పీఎంఎల్ఏ సవరణలకు సుప్రీం సపోర్టుపై విపక్షాల అభ్యంతరం

పీఎంఎల్ఏ సవరణలకు సుప్రీం సపోర్టుపై విపక్షాల అభ్యంతరం

ఢిల్లీ: మనీ లాండరింగ్ ​నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) 2019కి చేసిన సవరణలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. సుప్రీంకోర్టు తీర్పును ప్రమాదకరమైన తీర్పుగా అభివర్ణించాయి. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆప్, సీపీఎం, ఎస్పీ, ఆర్జేడీ సహా మొత్తం 17 విపక్షాలు సుప్రీం తీర్పును వ్యతిరేకించాయి. ఈ తీర్పు ఎక్కువకాలం మనుగడలో ఉండదని అవి పేర్కొన్నాయి. ఎన్​ఫోర్స్​మెంట్ ​డైరెక్టరేట్(ఈడీ) వంటి సంస్థలకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ పీఎంఎల్ఏకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సవరణలు చేసింది. కేంద్రం చర్యను సవాల్​చేస్తూ విపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కేంద్రానికి వ్యతిరేకంగా 250 పిటిషన్లు వేశాయి.

కేంద్రానికి అనుకూలంగా తీర్పు  

ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు..  కేంద్రానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈడీ వంటి సంస్థలకు మరిన్ని అధికారాలు కల్పించడాన్ని సమర్థించింది. అయితే ఈడీ వంటి సంస్థలకు మరిన్ని అధికారాలు ఇస్తే, ఆ సంస్థలు అధికారాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని, తమపై రాజకీయ ప్రతీకారానికి పాల్పడవచ్చని ప్రతిపక్షాలు చేసిన వాదనలను కోర్టు కొట్టివేసింది. కోర్టు తీర్పును ఖండిస్తూ విపక్షాలు బుధవారం ఓ ప్రకటనను విడుదల చేశాయి. ఆ తీర్పును సమీక్షించాలని కోరుతూ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని విపక్ష నేతలు తెలిపారు. కాగా రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించిన డేటా ప్రకారం.. గత ప్రభుత్వంతో పోలిస్తే, మోదీ ప్రభుత్వ ఎనిమిదేళ్ల పాలనలో ఈడీ సోదాలు 26 రెట్లు పెరిగాయి. కానీ నేరాల రేటు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. మొత్తం 3,010 మనీ లాండరింగ్​కేసుల్లో 23 మంది మాత్రమే నేరం చేసినట్లు తేలింది.