కాశ్మీరానికి సిందూరం

కాశ్మీరానికి సిందూరం

పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిపిన భారత్ క్షిపణి దాడుల దెబ్బకు షాక్ తిన్న ఆ దేశం అత్యవసర పరిస్థితిని ప్రకటించి ముఖ్యమైన కొన్ని విమానాశ్రయాలను మూసివేసింది. దాడి జరిగిన దృశ్యాలు కొన్ని మనదేశ మీడియాలో కూడా ప్రసారమైనవి. మన గగనతలాన్ని ఛేదించి భారత్ ప్రయోగించిన క్షిపణి దాడులను నిరోధించడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నిజానికి పాకిస్తాన్ భారత్ క్షిపణి దాడులను తిప్పి కొట్టడానికి చైనా నుంచి దిగుమతి చేసుకున్న శక్తిమంతమైన రాడార్ లను ప్రయోగించి లబ్ధి పొందవచ్చని భావించింది. 

కానీ,  ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. బుధవారం నాడు మాక్ డ్రిల్ ప్రారంభం కానుండగా, అంతకుమునుపే అనూహ్యంగా, అకస్మాత్తుగా అర్ధరాత్రి దాడి జరిపి అనుకున్న పనిని పూర్తి చేసింది భారత ప్రభుత్వం. భారతదేశ పటానికి ముకుటాయమానమైన కాశ్మీర్ నుదుటిపై సిందూర తిలకం దిద్దిన ఆపరేషన్ సిందూర్ విజయం మన సాయుధ బలగాలు, ప్రభుత్వం సమన్వయంతో సాధించిన ఘనకార్యం. నేర్పుతో పన్నిన వ్యూహరచన, మూడు బలగాల సంఘటిత కార్యాచరణ పథకం ఫలవంతమై చారిత్రాత్మక విజయాన్ని తెచ్చిపెట్టాయి. 

ఆపరేషన్ సిందూర్  

మొదటి నుంచి యుద్ధానికి మనమేమి కాలు దువ్వడం లేదు. పహల్గాం దాడులకు పాల్పడిన వారిని, సీమాంతర ఉగ్రవాదానికి తెగంచేవారిని కఠినాతి కఠినంగా శిక్షించే లక్ష్యంగా కార్యాచరణ రచించడం జరిగింది. ముష్కరుల ఉగ్రవాద చర్యలకు  ప్రతీకార చర్యగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేసిన ఈ దాడులు జైషే మొహమ్మద్, లష్కర్ తోయిబా వంటి పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాద సంస్థల స్థావరాలపై గురిపెట్టినవి మాత్రమే. గతంలో భారత్​పై జరిగిన అనేక ఉగ్రదాడులలో ఈ రెండు సంస్థల ప్రత్యక్ష పరోక్ష ప్రమేయం జగమెరిగిన సత్యం. ఈ దాడులు నేరుగా భారత భూభాగం నుంచి మూడు దళాల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించినవే. 

పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్​లో తొమ్మిది రాష్ట్రాలలో గల ఉగ్రస్థావరాలపై గురిపెట్టి మునుపెన్నడూ చేయని భారీ స్థాయిలో జరిగిన ఈ దాడులు దాయాది దేశానికి ఒక గుణపాఠం కావాలి. కుక్కతోక వంకరలా ప్రవర్తించే పాకిస్తాన్ మిలిటరీ పాలకులకు ఇది మింగుడు పడని వ్యవహారం. ఎప్పుటికైనా పాకిస్తాన్ బరితెగించి మనపై దుస్సాహసానికి పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి విజయోత్సాహంతో ఉదాసీనత చూపరాదు. పొంచి ఉన్న ముప్పు కింద భావించి సరిహద్దుల్లో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. 

