సేంద్రియ ఎరువులే బెటర్!

సేంద్రియ ఎరువులే బెటర్!

1960వ దశకంలో హరిత విప్లవం పేరిట విదేశాల నుంచి తెప్పించిన కొత్త వంగడాలను భారతదేశంలో ప్రవేశపెట్టారు అమెరికన్లు.  తీవ్ర  కరువుకు ఇవి విరుగుడు అని మొదట్లో చెప్పి, అధిక దిగుబడి వంగడాలని తదుపరి ప్రకటించి మొత్తానికి వ్యవసాయంలో ప్రపంచానికే నాయకత్వం వహించిన భారత్​కు అంటగట్టారు. దీనిని అనుసరించి అధిక దిగుబడికి రసాయన ఎరువులు అవసరమని చెప్పి కృత్రిమ ఎరువులు కూడా జోడించారు.

 1970లో రైతులు తీసుకోకపోతే రాయితీలు, ప్రోత్సాహకాలు, ప్రకటనలు, ఆదర్శం పేరిట క్రమంగా భారత్​ రైతాంగం ఈ రసాయన ఎరువుల మీద ఆధారపడే పరిస్థితికి తీసుకువచ్చారు. కృత్రిమ రసాయన ఎరువులకు ముడి చమురు వాణిజ్యానికి ఉన్న దగ్గరి సంబంధం చాలామందికి తెలియదు. 1970వ  దశకంలో మొదలుపెట్టి  దాదాపు 25 ఏండ్లు చమురు రాజకీయాలు ప్రపంచ దేశాల మీద తీవ్ర ప్రభావం చూపాయి. 

చమురుకోసం, రసాయన ఎరువుల కోసం  భారతదేశం కూడా వివిధ అంతర్జాతీయ సమీకరణాలలో విలువలకు తిలోదకాలు ఇచ్చి పాల్గొనాల్సి వచ్చింది. ఇప్పటికీ మన దేశ స్వావలంబన  కృత్రిమ ఎరువుల మీద ఆధారపడి ఉన్నది.  ఆలోచనా రహితంగా విదేశీ యూరియా అమలు ఓ చారిత్రాత్మక తప్పిదంగా పేర్కొనవచ్చు.

1965 నుంచి భారతదేశంలో రసాయన ఎరువుల వాడకం చిన్నగా మొదలై కేవలం ప్రభుత్వ పెట్టుబడుల వలన  గణనీయంగా పెరిగింది. దీనికి ప్రధానంగా హరిత విప్లవం పేరిట ప్రభుత్వం వివిధ మార్గాలలో అనుసరించిన వ్యూహాలు, ప్యాకేజీలు కారణం అయ్యాయి. అప్పట్లో 1965లో  రసాయన ఎరువుల వాడకం ఎకరానికి కేవలం 3 కిలోలు. ఇది కూడా కొన్ని ప్రాంతాలలోనే ఉండేది. 

1971–72 నాటికి మొత్తం నత్రజని,  భాస్వరం, పొటాషియం వినియోగం 2.65 మిలియన్ టన్నులకు చేరుకుంది - ఎకరానికి 5.4 కిలోలకు పెరిగింది. అధిక దిగుబడినిచ్చే విత్తనాలు రకాల ఉపయోగం పెరగడం వల్ల వాటికి ఎక్కువ పోషకాలు అవసరమవుతాయి కనుక రసాయన, కృత్రిమ ఎరువుల వాడకం కూడా పెరిగింది.  

1990ల ప్రారంభం నాటికి ఎకరానికి 34.4 కిలోలు. ఈ పెరగడంలో కూడా నత్రజని (N) వినియోగం పెరుగుదల అత్యధికం. భాస్వరం (P), పొటాషియం (K)తో పోలిస్తే నత్రజని వినియోగం ఎక్కువ. 2010–11 నాటికి, మొత్తం NPK వినియోగం 28.12 మిలియన్ టన్నులను తాకింది - సగటున ఎకరానికి 54.6 కిలోలు. రసాయన ఎరువుల వాడకంతోపాటు వాటి ఉపయోగంలో ఉండాల్సిన నిష్పత్తి కూడా మారింది. నత్రజని వైపు భారీగా మారింది.  నత్రజని, భాస్వరం, పొటాషియం (ఎన్​పీకే) వినియోగ నిష్పత్తి 4:2:1 కాకుండా 9.5:3.2:1 చేరింది.

