
- బీజేపీ బలపడుతున్నది.. మునుగోడులో ఇదే కనిపించింది..
- గత ఎన్నికల్లో ఈజీగానే గెలిచినం.. అసలు చాలెంజ్ ముందుంది
- స్కీమ్‌లను ప్రజలు పెద్దగా గుర్తుపెట్టుకుంటలే
- ఓటర్లకు దగ్గరగా లేకనే జీహెచ్‌ఎంసీలో వ్యతిరేక ఫలితాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతున్నదని, రైతుబంధు సహా ఏ స్కీమ్ డబ్బులు వచ్చినా వాళ్లు పెద్దగా గుర్తు పెట్టుకోవడం లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అన్నారు. మునుగోడు ఉప ఎన్నికతో ఇది తేటతెల్లమైందని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన హైదరాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీలు ఎం.ఎస్. ప్రభాకర్ రావు, సురభి వాణిదేవి, ఎమ్మెల్యే సాయన్న మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ బలంగా ఉన్నమాట నిజమే అయినా.. బీజేపీ బలం పెరుగుతున్నదన్న విషయం గుర్తించాలన్నారు. 2014, 2018 ఎన్నికల్లో ఈజీగానే గెలిచామని.. అసలు చాలెంజ్ వచ్చే ఎన్నికల్లో ఎదురుకాబోతున్నదని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో టఫ్ ఫైట్ తప్పదని అన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే ఓడిపోతున్నామని, చేసిన పనులను కూడా ప్రజలకు సరిగా చెప్పలేకపోతున్నామని వాపోయారు. ఓటర్లను కలిసి అభివృద్ధి, సంక్షేమాన్ని చెప్పుకోకపోతే పార్టీకి నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. వంద మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జీని నియమించుకొని ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ఓవర్ కాన్ఫిడెన్స్, ప్రజలకు దగ్గరగా లేకపోవడంతోనే జీహెచ్‌ఎంసీలో వ్యతిరేక ఫలితాలు వచ్చాయని, వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎదురు దెబ్బలు తప్పవని వారు స్పష్టం చేశారు.
తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతున్నదని అందరూ అనుకుంటున్నారని.. అది గాలిబుడగ మాత్రమేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇంకో 20 ఏండ్లు రాష్ట్రంలో ఎగిరేది గులాబీ జెండానేనని చెప్పారు. ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి ఫోన్ ఎట్లా లాక్కుంటారని, రేపు తమకూ టైం వస్తుందని హెచ్చరించారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. బేగంపేట ఎయిర్‌పోర్టులో కేసీఆర్‌ను బెదిరించినట్టు మాట్లాడారని, టీఆర్‌ఎస్‌కు 60 లక్షల మంది కార్యకర్తలున్నారని, వాళ్లు ఢిల్లీని ఎటాక్ చేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోవాలని హెచ్చరించారు.
గుజరాత్‌ను మోడీ అభివృద్ధి చేస్తే ఒక్క పిలుపునిస్తే ఓట్లు పడుతాయి కదా.. గల్లీ గల్లీ తిరిగి ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎవరి తాటాకు చప్పుళ్లకూ టీఆర్‌ఎస్ భయపడబోదని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా ప్రకటించడంతో బీజేపీ నాయకుల్లో భయాందోళన మొదలైందని, అందుకే అనేక రకాల కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. త్వరలోనే అన్ని డివిజన్లలో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తామని చెప్పారు.
మళ్లీ అధికారంలోకి తేవాలి: మహమూద్ అలీ
వెనుకబడిన తెలంగాణను కేసీఆర్ బంగారు తెలంగాణగా మార్చారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. గుజరాత్‌ది జీరో మోడల్ అని.. తెలంగాణ మోడల్ సక్సెస్ ఫుల్ అని చెప్పారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ఎందుకు పెరిగాయో ప్రజలకు ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. నల్ల ధనాన్ని వెనక్కి తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామన్న హామీ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రూ.2 వేల పింఛన్ ఇస్తున్నామని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇంత మొత్తంలో పింఛన్ ఇస్తున్నారా చెప్పాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీలేకుండా పనిచేస్తున్నామని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.
ఉద్యమకారులు ఇబ్బంది పడ్తున్నరు: దానం
‘‘పార్టీలో ఉద్యమకారులు ఇబ్బంది పడుతున్నారు. కార్యకర్తలను కాపాడుకోవాలి. బీజేపీ లీడర్లు బూత్ కమిటీలకు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను పంపుతున్నారు. బయటి నుంచి వార్డుల్లోకి ఎవరైనా వస్తే గల్లా పట్టుకొని అడగాలి. సోషల్ మీడియాలో బీజేపీకి సరిగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నాం. తమకు సంబంధం లేదని ఎవరికి వాళ్లు వదిలేయడం సరికాదు. రేపు ఇలాంటి పరిస్థితి మనకే ఎదురుకావొచ్చు” అని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కష్టపడిన ఉద్యమకారులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత కోరారు. కార్పొరేటర్లతో ఒకసారి సమావేశం ఏర్పాటు చేయించి వాళ్ల సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని వేదికపై ఉన్న మంత్రులను కోరారు.
సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు సార్లు అధికారంలో ఉన్న పార్టీ క్యాడర్‌కు పెద్దగా ప్రయోజనం కలగలేదని, దీనిపై వాళ్లు అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని గుర్తించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్ ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, సాయన్న, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు దాసోజు శ్రవణ్, రావుల శ్రీధర్ రెడ్డి, గజ్జెల నగేశ్, ప్రసన్న, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జీలు తదితరులు పాల్గొన్నారు.