ఆర్గానిక్ బెల్లానికి.. భలే డిమాండ్

ఆర్గానిక్ బెల్లానికి.. భలే డిమాండ్
  • చెరుకు సాగు చేసి బెల్లం తయారు చేస్తున్న  
  • కామారెడ్డి జిల్లాలోని పలువురు రైతులు
  • రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్న వినియోగదారులు
  • కిలోకు రూ.100 నుంచి రూ.130 వరకు 

కామారెడ్డి, వెలుగు : జిల్లాలో తయారు చేస్తున్న ఆర్గానిక్​ బెల్లానికి మంచి డిమాండ్​ఉంది. చెరుకు పంట సాగు చేసిన పలువురు రైతులు బెల్లం వండి ఇంటి అవసరాలకు అమ్ముతున్నారు. కొందరు రైతులు రసాయనిక ఎరువులకు బదులుగా.. సేంద్రియ ఎరువులు(ఆర్గానిక్) వినియోగించి చెరుకు పంట సాగు చేసి దీంతో బెల్లం తయారు చేస్తున్నారు. ఈ బెల్లం ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో ప్రజలు నేరుగా రైతుల పొలం దగ్గరకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. కిలో బెల్లం రూ.100 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుంచి రూ.130 వరకు అమ్ముతున్నారు.

బెల్లం తయారీకి కామారెడ్డి జిల్లా ప్రసిద్ధి. జిల్లాలోని భిక్కనూరు, కామారెడ్డి, మాచారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి, దోమకొండ తదితర మండలాల్లో గతంలో బెల్లం తయారీ ఎక్కువగా జరిగేది. ఇక్కడి నుంచి ఏపీతోపాటు మహారాష్ర్ట, కర్నాటక తదితర రాష్ట్రాలకు లక్షలాది క్వింటాళ్ల బెల్లం ఎగుమతి అయ్యేది. ఉమ్మడి ఏపీలో అప్పటి పాలకులు బెల్లం రవాణాపై ఆంక్షలు విధించడంతో తయారీపై తీవ్ర ప్రభావం పడింది.  

పరిస్థితులకు అనుగుణంగా బెల్లం తయారీ..

గతంలో ఇక్కడి రైతులు బెల్లాన్ని పెద్ద ముద్దలుగా చేసి అమ్మేవారు. ఒక్కో ముద్ద 14 కిలోలు ఉండేది. ప్రాసెస్ చేయకుండా వండటంతో బెల్లం కలర్ నల్లగా ఉండేది. ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కొన్నేళ్లపాటు ఇక్కడ బెల్లం తయారీ పూర్తిగా బంద్ అయ్యింది. గత నాలుగేండ్లుగా భిక్కనూరు, సదాశివనగర్ మండలానికి చెందిన పలువురు రైతులు బెల్లం వండటాన్ని ప్రారంభించారు. ఇంటి అవసరాలకు వినియోగించుకునే విధంగా చిన్న చిన్న పీసులుగా చేసి అమ్ముతున్నారు. కామారెడ్డి జిల్లా వాసులే కాకుండా నిజామాబాద్, హైదరాబాద్ తదితర ఏరియాలకు చెందిన వాళ్లు  ఇక్కడికి వచ్చి తమ ఇంటి అవసరాలకు బెల్లం కొనుగోలు చేస్తున్నారు. 

రైతులకు లాభం..

చెరుకు పంటను సాగు చేసి ఇంటి అవసరాలకు అనుగుణంగా బెల్లం తయారీ చేసి అమ్ముతుండటంతో రైతులకు లాభం వస్తుంది. నార్మల్​గా సాగు చేసిన చెరుకుతో తయారైన బెల్లం కిలోకు రూ.100, ఆర్గానిక్​తో సాగు చేసిన బెల్లం కిలోకు రూ.130 చొప్పున అమ్ముతున్నారు.  ఎకరాకు 35 క్వింటాళ్ల నుంచి 40 క్వింటాళ్ల బెల్లం తయారవుతుంది. ఈ లెక్కన ఎకరాకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వస్తుంది. చెరుకు నాటడం, ఏడాది పొడవునా సాగు ఖర్చులు, చెరుకు నరకటం, బెల్లం తయారీకి మొత్తం రూ. 2 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. లాభం రూ.2 లక్షల వరకు వస్తుందని రైతులు చెబుతున్నారు. 

ఆర్గానిక్​తో చెరుకు పంట సాగు..

జిల్లాలో పలువురు రైతులు ఆర్గానిక్​(సేంద్రియ ఎరువులు) ద్వారా చెరుకు పంట సాగు చేస్తున్నారు. సదాశివనగర్ మండలం కుప్పియాల్​కు చెందిన ఇద్దరు రైతులు ఆర్గానిక్​ చెరుకుతో బెల్లం తయారు చేస్తున్నారు. రసాయనిక ఎరువులకు బదులుగా జీవామృతం వాడుతున్నారు. ఆవు పేడ, గోమూత్రం, బెల్లం వండేటప్పుడు తొలగించే చెత్తతో జీవామృతం తయారు చేస్తున్నారు. 

15 ఏండ్లుగా సేంద్రియ వ్యవసాయం

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 15 ఏండ్లుగా సేంద్రియ ఎరువులతో పంట సాగు చేస్తున్నా. కొన్నాళ్లు వరి, కూరగాయలు పండించా. నాలుగేండ్లుగా చెరుకు పంటను సేంద్రియ ఎరువులతో సాగు చేసి బెల్లం తయారు చేస్తున్నా. ఆర్గానిక్​ బెల్లం కావడంతో ఎక్కువ మంది తమ దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు.  - సురుకొంటి మహిపాల్​రెడ్డి, కుప్రియాల్, సదాశివనగర్ మండలం