నిరుద్యోగులకు నెలకు రూ.6 వేలు ఇయ్యాలె

నిరుద్యోగులకు నెలకు రూ.6 వేలు ఇయ్యాలె
  • దేశమంతా ఫ్రీగా టీకాలు వేయించాలె.. పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఆపాలె
  • ప్రధాని మోడీకి 9 పాయింట్లతో అపొజిషన్ పార్టీల లేఖ 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వమే ఫ్రీగా కరోనా వ్యాక్సిన్ లు వేయించాలని ప్రధాని నరేంద్ర మోడీకి 12 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు విజ్ఞప్తి చేశాయి. నిరుద్యోగులకు నెలకు కనీసం రూ. 6 వేల ఆర్థిక సహాయం అందించాలని, పార్లమెంట్ కొత్త బిల్డింగ్ (సెంట్రల్ విస్టా) నిర్మాణం పనులను ఆపాలని, కొత్త అగ్రి చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్, జేడీఎస్, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకేతో సహా 12 అపోజిషన్ పార్టీల అధినేతలు 9 పాయింట్లతో ప్రధాని మోడీకి లేఖ రాశారు. దేశంలో ప్రస్తుత కరోనా కల్లోలం ‘మానవ తప్పిదంతో జరిగిన ఒక విషాదం’ అని వారు తేల్చిచెప్పారు. కరోనా కట్టడికి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతకుముందు కూడా తాము విడివిడిగా, కలిసికట్టుగా ఆయా అంశాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినా, పట్టించుకోలేదన్నారు. అయితే ఈ లేఖపై బీఎస్పీ చీఫ్ మాయావతి, ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంతకం చేయలేదు.

అపోజిషన్ పార్టీల డిమాండ్లు ఇవే.. 

  • నిరుద్యోగులకు నెలకు రూ. 6000 ఆర్థిక సాయం చేయాలి. 
  • దేశంలోని కంపెనీలతో పాటు విదేశాల్లోని కంపెనీల నుంచీ కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్లను కొనుగోలు చేయాలి. 
  • వెంటనే అందరికీ ఫ్రీగా వ్యాక్సినేషన్ చేపట్టాలి.
  • దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని విస్తరించేందుకు లైసెన్సులు ఇవ్వాలి. 
  • వ్యాక్సిన్ల కోసం బడ్జెట్​లో రూ.35 వేల కోట్లు కేటాయించాలి. 
  • సెంట్రల్ విస్టా నిర్మాణం ఆపి, ఆ డబ్బును ఆక్సిజన్, వ్యాక్సిన్ లు కొనేందుకు వాడాలి.
  • పీఎంకేర్స్ ఫండ్​లోని మొత్తం నిధులను టీకాలు, ఆక్సిజన్, ఎక్విప్​మెంట్ కొనేందుకు వాడాలి.
  • పేదలకు ఫ్రీగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలి. 
  • రైతులు కరోనా బాధితులుగా మారకుండా కాపాడేందుకు కొత్త అగ్రిచట్టాలను రద్దు చేయాలి.

లెటర్​పై సంతకం చేసినోళ్లు..
సోనియా గాంధీ(కాంగ్రెస్), మమతా బెనర్జీ(టీఎంసీ), శరద్​ పవార్(ఎన్సీపీ), ఉద్దవ్​ థాక్రే(శివసేన), స్టాలిన్(డీఎంకే), సీతారాం యేచూరి (సీపీఎం), హెచ్​డీ దేవెగౌడ(జేడీ), హేమంత్​ సోరెన్(జార్ఖండ్​ ముక్తి మోర్చా), ఫరూక్​ అబ్దుల్లా(జేకేఎన్​సీ), అఖిలేశ్​ యాదవ్(ఎస్పీ), డి.రాజా(సీపీఐ), తేజస్వీ యాదవ్(ఆర్జేడీ).