పాక్ బలాలు, బలహీనతలు  

ఎన్నో విషయాలలో మనకన్నా అత్యంత బలహీనంగా ఉన్న చిన్న దేశమే పాక్​. అంతర్గత సమస్యలతో అతలాకుతలం అవుతున్నా, కాశ్మీర్ నెపంతో భారత్ పై విషం చిమ్ముతూనే ఉండడం దాని డీఎన్ఏలోనే ఒక భాగంగా మారింది. వారికి ఉన్న బలం కొంతమేరకు అభివృద్ధి చేసుకున్న అణు సామర్థ్యం మాత్రమే. అయితే వాటిని విచక్షణారహితంగా ప్రయోగించడానికి వీలు కాదు. వాటి వాడకంపై అంతర్జాతీయ స్థాయిలో అనేక నిబంధనలు, ఆంక్షలు ఉన్నాయి. ఈ దాడులతో భారతదేశం తాత్కాలికంగా పొందిన ఆనందాన్ని శాశ్వత దుఃఖంగా మార్చేవిధంగా భర్తీ చేస్తామని పాకిస్తాన్ ఆర్మీ అధికారులు డబ్బా కొట్టుకోవడం వారి న్యూనతాభావానికి అద్దం పడుతోంది. 

పొరుగు దేశాల భేదాలు, విభేదాలు 

భారతదేశం తగిన సమయంలో తగినవిధంగా మిసైల్స్ ప్రయోగించి పాకిస్తాన్ ఉగ్రస్తావరాలపై మెరుపు దాడి చేసింది. పాకిస్తాన్​కి బలం లేకున్నా కవ్విస్తూ, యుద్ధానికి కాలు దువ్వింది. భారతదేశం ఉగ్రదాడికి ప్రతి చర్యగా ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా పరిమిత దాడికి పూనుకుంది. పాక్ పాలకులు, మిలిటరీ అధికారులు, విపక్షాల మధ్య సమన్వయ లోపంతో కొట్టుమిట్టాడుతుండగా, భారత దేశం అన్ని పక్షాల ఐక్యతతో ఒకే మాట, ఒకే లక్ష్యంతో సాయుధ బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పరిమిత దాడులను కొనసాగించి విజయాన్ని సాధించింది. 

పాకిస్తాన్ నియంత్రణరేఖ వద్ద భారత పౌర స్థావరాల వద్ద ఉద్రిక్తతలు రేపుతూ కాల్పులు ప్రారంభించగా, భారతదేశం ఉగ్రవాదుల స్థావరాలపై మాత్రమే ఖచ్చితమైన లక్ష్యాన్ని గురిచూసి దాడి చేసింది. పాక్​ తమ దేశాన్ని కాపాడమని, యుద్ధానికి సహాయం చేయమని ప్రపంచ దేశాల ముందు మోకరిల్లింది. భారతదేశం మర్యాదపూర్వకంగా మిత్ర దేశాలకు మిలిటరీ దాడి సమాచారాన్ని అందించింది. పొరుగు దేశానికి మనకు ఉన్న తేడా అదే. 

దుర్ఘటనకు గురైన బాధితుల ఆత్మకు శాంతి 

పహల్గాం ఉగ్ర దాడిలో మరణించిన తన తమ్ముడి ఆత్మకు శాంతి కలిగేలా చేసిన కేంద్ర ప్రభుత్వానికి సౌరబ్ అనే పౌరుడు శతకోటి ధన్యవాదాలు తెలిపాడు. దుర్ఘటనలో మరణించిన వారందరి ఆత్మలు శాంతిస్తాయని ఉగ్రవాదులకు, వారి సహాయకులకు సరైన గుణపాఠాన్ని నేర్పారని సంతోషాన్ని వెలిబుచ్చాడు. ఉగ్రదాడిలో తమవారిని కోల్పోయిన కుటుంబీకులే కాదు యావత్ జాతి సంతో షించదగిన సందర్భం ఇది. 

పహల్గాం

ఉగ్రదాడిని  ఖండించిన రష్యా, అమెరికా, యూకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా దేశాలకు ఉగ్రవాద స్థావరాలపై నిర్దేశిత క్షిపణి దాడుల విషయాన్ని భారత ప్రభుత్వం తెలియజేసింది. గతంలో ఇరు దేశాలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ప్రస్తుతం ఈ వివాదం త్వరలో సమసి పోవాలని కోరుతున్నట్టు సన్నాయి నొక్కులు నొక్కడం ఊహించినదే. 

- ఆర్. సి. కుమార్,సోషల్​ యాక్టివిస్ట్​-