హంగేరి నుంచి ఢిల్లీకి చేరిన చివరి ఫ్లైట్

హంగేరి నుంచి ఢిల్లీకి చేరిన చివరి ఫ్లైట్

ఉక్రెయిన్ యుద్ధ భూమిలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ఓ కొలిక్కి వచ్చింది. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా ఇప్పటికే దాదాపు 18 వేల మందిని కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి చేర్చింది. ఇందుకోసం కమర్షియల్ ఫ్లైట్స్‌తో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రాన్స్‌పోర్ట్ విమానాలను సైతం వినియోగించడంతో పాటు తరలింపు ఆపరేషన్‌లో సమస్యలు రాకుండా ఉండేందుకు ఉక్రెయిన్ పొరుగు దేశాలకు నలుగురు కేంద్ర మంత్రులను పంపింది. ఉక్రెయిన్ సిటీల్లో ఉన్న భారత విద్యార్థులు, పౌరులు ఆ దేశ సరిహద్దుకు చేరుకుంటే.. అక్కడి నుంచి పక్కన ఉన్న స్లొవేకియా, హంగేరి, పోలాండ్, రొమేనియా దేశాల నుంచి ప్రత్యేక విమానాల్లో ఇండియాకు చేరుస్తోంది. అయితే సరిహద్దులు దాటాక మన పౌరులకు వీసా సహా ఇతర సమస్యలు రాకుండా డాక్యుమెంటేషన్ సాఫీగా సాగేలా దగ్గరుండి కేంద్ర మంత్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా హంగేరి వెళ్లిన కేంద్ర మంత్రి హర్‌‌దీప్‌ సింగ్ పూరీ ఇవాళ స్వదేశానికి తిరిగొచ్చారు. ఉక్రెయిన్ నుంచి హంగేరి రాజధాని బుడాపెస్ట్‌ చేరుకున్న భారతీయుల చివరి బ్యాచ్‌తో స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌‌ ద్వారా వెల్లడించారు.

బుడాపెస్ట్‌ నుంచి మన విద్యార్థుల చివరి బ్యాచ్‌తో ఢిల్లీ చేరుకోవడం సంతోషంగా ఉందంటూ కేంద్ర మంత్రి హర్‌‌దీప్‌ సింగ్ పూరీ ట్వీట్ చేశారు. హంగేరి నుంచి మొత్తంగా 6,711 మందిని భారత్‌కు తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మన యువత స్వదేశానికి చేరుకోవడం ఎంతో ఉపశమనాన్ని ఇవ్వడంతో పాటు తనలో చాలా సంతోషాన్ని నింపిందన్నారాయన.

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణ బడ్జెట్ లైవ్ అప్‎డేట్స్

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం: జెలెన్స్కీకి మోడీ ఫోన్ కాల్ 

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్