
- పదేళ్లు ఫామ్ హౌస్ లో పడుకున్న వారే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
- ఖమ్మంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన
ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్, బీజేపీ నేతలు తప్పుగా ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దుబారా ఖర్చులు తగ్గించి, ప్రతి రూపాయి పొదుపుగా వాడుతున్నామని చెప్పారు. గురువారం ఖమ్మంలో మెడికల్ కాలేజీ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బల్లేపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడారు.
గత పాలకులు రూ.7 లక్షల కోట్ల అప్పు చేసి ఏనాడు ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు ఇవ్వలేదన్నారు. ఓడిపోయి ఫామ్ హౌస్ లో, ఖరీదైన భవంతుల్లో పడుకొని అడ్డగోలు ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రూ.70 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, ప్రజలపై అదనంగా ఒక్క రూపాయి భారం మోపడం లేదన్నారు. ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు చెల్లిస్తున్నామని, ఉద్యోగుల సమస్యలకు సమయం తీసుకొని పరిష్కారం చేస్తామని సీఎం చెప్పారన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, అందుకే అధికారుల కమిటీ వేశామని చెప్పారు.
రాష్ట్రంలో 34 ప్రభుత్వ, 29 ప్రైవేట్ కాలేజీల్లో 9,065 మంది స్టూడెంట్స్ ఉచితంగా మెడిసిన్ చదువుకుంటున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం కొత్తగా 8 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందన్నారు. బీఆర్ఎస్ సర్కారు పదేండ్లలో వైద్యరంగానికి రూ.5,959 కోట్లు ఖర్చు చేస్తే, తాము ఏడాదిలోనే రూ.11,482 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే పెండింగ్‌లో ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించామని గుర్తు చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.11,600 కోట్లతో ఒకేసారి 58 యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 57 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 30 వేల ఉద్యోగాల ప్రకటనకు కసరత్తు చేస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతకు చేయూత అందించేందుకు రూ.9 వేల కోట్లతో రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్యం..
మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి నగరాల ప్రజలు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ బ్యాంకు నిధులతో వరంగల్ లో రీజనల్ క్యాన్సర్ సెంటర్, ఖమ్మం జిల్లాలో ఆర్గాన్ రిట్రివల్ సెంటర్, వ్యాసిక్యులర్ యాక్సిస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఖమ్మం జిల్లాలో కొత్తగా 6 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో 90 ట్రామా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, వైద్య శాఖలో 8 వేల పోస్టులు భర్తీ చేశామన్నారు.
మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం మెడికల్ కాలేజీ బిల్డింగ్‌ల నిర్మాణం ఏడాదిలో పూర్తి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం రూ.1,000 కోట్లు బకాయిలు పెండింగ్ లో పెట్టినా వాటిని చెల్లిస్తూ వైద్య శాఖలో కొత్త ఆసుపత్రులు, వైద్య, నర్సింగ్ కళాశాలల నిర్మాణం పూర్తి చేస్తున్నామని తెలిపారు. హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ నరేంద్ర కుమార్ పాల్గొన్నారు.