ఎలక్ట్రిక్ బస్సులపై ఆర్టీసీ దృష్టి

ఎలక్ట్రిక్ బస్సులపై ఆర్టీసీ దృష్టి
  • తొలుత సిటీలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను తిప్పడంపై ఫోకస్
  • ఆ తర్వాత విడతల వారీగా రాష్ట్రమంతా తిప్పాలని యోచన
  • పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని సర్కారు ప్రతిపాదన
  • కొత్త బస్సుల కొనుగోలుకు అడ్డంకిగా కేంద్రం నిబంధనలు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ఏ పద్ధతిలో తీసుకోవాలనే విషయంపై సంస్థ ఉన్నతాధికారులు సీరియస్ గా దృష్టి పెట్టారు. ఎలక్ట్రిక్ బస్సులను ఎలాగో సొంతంగా కొనే పరిస్థితి ఇప్పుడు సంస్థకు  లేకపోవడంతో యాజమాన్యం వద్ద ఇప్పుడు రెండే ఆప్షన్లున్నాయి. ఒకటి ఎలక్ట్రిక్​ బస్సులను అద్దెకు తీసుకొని నడపడం, లేదంటే పాత డీజిల్ బస్సుల ఇంజిన్లను తొలగించి.. వాటిని ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం. ఈ రెండింటిలో ఏది బెటర్​ అయితే.. దాన్నే ఫాలో కావాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తున్నది.

దీనిపై సీరియస్​గా కసరత్తు చేస్తున్నది. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరంలో పర్యావరణాన్ని కాపాడేందుకు, కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సంస్థ అధికారులతో జరిపిన రివ్యూలో ఆదేశించారు. దీంతో ఆర్టీసీ సంస్థ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నది.

ఇప్పుడున్న డీజిల్ బస్సులను క్రమంగా పక్కనపెట్టి.. ఇకనుంచి దశలవారీగా  ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపై తిప్పే ఏర్పాట్లలో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. అయితే కేంద్రం తీసుకువచ్చిన పాలసీ ప్రకారం దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా సరే ఆర్టీసీ సంస్థ ఈవీ ( ఎలక్ట్రిక్ వెహికల్స్​ ) లను కేవలం అద్దెకు మాత్రమే తీసుకోవాలనే నిబంధన కొనసాగుతున్నది.  ఈ పాలసీ ప్రకారం ప్రైవేట్ ఈవీ సంస్థల వద్ద ఈ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం అద్దెకు తీసుకోవాలి.

అయితే, కిలో మీటరుకు సుమారు 60 రూపాయల చొప్పున ఆ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. దీనికే ఆర్టీసీ యాజమాన్యం కొంత మొగ్గు చూపిస్తున్నది. అయితే, పాత డీజిల్ బస్సులకు ఎలక్ట్రిక్ ఇంజిన్లను అమర్చి నడిపితే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను ఆర్టీసీకి ప్రభుత్వం పంపినట్టు సమాచారం. ఇది కొంత భారంతో కూడుకున్నదని ఆర్టీసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినట్టు తెలిసింది.

ఒక్కో డీజిల్ బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మార్చితే సుమారు రూ. 60 లక్షల ఖర్చు అవుతుందని, ఈ డబ్బుతో రెండు పల్లె వెలుగు బస్సులను కొనుగోలు చేయవచ్చని ఆర్టీసీ అధికారుల అంటున్నారు. పైగా ఇంత డబ్బు పెట్టి డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చితే అవి ఎంతకాలం పని చేస్తాయనే విషయంలో గ్యారంటీ కూడా లేదని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ ప్రతిపాదనను పరిశీలించాలని కోరడంతో సంస్థ అధికారులు దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి, ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే ఏర్పాట్లలో ఉన్నట్టు తెలిసింది. 

3 వేల బస్సులు అవసరం

కొత్త ఎలక్ట్రిక్ బస్సును కొనుగోలు చేయాలంటే సుమారు రూ . 2 కోట్ల ఖర్చవుతుంది. ప్రస్తుతం ఆర్టీసీకి 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు అవసరం. అయితే, కేంద్రం నిబంధన మేరకు కొనుగోలు విషయాన్ని పక్కన పెట్టిన ఆర్టీసీ.. ఇప్పటికే సుమారు 120 వరకు ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకొని, నగరంతోపాటు కొన్ని ప్రధాన రూట్లలో తిప్పుతున్నది.

500 బస్సులు అద్దెకు తీసుకునేందుకు  ప్రైవేట్ ఈవీ సంస్థలకు ఇప్పటికే ఆర్డర్ చేసినట్టు సమాచా రం. ఇవి సంస్థకు చేరగానే విడతలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకోనున్నది. పాత డీజిల్ బస్సులను కార్గో సేవలకు వినియోగించడంపై ఆర్టీసీ దృష్టిపెట్టింది.