వినోద రంగంలో ఎన్నో మార్పులకు కారణం ఓటీటీ

వినోద రంగంలో ఎన్నో మార్పులకు కారణం ఓటీటీ

ఒకప్పుడు కొత్త సినిమా చూడాలంటే.. థియేటర్‌‌కు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడి టికెట్‌ తీసుకుని చూడాల్సి వచ్చేది. కానీ.. ఇప్పుడు కొన్ని సినిమాలు రిలీజైన రోజే ఒక్క క్లిక్‌తో ఇంట్లో కూర్చుని హాయిగా చూస్తున్నారు. మరికొన్ని సినిమాలైతే రిలీజైన కొన్ని రోజులకు హై క్వాలిటీతో చూడొచ్చు. ఒకప్పటికీ ఇప్పటికీ ఎంటర్‌‌టైన్మెంట్‌ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు కారణం ఓటీటీ. ఇప్పుడు ఓటీటీ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీతో పోటీపడి మరీ ఎదుగుతోంది. ఒరిజినల్స్‌, స్పెషల్స్‌ పేరుతో క్వాలిటీ కంటెంట్‌ని కళ్ల ముందు ఉంచుతోంది. అందుకే థియేటర్లు, టీవీలతో పోలిస్తే ఎక్కువమంది ఓటీటీకే ప్రయారిటీ ఇస్తున్నారు.  

మిలినియల్స్, జనరేషన్ జెడ్ తరాలు డైలీ రొటీన్ ‌‌లో ఎక్కువ భాగం ఫోన్‌‌, కంప్యూటర్లతోనే గడుపుతున్నారు. దాంతో ఈ మధ్య లైఫ్​స్టైల్​లో చాలా మార్పులు వచ్చేశాయి. పైగా మన దేశంలో తక్కువ ధరకే డేటా దొరుకుతుండడంతో మొబైల్ రెవెల్యూషన్ వచ్చినట్టయింది. ఈ విప్లవం వల్ల యూత్​కు ఈజీగా ఎంటర్​టైన్మెంట్​ అందుతుంది. ఇదివరకు సెలవు దొరికితే థియేటర్లకు వెళ్లేవాళ్లు. లేదంటే డీవీడీ ప్లేయర్​కు ‌‌కనెక్ట్ చేసి టీవీలో సినిమాలు చూసేవాళ్లు.

కానీ..ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడంతా ఓటీటీకే ఓటేస్తున్నారు. ఓటీటీ ఉంటే.. టీవీ, మొబైల్​లో పాత, కొత్త సినిమాలు, వెబ్ ‌‌సిరీస్​లు ఎప్పుడు కావాలంటే.. అప్పుడు చూడొచ్చు. అందుకే రోజురోజుకూ ఓటీటీకి ఆదరణ పెరుగుతోంది. అంతెందుకు గ్లోబల్ ఎంటర్​టైన్మెంట్​ మార్కెట్​‌‌లో కూడా ఓటీటీదే హవా. ఓటీటీ మార్కెట్ ఇంతలా పెరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి...

నేరుగా..

మామూలుగా ఉండే డిస్ట్రిబ్యూషన్​, మీడియా నెట్​వర్క్​ ‌‌లు అనే అడ్డంకులను దాటేసి వ్యూయర్స్​కి నేరుగా ఎంటర్​టైన్మెంట్​​ని అందిస్తోంది ఓటీటీ. ఇదివరకు ఏదైనా సినిమాని థియేటర్​కి వెళ్లి చూడలేకపోతే.. టీవీలో వచ్చేవరకు ఎదురు చూడాల్సి వచ్చేది. పైగా నచ్చినప్పుడు చూడలేం.. వచ్చినప్పుడే చూడాలి. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే ఓటీటీ రిలీజ్​డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నారు.

థియేటర్​కి వెళ్లలేని వాళ్లు ఓటీటీలో వాళ్లకు నచ్చినప్పుడు చూస్తున్నారు. టీవీలో సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో అడ్వర్టైజ్​మెంట్స్​ వస్తుంటాయి. కానీ.. ఓటీటీ ఫ్లాట్​ఫామ్స్ ‌‌లో పెయిడ్ సబ్​స్క్రిప్షన్ తీసుకుంటే యాడ్స్ కనిపించవు. ఓటీటీ వల్ల మరో అడ్వాంటేజ్ కూడా ఉంది.. సినిమాలు థియేటర్​లో రిలీజ్ అయిన చాలా తక్కువ టైంలోనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలైతే... థియేటర్​లో నడుస్తున్నప్పుడే ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. మరికొన్ని డైరెక్ట్​గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. 

కరోనా ఎఫెక్ట్ ‌‌.. 

