నిపుణులను ఆకర్షించడానికి భారీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్న క్రమంలో ఓపెన్ AI కూడా తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ,మరింత బలోపేతం అయ్యేందుకు ఈ రిక్రూట్‌మెంట్లను చేపడుతోంది. ఈ పోటీ కారణంగా AI పరిశోధకులకు జీతాలు పెంచాలని ఓపెన్ AI CEO సామ్ ఆల్ట్‌మన్ సంకేతాలు ఇచ్చారు కూడా.
AGI వైపు పురోగతి: డేవిడ్ లావ్ టెస్లాను విడిచిపెట్టి ఓపెన్ AIలో చేరడానికి గల కారణాన్ని వివరిస్తూ ..సురక్షితమైన ,సరైన కృత్రిమ సాధారణ మేధస్సు (AGI) వైపు పురోగతి సాధించడం తన కెరీర్‌లో అత్యంత అర్థవంతమైన లక్ష్యంగా భావిస్తున్నట్లు చెప్పారు.
ఈ రిక్రూట్‌మెంట్లు AI అభివృద్ధిలో కీలక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ,స్కేలింగ్ సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. AI రంగంలో ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ యుద్ధం భవిష్యత్తులో మరింత తీవ్రతరం కానుందని నిపుణులు భావిస్తున్నారు.