రాంచీలో కూటమి మెగా ర్యాలీ

రాంచీలో కూటమి మెగా ర్యాలీ
  • శిబు సోరెన్ సహా 28 పార్టీల నేతల హాజరు

రాంచీ : ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్​ సోరెన్​ అరెస్ట్​కు నిరసనగా ఆదివారం విపక్ష ఇండియా కూటమి రాంచీలో భారీ ర్యాలీ నిర్వహించింది.  ‘ఉల్గులన్​ న్యాయ్’ (తిరుగుబాటు న్యాయ మహార్యాలీ) పేరుతో ప్రభాత్​ తారా గ్రౌండ్​లో నిర్వహించిన ఈ మెగా ర్యాలీలో 28 ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. వేదికపై కేజ్రీవాల్, హేమంత్​ సోరెన్​కు ఖాళీ కుర్చీలు వదిలేశారు. అందులో వారి సతీమణులు సునీతా కేజ్రీవాల్, కల్పనా సోరెన్​ ఆసీనులయ్యారు.

జార్ఖండ్​ ముక్తి మోర్చా(జేఎంఎం) కార్యకర్తలు హేమంత్​ సోరెన్​ మాస్కులతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘జైలు గోడలు బద్ధలవుతాయ్​.. హేమంత్​ సోరెన్​ విడుదలవుతాడు’ అంటూ పెద్దపెట్టున నినదించారు. ‘జార్ఖండ్​ ఎవరికీ తలవంచదు’ అనే నినాదాలతో ఆ ర్యాలీ ప్రాంగణం మార్మోగిపోయింది. ఈ ర్యాలీలో కల్పనా, సునీతాతోపాటు జేఎంఎం అధినేత శిబు సోరెన్​, ఎన్సీ​ ప్రెసిడెంట్​ ఫరూఖ్​ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​, ఎస్పీ చీఫ్​ అఖిలేశ్, పంజాబ్​ సీఎం భగవంత్​ మాన్​ తదితరులు పాల్గొన్నారు.

ఇన్సులిన్​ ఇవ్వకుండా చంపే కుట్ర: సునీత

బీజేపీపై  ఢిల్లీ సీఎం ​కేజ్రీవాల్​ భార్య సునీతా కేజ్రీవాల్​ విరుచుకుపడ్డారు. జైల్లో ఇన్సులిన్​ ఇవ్వకుండా తన భర్తను చంపేందుకు కాషాయ పాలకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ తప్పూ చేయకున్నా తన భర్తను అరెస్ట్​ చేసి, జైల్లో పెట్టారని అన్నారు. ‘మేం నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. తప్పకుండా విజయం సాధిస్తాం. కేజ్రీవాల్, హేమంత్ సోరెన్​ త్వరలోనే బయటకు వస్తారు’ అని అన్నారు.

హేమంత్​ సోరెన్ లేఖ చదివిన కల్పన

ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, కానీ ప్రజాస్వామ్యాన్ని తాము విఫలం కానివ్వబోమని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్​ సోరెన్ అన్నారు. జైలునుంచి హేమంత్​ రాసిన లేఖను ఆయన భార్య కల్పనా సోరెన్​ చదివి వినిపించారు. ఈ సందర్భంగా కల్పనా మాట్లాడుతూ.. కేజ్రీవాల్​, హేమంత్​ సోరెన్​ను సరిగ్గా ఎన్నికల ముందే జైల్లో పెట్టారని ధ్వజమెత్తారు. కాగా, బీజేపీని నిర్మూలించి దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకే ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయని బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తెలిపారు.