13 రాష్ట్రాలలోనే 92 శాతం దేశీయ ఎరువుల వినియోగం

రసాయన ఎరువులు మొదలుపెట్టిన కొంత కాలానికే అధిక దిగుబడులు సాధించినట్టు ప్రకటనలు దశాబ్దాల  కిందటే వచ్చాయి. అప్పటికీ, ఇప్పుడు కూడా రసాయన ఎరువులు వాడే రైతులశాతం 100 శాతం లేదు. అంచనా ప్రకారం 1965లో 10 శాతంలోపే ఉండగా  ఇప్పుడు 95 శాతానికి చేరింది అంటున్నారు. ఇందులో కూడా కొందరు రైతులు 10 బస్తాల కంటే ఎక్కువ వాడుతుండగా, అసలు వాడని రైతులు కూడా ఉన్నారు.  సాగునీటి ప్రాజెక్టుల కింద ఉండే ఆయకట్టు రైతులు ఎక్కువగా రసాయన ఎరువులకు అలవాటుపడ్డారు. 

బోర్​వెల్ వ్యవసాయం కింద అధికశాతం వర్షాకాలం పంటలు వేసేవారు ఎరువుల వాడకం క్రమంగా పెంచుకోవాల్సి వస్తున్నది. రాష్ట్రాల వారీగా  రసాయన ఎరువుల వాడకంలో భారీ తేడాలున్నాయి. ఇటీవలి అధ్యయనాల ప్రకారం, 13 రాష్ట్రాలలోనే 92 శాతం దేశీయ ఎరువుల వినియోగం కేంద్రీకృతం అయ్యింది. ఆయా రాష్ట్రాలలో కూడా భారీ తేడాలున్నాయి. ఆయకట్టు రైతులు విపరీతంగా వాడుతుంటే నీటి కరువు ప్రాంతాలలో అంతగా లేదు.

దేశవ్యాప్త ఎరువుల డిమాండ్650 లక్షల టన్నులు

కేంద్ర ప్రభుత్వం నేరుగా కాకుండా ఎరువుల కంపెనీలకు నిధులు ఇచ్చి మార్కెట్లో తక్కువ ధరకు రసాయన ఎరువులు అందుబాటులోకి తీసుకువస్తున్నది. అయితే, ఈ రకం సబ్సిడీలు రైతులకు ఉపయోగపడవు. కంపెనీలు కనీస ధర రెండింతలు చేసి దాంట్లో సబ్సిడీ పోగా మిగిలింది సబ్సిడీ ధరగా ప్రకటించడంలో ఉన్న మోసం తెలిసిందే. 

సబ్సిడీల తరువాత కూడా రసాయన ఎరువుల ధరలను అందుకోగలిగే రైతులు చాలా తక్కువ.  ఇంకోవైపు,  నేలసారం పడిపోతున్న నేపథ్యంలో  రైతు కచ్చితంగా రసాయన ఎరువులు కొనుక్కోవలసిన పరిస్థితులు ఉన్నాయి.  2025లో భారతదేశ ఎరువుల సరఫరా ఎన్నడూ  లేనివిధంగా సంక్షోభం ఎదుర్కొంటోంది.  పెరుగుతున్న డిమాండ్, దేశీయ ఉత్పత్తి తగ్గడం,  దిగుమతులలో  అంతరాయాల వల్ల ఒక సంక్లిష్ట  పరిస్థితి ఏర్పడింది.  మొత్తం అన్ని రకాల రసాయన ఎరువుల దేశవ్యాప్త డిమాండ్ 650 లక్షల టన్నులు.

ఈ డిమాండ్ అందుకోవడానికే ఆపసోపాలు పడుతున్న ఆధునిక వ్యవసాయ పాలకవర్గం, పూర్తిగా భారత వ్యవసాయానికి అవసరమైన రసాయన ఎరువులు చేయడం అసాధ్యం. భారతదేశంలో ఉన్న 140 మిలియన్ హెక్టార్ల పంట భూమికి 320 లక్షల టన్నుల పోషకాలతో కూడిన రసాయన ఎరువులు కావాలి. 

