సత్తా చాటిన.. ఓపెన్‌‌హైమర్

సత్తా చాటిన.. ఓపెన్‌‌హైమర్

ఆస్కార్‌‌‌‌.. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి అందమైన కల. సినీ కళాకారులు, టెక్నీషియన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ప్రపంచ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే అకాడెమీ అవార్డులు (ఆస్కార్‌‌‌‌) ప్రదానోత్సవం ఆదివారం రాత్రి (మన దేశంలో సోమవారం తెల్లవారు ఝామున) లాస్‌‌ ఏంజిల్స్‌‌లో జరిగింది. డాల్బీ థియేటర్‌‌‌‌లో గ్రాండ్‌‌గా జరిగిన ఈ96వ ఆస్కార్ అవార్డుల వేడుకలో అందరూ ఊహించినట్టుగానే ‘ఓపెన్‌‌ హైమర్‌‌‌‌’ చిత్రం ప్రధాన విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. దీని తర్వాత ‘పూర్ థింగ్స్‌‌’ చిత్రానికి నాలుగు విభాగాల్లో పురస్కారాలు వచ్చాయి. బార్బీ, ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వంటి పలు చిత్రాలకు అవార్డులు దక్కాయి.

ఇప్పటికే బాఫ్టా, గోల్డెన్‌‌ గ్లోబ్‌‌ అవార్డుల్లో సత్తా చాటిన ‘ఓపెన్‌‌ హైమర్‌‌‌‌’ చిత్రం ఆస్కార్‌‌‌‌ రేసులోనూ సత్తా చాటింది. ఉత్తమ హీరో, దర్శకుడు సహా మొత్తం 13 నామినేషన్లలో ఏడింట్లో అవార్డులను సొంతం చేసుకుంది. కీలకమైన కేటగిరీల్లో అవార్డులు రావడం విశేషం. అణుబాంబును క‌‌నిపెట్టిన శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్‌‌హైమర్ జీవిత చ‌‌రిత్ర ఆధారంగా దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్‌‌ ఈ బయోగ్రాఫికల్‌‌ థ్రిల్లర్‌‌‌‌ను తెరకెక్కించారు. గత ఏడాది జులై 21న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్‌‌ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది.

సుమారు వంద మిలియన్‌‌ డాలర్లతో తెరకెక్కించగా బాక్సాఫీస్‌‌ దగ్గర వెయ్యి మిలియన్ డాలర్ల కలెక్షన్స్‌‌ రాబట్టింది. గత ఏడాది హాలీవుడ్‌‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో చిత్రం ఇదే. వరల్డ్‌‌ వార్‌‌‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో వచ్చిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్‌‌ రాబట్టిన సినిమాగానూ రికార్డ్‌‌ క్రియేట్ చేసింది. తాజాగా ఆస్కార్ అవార్డుల్లోనూ మెప్పించడం విశేషం. 

నోలన్‌‌కు తొలి ఆస్కార్‌‌‌‌

బెస్ట్ డైరెక్టర్‌‌‌‌గా తొలిసారి ఆస్కార్ అందుకున్నాడు జీనియస్ డైరెక్టర్ నోలన్. ఎన్నో క్లాసిక్ మూవీస్‌‌ తీసిన ఆయన, కెరీర్‌‌‌‌లో ఫస్ట్ టైమ్‌‌ ఓ బయోపిక్ తీశారు. దాదాపు మూడేళ్లు ఆయన పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. దాదాపు ఎనిమిది సార్లు నామినేషన్స్‌‌లో నిలిచిన ఆయన మొదటిసారి ఈ అవార్డును అందుకున్నారు. ‘ది ట్రయంఫ్‌‌ అండ్‌‌ ట్రాజెడీ ఆఫ్‌‌ జె రాబర్ట్‌‌ ఓపెన్‌‌హైమర్‌‌’ అనే పుస్తకం ఆధారంగా నోలన్ దీన్ని తెరకెక్కించారు. ఇందులోని న్యూక్లియర్ బాంబ్ బ్లాస్టింగ్‌‌ సీన్స్‌‌ను కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా రియల్‌‌గా తీశారు నోలన్. క్వాంటమ్‌‌ డైనమిక్స్‌‌, ఫిజిక్స్‌‌ను వీలైనంత రియలిస్టిక్‌‌గా తీయాలని ఇలా చిత్రీకరించారు. ఇందులో చాలా సీన్స్‌‌ బ్లాక్‌‌ అండ్ వైట్‌‌లో ఉంటాయి. దీంతో తొలి బ్లాక్‌‌ అండ్ వైట్‌‌ ఐమాక్స్‌‌ మూవీగా నిలిచింది. అంతేకాదు మూడు గంటలకు పైగా నిడివితో ఈ చిత్రాన్ని తీశారు. రన్‌‌టైమ్‌‌ ఎక్కువ అయినప్పటికీ ప్రేక్షకులు ఆదరించారు. 

