
ఓయూ, వెలుగు: కామన్ రిక్రూట్మెంట్ బోర్డు(సీఆర్బీ)ను తక్షణమే రద్దు చేయాలని ఉస్మానియా వర్సిటీ పరిశోధక విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఎమ్మెల్సీ ప్రొ. కోదండరామ్‌ను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డుతో వర్సిటీల స్వయం ప్రతిపత్తికి ఆటంకం కలుగుతుందన్నారు.
ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గుర్తించిందని, పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూడా చర్చించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కామన్ బోర్డుకు అనుకూలంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయన్నారు.
తక్షణమే దీనిని రద్దుచేసి వర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కోట శ్రీనివాస్, ఎస్ నాగేశ్వరరావు, ఆర్ ఎల్ మూర్తి, నిజ్జన రమేశ్, సుమంత్, పాల్గొన్నారు.