దాదాపు 70 నుంచి 80 శాతం ఎరువుల దిగుమతుల మీద ఆధారపడి హరిత విప్లవం సాధించగలుగుతామా? ఇంత పరిమాణంలో రసాయన ఎరువులు వాడితే, తలెత్తే పర్యావరణ సమస్యలు ఒక వైపు ఉండగా, భారత వ్యవసాయం మీద పడే భారం రూ.8.41 లక్షల కోట్లు. ఆధునిక వ్యవసాయ పాలకవర్గం రసాయన ఎరువుల దిగుమతి మీద ఆధారపడే ఆహార ధాన్యాల ఉత్పత్తి కోరుకోవడంలో ఉన్న మతలబు ఆశ్చర్యం కలిగిస్తుంది. విదేశాల మీద ఆధారపడితే భారతీయ వ్యవసాయం అధోగతి పాలు అవుతుంది.

కృత్రిమ ఎరువులతో ఆహారం కలుషితం

రసాయన ఎరువుల మీద ఆధారపడి ఉత్పత్తి పెంచిన సగటు రైతును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2024 నుంచి క్రమంగా పుంజుకున్న అంతర్జాతీయ పరిస్థితుల గురించి ముందస్తు సమాయత్తం చేయకపోవడం వల్ల, రైతు కుటుంబాలు విపరీతమైన ఒత్తిడికి  లోనవుతున్నారు. రసాయన ఎరువులు లేనిదే వ్యవసాయం చేయలేం అనే మానసిక స్థితికి చేరుకున్నారు. ఇప్పుడు అనేక రాష్ట్రాలలో, కొన్ని పంటలు, ప్రత్యేకంగా వరి, గోధుమలు, కృత్రిమ ఎరువులు లేకుండా దిగుబడి 10 శాతం కూడా రాని పరిస్థితికి చేరింది. 

ఆహార ఉత్పత్తిలో విప్లవం సాధించామని  ప్రతి రాజకీయ నాయకుడు వల్లె  వేసే ముందు కృత్రిమ ఎరువులు లేకుండా పంటలేని దుస్థితికి చేరుకోవడం వల్ల జరిగే అనర్ధం గురించి కూడా ఆలోచించాలి.  కృత్రిమ ఎరువుల వల్ల ఆహారం కలుషితం అవుతున్నది. నీరు, నేల కలుషితం అవుతున్న తరుణంలో సేంద్రియ ఎరువుల గురించి కొందరు ప్రస్తావిస్తే హరిత విప్లవానికి ఆద్యుడిగా పేరుపొందిన స్వామినాథన్  అది అసాధ్యం అని ప్రకటించి తరువాత అయన తన అభిప్రాయం మార్చుకున్నారు.

 పంజాబ్ సగటు గ్రామీణ వ్యక్తి రక్తంలో నత్రజని ఆనవాళ్ళు ఎక్కువ అయ్యాయి. మూత్రపిండాలు చెడిపోవడానికి కూడా ఇదే కారణంగా చెబుతారు నిపుణులు. ప్రమాదకర క్యాన్సర్ వ్యాధులు రసాయన ఎరువులు, రసాయన కీటకనాశకాల వల్ల వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సహజ ఎరువుల గురించి పెదవి విరిచే మహానుభావులు కృత్రిమ రసాయన ఎరువుల కొరత, విదేశాల నుంచి దిగుమతి అవసరమైనంత మేరకు సరఫరా లేకపోవడం వంటి అంశాలు ప్రస్తావించకపోవడం శోచనీయం. 

భారత వ్యవసాయం ఎదుర్కొంటున్న సమస్యలు

భారత వ్యవసాయం రసాయన ఎరువుల మీద ఆధారపడటం వల్ల ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు మూడు ఉన్నాయి. భారతదేశం పొటాష్‌‌లో 100%, ఫాస్ఫేట్ ఎరువులలో 50–60% దిగుమతి చేసుకుంటుంది. రైతులు నత్రజని (యూరియా)ని ఎక్కువగా వాడుతున్నారు. అది లేకపోతే పంట ఉత్పాదకత దారుణంగా పడిపోతున్నది. అన్నింటిని వాడాలంటే పంట ఉత్పత్తి ఖర్చు పెరుగుతున్నది. ఇప్పటికే ఎరువుల సబ్సిడీలు 2022–23లో  రూ.2 లక్షల కోట్లు దాటాయి.  