ఏడు కేటగిరీల్లో... 

‘ఓపెన్‌హైమర్‌‌‌‌’లో లీడ్ యాక్టర్‌‌‌‌గా నటించిన సిలియన్ మర్ఫీ ఉత్తమ నటుడిగా ఆస్కార్‌‌‌‌ను అందుకున్నారు. తనకు కూడా ఇది మొదటి ఆస్కార్. ఇందులో అమెరికా అధ్యక్షుడు లూయిస్‌‌ స్ట్రాస్‌‌గా నటించిన రాబర్ట్‌‌ డౌనీ జూనియర్‌‌కు సపోర్టింగ్‌‌ యాక్టర్ కేటగిరీలో ఆస్కార్‌‌‌‌ వరించింది. ఎన్నో సవాళ్లను అధిగమించి సక్సెస్‌‌లోకి వచ్చేందుకు అండగా నిలిచిన భార్య సుసాన్‌‌ డౌనీకి ఈ అవార్డును అంకితం చేస్తున్నానని రాబర్ట్ డౌనీ ప్రకటించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడుతో పాటు బెస్ట్ ఒరిజినల్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ఎడిటింగ్‌‌ కేటగిరీస్‌‌లోనూ‘ఓపెన్‌హైమర్‌‌‌‌’ చిత్రం ఆస్కార్‌‌‌‌ అందుకుంది . 

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు ఇవ్వడానికి డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సీనా ఒంటిపై నూలిపోగు లేకుండా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తర్వాత థియేటర్‌‌‌‌లో లైట్స్ ఆఫ్ చేయగా బట్టలు వేసుకున్నారు. విన్నర్‌‌ను ప్రకటిం చాక ‘పూర్ థింగ్స్‌‌’లో కాస్ట్యూమ్స్‌‌ గాను హోలి వెడ్డింగ్‌‌టన్‌‌కు అవార్డును అందజేశారు. సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్ అవ‌‌సరం ఎంతో చెప్పేందుకే ఇలా చేసినట్టు తర్వాత అతను వివరణ ఇచ్చారు. ఆ కాసేపు అందరూ నవ్వుకున్నప్పటికీ, విమర్శలు కూడా అదే స్థాయిలో వచ్చాయి. 

ఆస్కార్ వేడుకలో మెస్సీ అనే ఓ కుక్క అందరి దృష్టిని ఆకర్షించింది. బెస్ట్‌‌ ఒరిజినల్‌‌ స్ర్కీన్‌‌ ప్లే కేటగీరీలో అవార్డును సొంతం చేసుకున్న ‘అనాటమీ ఆఫ్‌‌ ఎ ఫాల్‌‌’ చిత్రంలో ఇది నటించింది. అవార్డులు అందుకున్న వారిని  ఎంకరేజ్‌‌ చేస్తూ చప్పట్లు కొట్టి, ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలామంది దీనితో ఫొటోలు దిగారు. సోషల్ మీడియాలో మెస్సీ ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. 

10 కేటగిరీల్లో నామినేషన్లను దక్కించుకున్న ‘కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’ చిత్రానికి, అలాగే ఏడు విభాగాల్లో పోటీ పడ్డ ‘మాస్ట్రో’ సినిమాకు ఒక్క అవార్డు రాకపోవడం ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది ఆస్కార్స్‌‌లో ఇండియాకు నిరాశే ఎదురైంది. బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరీలో నామినేట్ అయిన ‘టు కిల్ ఎ టైగర్’ చిత్రానికి అవార్డు దక్కలేదు. 

