ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులకు కరోనా టెస్టులు

ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులకు కరోనా టెస్టులు

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులకు కరోనా సోకడంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. జర్నలిస్టులకు కరోనా టెస్టులు, ట్రీట్ మెంట్ కు మంగళవారం రూ.12 లక్షలను రిలీజ్ చేసింది. కరోనా సోకిన ముగ్గురికి తక్షణ సాయం కింద రూ.75 వేల చొప్పున రిలీజ్‌ చేసింది. ట్రీట్ మెంట్ కూ సాయం చేస్తామని వెల్లడించింది. ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులను ఆదుకోవాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ కు మంత్రి కేటీఆర్ సూచించారు.

ఏపీ ఆధ్వర్యంలో ఫ్రీగా టెస్టులు

జర్నలిస్టులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులందరికీ కరోనా టెస్టులు చేయాలని ఏపీ భవన్ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు జర్నలిస్టులకు ఉచితంగా పరీక్షలు చేసేందుకు బుధవారం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అభయ్ త్రిపాఠి తెలిపారు.

స్పందించిన వెంకయ్య, కిషన్ రెడ్డి

జర్నలిస్టులకు కరోనా టెస్టులు నిర్వహించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు ల్యాబ్ లతో చర్చించారు. అపోలో యాజమాన్యం ముందుకు రావడంతో… సొంత ఖర్చులతో 31 మందికి టెస్టులు చేయించారు. మరికొన్ని టెస్టులు బుధవారం జరగాల్సి ఉంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఓ బాధితుడికి ట్రీట్ మెంట్ కోసం రూ.50 వేలు అందజేశారు. జర్నలిస్టులను ఆదుకుంటున్న ఉపరాష్ట్రపతి, కేంద్రమంత్రి, తెలంగాణ, ఏపీ సర్కార్, అపోలో ఆస్పత్రికి టీయూడబ్ల్యూజే ఢిల్లీ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.

జర్నలిస్టులను ఆదుకోవాలి: పొంగులేటి

ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులను కరోనా బారి నుంచి కాపాడేందుకు కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వైరస్ నియంత్రణ కోసం జర్నలిస్టులు కూడా తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి విధులను నిర్వర్తిస్తున్నారన్నారు.