ఉభయ సభల్లో సర్ రగడ..కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసన

ఉభయ సభల్లో  సర్  రగడ..కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసన
  • బిహార్​లో చేపడ్తున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’​పై చర్చకు పట్టు
  • కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసన
  • ప్లకార్డులతో వెల్​లోకి దూసుకెళ్లే ప్రయత్నం
  • లోక్​సభ, రాజ్యసభలో కొనసాగిన వాయిదాల పర్వం

న్యూఢిల్లీ: ఉభయ సభల్లో మంగళవారం కూడా వాయిదాల పర్వం కొనసాగింది. బిహార్​లో చేస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)​పై చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు లోక్​సభలో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సభ్యులు మండిపడ్డారు. బిహార్ చేస్తున్న ‘సర్’పై చర్చకు పట్టుబట్టారు. అన్ని అంశాలపై చర్చిద్దామని ఓవైపు అంటూనే.. మరోవైపు సభను వాయిదా వేస్తోందని మండిపడ్డారు. 

కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని ఫైర్ అయ్యారు. ప్లకార్డులు పట్టుకుని వెల్​లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. స్పీకర్ ఓం బిర్లా కల్పించుకుని.. అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభ్యులు తమ సీట్లలో కూర్చోవాలని రిక్వెస్ట్ చేసినా వినిపించుకోలేదు. నిరసన కొనసాగించడంతో  సభను 12 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన వెంటనే మళ్లీ సభ్యులు లేచి నిలబడి నిరసన తెలియజేశారు. సభ్యులంతా కూర్చోవాలని సభ అధ్యక్షురాలు, బీజేపీ సభ్యురాలు జగదాంబికా పాల్ రిక్వెస్ట్ చేసినా ఎవరూ వినిపించుకోలేదు.

సభ నియమాలు ఉల్లంఘించొద్దు: కిరణ్ రిజిజు

ప్రతిపక్షాల వైఖరిని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. ప్రతిపక్షాలు డిమాండ్ మేరకు ఆపరేషన్ సిందూర్​పై చర్చించేందుకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించిందన్నారు. దానికి టైమ్ కూడా డిసైడ్ అయిందని గుర్తు చేశారు. ముందు ఏం అనుకున్నామో వాటిపైనే సభలో చర్చించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ప్లకార్డులు పట్టుకుని సభలో నిరసన తెలియజేయడం సరికాదని మండిపడ్డారు. ఇది సభ నియమాలను ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. ‘సర్’పై కూడా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ముందు సభను సజావుగా సాగిస్తేనే ఇది సాధ్యం అవుతుందని తెలిపారు. ఎంతో కీలకమైన సమయాన్ని అపోజిషన్ పార్టీలు వృథా చేస్తున్నాయని విమర్శించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కోరారు. అయినా సభ్యులు వినిపించుకోకపోవడంతో జగదాంబికా పాల్.. సభను వాయిదా వేశారు.

ఖర్గే నేతృత్వంలో ఇండియా కూటమి భేటీ

ఇండియా బ్లాక్ నేతలు పార్లమెంట్ ప్రారంభానికి ముందు సమావేశం అయ్యారు. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన భేటీ అయి.. సభలో అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రధాని మోదీ సమక్షంలోనే అన్ని అంశాలపై చర్చ జరిగేలా పట్టుబట్టాలని నిర్ణయించారు. ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ అటాక్, సీజ్​ఫైర్​పై ట్రంప్ స్టేట్​మెంట్, బిహార్​లో ‘సర్’ పై మోదీ సమాధానం చెప్పేలా ఒత్తిడి తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. 

రాజ్యసభలోనూ అదే రగడ

రాజ్యసభలోనూ ‘సర్’పై చర్చించాలని సభ్యులు డిమాండ్ చేశారు. 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రిక్వెస్ట్ చేసినా సభ్యులు పట్టించుకోలేదు. సెషన్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే సభను 12 గంటలకు వాయిదా వేశారు. మరోమారు వాయిదా పడిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు సెషన్ ప్రారంభమైంది. సభ్యులు వెల్​లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం అటాక్, ‘సర్’పై మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసనల మధ్యే ‘ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ 2025’ పరిశీలించేందుకు షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ తీర్మానం ప్రవేశపెట్టారు. తర్వాత సెషన్​ను సభాధ్యక్షుడు 
బుధవారానికి వాయిదా వేశారు.