
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే జీడీపీలో 2 శాతం మేర ఖర్చు తగ్గుతుందని, తద్వారా ప్రజల సంక్షేమానికి ఎక్కువ కేటాయించే చాన్స్ ఉంటుందని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు తెలిపారు. ఖమ్మంలోని హోటల్ కోణార్ లో శుక్రవారం ‘ వన్ నేషన్– వన్ ఎలక్షన్’అంశంపై బీజేపీ అవగాహన సదస్సు నిర్వహించింది. రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఒకే ఎన్నికపై ప్రతిపక్షాల విమర్శలు హాస్యాస్పదమన్నారు.
ఒకేసారి ఎన్నికలు జరిగితే.. ఒకవేళ ప్రభుత్వం కూలిపోతే ఎలా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు. ఇందులో వాస్తవం లేదన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, నేతలు దేవకి వాసుదేవరావు, సన్నే ఉదయ ప్రతాప్, దొంగల సత్యనారాయణ, మందా సరస్వతి తదితరులు పాల్గొన్నారు.