కేంద్ర ప్రభుత్వం ఈ సబ్సిడీ భరించటానికి సిద్ధంగా లేదు.  తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నది.  స్థూలంగా, రైతును ఆధునిక, రసాయన ఆధారిత వ్యవసాయం చట్రంలోకి దింపిన ఆధునిక వ్యవసాయ పాలకవర్గం రసాయన ఎరువుల నుంచి ఎదురు అవుతున్న సవాళ్ళను అధిగమించటానికి రైతుకు తగిన సహకారం అందించటానికి ముందుకు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం 28 గ్రేడ్‌‌ల ఫాస్ఫేట్, పొటాషియం (పీ అండ్​కే) ఎరువులను 2010 నుంచి  పోషకాల-ఆధారిత సబ్సిడీ పథకం (ఎన్బీఎస్) ద్వారా రైతులకు అందిస్తున్నది. 

2020–-21లో  పీఅండ్ కే  ఎరువులపై సబ్సిడీకి వేసిన అంచనా వ్యయం కేవలం రూ.22,186.55 కోట్లు. ఇవి కూడా నేరుగా రైతులకు కాకుండా ఎరువుల కంపెనీలకు ఇవ్వాలని అప్పట్లో నిర్ణయించారు. 2025 ఖరీఫ్ సీజన్ (ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు) కోసం, భారత ప్రభుత్వం ఫాస్ఫేట్, పొటాషియం ఎరువుల కోసం రూ.37,216.15 కోట్ల పోషక ఆధారిత సబ్సిడీ ప్యాకేజీని ఆమోదించింది.  ఇది  గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది - 2024–25 రబీ కేటాయింపు కంటే  దాదాపు రూ.13,000 కోట్లు ఎక్కువ. 

నేలసారం పెంచడానికి కృషి చేయాలి

ఎకరానికి రసాయన ఎరువుల వాడకం ఎక్కువగా ఉన్నందున నేల సారం తగ్గడం, నీటి కాలుష్యం, గ్రీన్‌‌హౌస్ వాయు ఉద్గారాలు పెరుగుతున్న ఆందోళన కూడా నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో 2015 నాటికి 2.04 లక్షల టన్నుల ఎరువులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం పదేండ్ల తరువాత కూడా ఈ కేటాయింపును పెంచలేదు.  

కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి దీర్ఘకాలిక ఆలోచన ఉన్నట్లు లేదు. సుస్థిర వ్యవసాయానికి మొట్టమొదట కావాల్సిన మంచి నేల, సారవంతమైన భూమి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. పచ్చిరొట్ట విత్తనాలు విరివిగా సరఫరా చేయాలంటే ఒక సంవత్సరం ముందుగానే ప్రణాళిక చెయ్యాలి.  తగిన నిధులు విత్తన కార్పొరేషన్​కు ఇవ్వాలి. మిశ్రమ పంటలు, పంటల మార్పిడి విధానం రైతులు అవలంబించడానికి తగిన ప్రోత్సాహకాలు, నిధులు ఇవ్వాలి. నేలలలో నత్రజని పెంచే పంటలకు గిట్టుబాటు ధర, బోనస్ ఇస్తే  రైతులు వాటినే వేసుకుంటారు. 

నేలలు పూర్తిగా బలహీనపడిన ప్రాంతాలలో ప్రత్యేక ప్రణాళిక ద్వారా క్రమంగా రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి.  నేల సారం సహజంగా పెంచడం వల్ల దిగుబడులు కూడా సుస్థిరంగా ఉంటాయి. ఆహార ఉత్పత్తిలో పోషకాలు పెరిగితే ప్రజల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది.  ప్రకృతి వనరులు, జీవ వైవిధ్యం పెంపుదల ద్వారా, సహజసిద్ధ సేంద్రియ ఎరువుల ద్వారా తెలంగాణలో నేల సారం పెంచటానికి కనీసం రూ.5 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే ఒక పదేండ్ల కాలంలో వ్యవసాయ దిశ, దశ మార్చవచ్చు.

- డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్​-