రెండింతలు పెరిగిన లా కోర్సు ఫీజులు

రెండింతలు పెరిగిన లా కోర్సు ఫీజులు

హైదరాబాద్: ఇప్పటికే ఇంజనీరింగ్ ఫీజులతో బాదేసిన సర్కార్.. తాజాగా ఉస్మానియా పరిధిలో లా కోర్సు ఫీజులను కూడా పెంచింది. అది కూడా ప్రైవేటు కాలేజీలతో సమానంగా రెండింతలు పెంచేసింది. కోర్సు  ఫీజులు రెండింతలు పెంచడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్శిటీకి సర్కార్ నిధులు ఇవ్వకపోవడంతో.. ఫీజులు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. 

విద్యార్థులకు భారంగా మారిన ఫీజులు

లా కాలేజీల్లో ఫీజులు విద్యార్థులకు భారంగా మారుతున్నాయి. ఉస్మానియా యూనివర్శిటీ గతంలో ఎన్నడూ లేనంతగా ఫీజులు పెంచిందని లా విద్యార్థులు అంటున్నారు. ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఐదేళ్ల న్యాయవిద్య కోర్సు వార్షిక ఫీజును రూ.5వేల 460 నుంచి 16 వేలకు పెంచారు. రెండేళ్ల కాలపరిమితి ఉండే ఎల్ ఎల్ ఎం ఫీజును రూ.4వేల 500 నుంచి రూ.20వేల 100కు పెంచారు. ఎంఎల్ ఎం సెల్ఫ్  ఫైనాన్స్  కోర్సుల ఫీజులు కూడా రెండింతలు పెరిగాయి.
 సెల్ఫ్  ఫైనాన్స్  కోర్సుల ఫీజు రూ.15 వేల నుంచి రూ.33 వేలకు పెంచారు. ప్రభుత్వ అధీనంలో ఉండే ఉస్మానియా లా కోర్సుల్లో ఫీజులు ఇప్పుడు ప్రైవేటు కాలేజీలతో సమానంగా ఉన్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

లా కోర్సు చదువుదామనుకున్న విద్యార్థులు భారీ ఫీజులతో కాలేజీలకు వెళ్లలేని పరిస్థితి. ఈ విద్యాసంవత్సరం 6వేల 724 సీట్లు అందుబాటులో ఉండగా 12వేల 301 మంది అభ్యర్థులు వెబ్  ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. అందులో మొదటి విడతలో 5వేల 747 మంది మాత్రమే లాసెట్ కౌన్సెలింగ్ లో సీట్లు పొందారు.

మూడేళ్ల ఎల్ ఎల్ బీలో 4వేల64 సీట్లు ఉండగా, 3వేల 598 సీట్లు కేటాయించారు. ఐదేళ్ల ఎల్ ఎల్ బీలో 1784 సీట్లకు 1440 సీట్లు కేటాయించారు. 876 ఎల్ ఎల్ ఎం సీట్లకు 709 మంది అభ్యర్థులు సీట్లు పొందారు.. గడువు ముగిసే నాటికి దాదాపు వెయ్యి మంది వరకూ కాలేజీల్లో చేరేందుకు ఇష్టపడలేదని లెక్కలు చెబుతున్నాయి. 

కోవిడ్ తర్వాత కాలేజీలకు ఖర్చుపెరిగిందని, ప్రభుత్వం నుంచి ఇందుకు తగ్గట్టుగా నిధులు రావడం లేదని, అందుకే ఫీజులు పెంచాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు. లాసెట్ లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాత్రమే ఓయూ న్యాయ కళాశాలలో సీట్లు పొందుతారు. ఇప్పుడు సాధారణ ర్యాంకులతో ప్రైవేట్  కాలేజీల్లో చేరినవారు ఓయూ కళాశాలలో సీట్లు పొందినవారు దాదాపు సమానంగా ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఫీజుల పెంపుపై విద్యార్థులు.. స్టూడెంట్ లీడర్స్ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పి.. అసలు చదువే లేకుండా చేస్తున్నారు

కేజీ టూ పీజి ఉచిత విద్యా ఇస్తామన్న ప్రభుత్వం.. పేద వారు విద్య కు దూరమయ్యేలా చేస్తోందని స్టూడెంట్ లీడర్స్ మండిపడుతున్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్ ఫీజుల ను పెంచిన ప్రభుత్వం.. ఇప్పుడు లా ఫీజులు కూడా పెంచడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం యునివర్సీటిలను పట్టించుకోక పోవడం, నిధులు ఇవ్వకపోవడంతోనే వర్సీటిల్లో ఈ పరిస్థితి  వచ్చిందంటున్నారు విద్యార్థిసంఘాల నాయకులు.

లా కోర్సు ఫీజుల పెంపుతో ప్రతిభ గల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు న్యాయవిద్యకు దూరమయ్యే పరిస్థితి ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.