360 మంది పిల్లలకు విముక్తి ..ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ సక్సెస్

360 మంది పిల్లలకు విముక్తి ..ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ సక్సెస్

సిద్దిపేట/మెదక్/సంగారెడ్డి, వెలుగు: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పిల్లల సంరక్షణ, బడీడు పిల్లలను బడిలో చేర్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ సక్సెస్ అయింది. ఈ ఆపరేషన్​లో పోలీస్, చైల్డ్ వెల్ఫేర్, లేబర్, ఎడ్యుకేషన్, చైల్డ్ ప్రొటెక్షన్, హెల్త్ డిపార్ట్​మెంట్ల అధికారులు పాల్గొన్నారు. ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ బాల కార్మికులను గుర్తించారు. జులై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 360 మంది పిల్లలకు విముక్తి లభించింది. అధికారులు వివిధ చోట్ల గుర్తించిన  పిల్లలను కొందరిని తల్లిదండ్రుల వద్దకు చేర్చగా, మరి కొందరిని బడుల్లో చేర్పించారు. నిబంధనలకు విరుద్ధంగా పిల్లలతో పనులు చేయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. 

సిద్దిపేట జిల్లాలో..

జిల్లాలో 94 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. వారిలో 10 మంది బాలికలుండగా  84 మంది బాలురున్నారు. వీరిలో తెలంగాణ, ఏపీ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్​గఢ్, నేపాల్, బిహార్, కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మేఘాలయ రాష్ట్రాలకు చెందిన వారున్నారు. అధికారులు కొందరిని వారి తల్లిదండ్రులు, బంధువులకు అప్పగించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇదే సమయంలో బాల కార్మికులతో పని చేయించుకుంటున్న యజమానులపై 27 కేసులు నమోదు చేశారు.

ఆపరేషన్ ముస్కాన్ కు  నోడల్ అధికారిగా సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవీందర్, కంట్రోల్ రూమ్ ఇన్​స్పెక్టర్​మల్లేశం గౌడ్  వ్యవహరించారు.  బాల కార్మికుల సమాచారం అందించే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని సీపీ అనురాధ తెలిపారు. డయల్ 100 కు గానీ సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 సమాచారం అందించాలని సూచించారు.

సంగారెడ్డి జిల్లాలో.. 

జిల్లాలో ఈసారి ఆపరేషన్ ముస్కాన్- ద్వారా 126 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. వీరిలో 119 మంది బాలురు, ఏడుగురు బాలికలు ఉన్నారు. పిల్లలను కార్మికులుగా పనిలో పెట్టుకున్న 81 మందిపై కేసులు నమోదు చేశారు. అధికారులు కొంతమందిని వారి తల్లిదండ్రులకు అప్పగించగా మరికొందరిని ప్రభుత్వ  హాస్టళ్లల్లో చేర్పించారు. బడీడు పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరితోశ్​పంకజ్​హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే చైల్డ్ లైన్ నెంబర్ 1098 లేదా డైల్ 100కు  సమాచారం అందించాలని సూచించారు. 

మెదక్ జిల్లాలో..

ఆపరేషన్ ముస్కాన్ లో  భాగంగా మెదక్ జిల్లాలో 140 మంది పిల్లలను గుర్తించారు. అధికారులు వారిని సీడబ్ల్యూసీ ముందు హాజరుపరచగా తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి అప్పగించారు. పిల్లల్ని పనిలో పెట్టుకున్న వారిపై 90 కేసులను నమోదు చేశారు.  జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్​ముస్కాన్​ దిగ్విజయంగా కొనసాగిందని  ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు జరిగే ప్రదేశాలు, వ్యాపార సముదాయాల వద్ద  పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారిని తల్లిదండ్రులకు అప్పగించామన్నారు.