మరోసారి ఆస్కార్ వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ 

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గతేడాది ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే. ఈసారి ఆ అవార్డు ‘బార్బీ’ చిత్రంలోని బిల్లీ ఏలిష్‌‌ పాడిన ‘వాట్‌‌ వజ్ ఐ మేడ్‌‌ ఫర్‌‌‌‌’ పాటను వరించింది. ఈ అవార్డును ప్రకటించే సమయంలో స్క్రీన్‌‌ పై ‘నాటు నాటు’ పాటను ప్రదర్శించారు. అలాగే బెస్ట్ స్టంట్స్‌‌కు సంబంధించిన స్పెషల్‌‌ వీడియోలోనూ ‘ఆర్ఆర్ఆర్’లోని రెండు యాక్షన్‌‌ సీన్స్‌‌ను చూపించడం విశేషం.  

ఇండియన్ ఆర్ట్‌‌ డైరెక్టర్‌‌‌‌కు దక్కిన ప్రత్యేక గౌరవం

అవార్డుల వేడుకలో భారతీయ ఆర్ట్ డైరెక్టర్ నితిన్‌‌ దేశాయ్‌‌ సేవలను ఆస్కార్ వేదిక స్మరించుకుంది. గత ఏడాది కాలంగా చనిపోయిన లెజెండ్స్‌‌ను గుర్తు చేసుకున్న సందర్భంలో ఈ గౌరవం దక్కింది.  ల‌‌గాన్‌‌, జోధా అక్బర్, దేవదాస్, మున్నాభాయ్ ఎంబీబీఎస్‌‌ లాంటి పలు బాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన ఆయన, గతేడాది ఆగస్టులో కన్నుమూశారు.  నాలుగు సార్లు ఉత్తమ కళా దర్శకుడిగా జాతీయ అవార్డును ఆయన అందుకున్నారు. అలాగే ముంబై సమీపంలో ఎన్‌‌డి స్టూడియోను ఆయన స్థాపించారు. 

విజేతలు వీరే..

ఉత్తమ చిత్రం :  ఓపెన్‌‌హైమర్
ఉత్తమ నటుడు :  సిలియన్ మర్ఫీ, (ఓపెన్‌‌హైమర్)
ఉత్తమ నటి :  ఎమ్మా స్టోన్, (పూర్ థింగ్స్)
ఉత్తమ దర్శకుడు :  క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్‌‌హైమర్)
ఉత్తమ సహాయ నటుడు :  రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌‌హైమర్)
ఉత్తమ సహాయ నటి :  డావిన్ జాయ్ రాండోల్ఫ్, (ది హోల్డోవర్స్)
అడాప్టెడ్ స్క్రీన్ ప్లే :  కార్డ్‌‌ జెఫర్‌‌‌‌పన్ (అమెరికన్ ఫిక్షన్)
ఒరిజినల్ స్క్రీన్ ప్లే  :  జస్టిన్‌‌ ట్రైట్‌‌, అర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్‌‌)
యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ :  ది బాయ్ అండ్ ది హెరాన్
యానిమేటెడ్ షార్ట్ :  వార్ ఈజ్ ఓవర్
ఇంటర్నేషనల్‌‌ ఫిల్మ్ :  ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
డాక్యుమెంటరీ ఫీచర్ : 20 డేస్ ఇన్ మరియుపోల్
డాక్యుమెంటరీ షార్ట్ :  ది లాస్ట్ రిపేర్ షాప్
ఒరిజినల్ స్కోర్ :  (ఓపెన్‌‌హైమర్)
ఒరిజినల్ సాంగ్ :  వాట్‌‌ వాస్‌‌ ఐ మేడ్‌‌ ఫర్‌‌‌‌ (బార్బీ)
సౌండ్ : ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
ప్రొడక్షన్ డిజైన్ :  జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్)
 లైవ్ యాక్షన్ షార్ట్ :  ది వండర్‌‌‌‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్
సినిమాటోగ్రఫీ :  (ఓపెన్‌‌హైమర్)
మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ :  నడియా స్టేసి, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్)
కాస్ట్యూమ్ డిజైన్ :  హోలి వెడ్డింగ్‌‌టన్‌‌ (పూర్ థింగ్స్)
విజువల్ ఎఫెక్ట్స్ :  గాడ్జిల్లా మైనస్ వన్
ఫిల్మ్ ఎడిటింగ్ :  (ఓపెన్‌‌హైమర్)