
గండిపేట, వెలుగు: సిటీ జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు ప్రస్తుతం వరద పెరగడంతో.. కొందరు సెల్ఫీలు దిగేందుకు వస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే ఈ ప్రాంతానికి రాకుండా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు తమకు సహకరించాలని కోరారు. హిమాయత్‌సాగర్ పక్కనే ఉన్న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో నీటి ఉధృతి ఎక్కువ కావడంతో పోలీసులు రోడ్డును మూసి వేశారు.
సర్వీస్ రోడ్డు కల్వర్టు పైనుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రజలు ఈ దారిని ఉపయోగించవద్దని సూచించారు. మరోవైపు హిమాయత్‌సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్‌కు చేరడంతో శుక్రవారం నాలుగు గేట్లను ఎత్తిన అధికారులు.. ప్రస్తుతం మూడు గేట్లను మూసి, ఒక గేటును3 అడుగులు ఎత్తి నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్‌కు150 క్యూసెక్కులు, హిమాయత్‌సాగర్‌కు 150 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఔట్‌ఫ్లో 991 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.