కరోనా ప్యాండెమిక్ టైంలో ప్రపంచమంతా నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే.. ఓటీటీ మార్కెట్ మాత్రం బాగా పెరిగింది. కరోనా లాక్ ‌‌డౌన్​‌‌లో అందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. షూటింగులు ఆగిపోయాయి. థియేటర్లు తెరుచుకోలేదు. రిలీజ్​‌‌కు రెడీగా ఉన్న సినిమాలు కూడా రిలీజ్ చేయలేని పరిస్థితి. దాంతో చేసేదేమీ లేక ఓటీటీలో ఉన్న కంటెంట్ చూడడం మొదలుపెట్టారు.

అదే టైంలో ఓటీటీ ఫ్లాట్​‌‌ఫామ్స్ మార్కెట్ పెంచుకునేందుకు ఎత్తులు వేశాయి. రిలీజ్​కి రెడీగా ఉన్న సినిమాల్ని ప్రొడ్యూసర్ల నుంచి మంచి ధరకు కొని డైరెక్ట్​గా ఓటీటీలోనే రిలీజ్ చేశాయి. దాంతో థియేటర్లలో చూడాల్సిన సినిమాలని ఇంట్లో కూర్చుని, టీవీల్లో చూశారు ప్రేక్షకులు. చాలామంది సెలబ్రిటీలు కూడా కరోనా టైంలో చాలా సినిమాలు చూశామని చెప్పారు. దాంతో వ్యూయర్​షిప్ బాగా పెరిగింది. ఓటీటీ కంటెంట్ అందించే కంపెనీలు వాటి బిజినెస్ ‌‌లను ఎక్స్​పాండ్ చేసుకున్నాయి. కరోనా తర్వాత కూడా ఆ ట్రెండ్ కంటిన్యూ అయింది. 

వెబ్ సిరీస్​‌‌లే.. 

ఓటీటీ ఫ్లాట్​ఫామ్స్​ వచ్చిన కొత్తలో థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాల రైట్స్ కొని, వాళ్ల యాప్స్​‌‌లో స్ట్రీమ్ చేసేవి. తర్వాత వాళ్లకంటూ సెపరేట్ ‌‌గా కంటెంట్ ‌‌ఉంటేనే జనాలు చూస్తారని, వెబ్ సిరీస్​లు నిర్మించడం మొదలుపెట్టాయి. దాంతో ఓటీటీ ఫ్లాట్​ఫామ్స్​‌‌కి వెబ్ సిరీస్​‌‌లే మెయిన్ సోర్స్​‌‌గా మారాయి. ఏ ఫ్లాట్​ఫామ్​‌‌లో మంచి వెబ్​సిరీస్​లు ఉంటే దాని సబ్​స్క్రిప్షన్ తీసుకునేవాళ్లు.

కానీ.. కరోనా ప్యాండెమిక్​‌‌లో ఓటీటీ సంస్థలు సినిమాల్ని భారీగా కొనడం మొదలుపెట్టాయి. దాంతో ప్రొడ్యూసర్లకు కూడా థియేటర్​లో రిలీజ్ చేయలేకపోయినా ఓటీటీ ఆదుకుంటుందనే ధైర్యం వచ్చింది. మామూలు పరిస్థితులు వచ్చిన తర్వాత కూడా కొన్ని సినిమాలను డైరెక్ట్​గా ఓటీటీల్లోనే రిలీజ్ చేశారు. 

తక్కువ ధరకే

కంటెంట్​ని ఓటీటీల్లోనే చూడడానికి మరో కారణం ఖర్చు.. అవును మరి! థియేటర్లకు వెళ్లి చూడడం కంటే ఓటీటీల్లో చూస్తే అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఒక్కసారి సినిమాకు వెళ్లినప్పుడు అయ్యే ఖర్చుతో మూడు నెలల ఓటీటీ సబ్ ‌‌స్క్రిప్షన్ వస్తుంది. ఒకసారి సబ్​స్క్రిప్షన్ తీసుకుంటే.. ఎన్నో సినిమాలు వెబ్​సిరీస్​లు చూడొచ్చు. అందుకే చాలామంది థియేటర్​కు వెళ్లి సినిమా చూడడం కంటే.. ఇంట్లో కూర్చుని, టైం దొరికినప్పుడు కుటుంబంతో కలిసి చూడొచ్చు అనుకుంటున్నారు.

అయితే.. కొన్ని స్పెషల్ సినిమాలకు మాత్రం సూత్రం వర్తించదు. ఆర్ ‌‌ఆర్ ‌‌ఆర్ ‌‌, పుష్ప, కేజీఎఫ్ లాంటి సినిమాలను చాలామంది ఓటీటీ కంటే థియేటర్​లో చూడడానికే ఇష్టపడ్డారు. క్వాలిటీ కంటెంట్ ఉంటే థియేటర్లకే వెళ్లి చూస్తున్నారు ఆడియెన్స్ ‌‌. 

డీటీహెచ్ ‌‌లతోపాటు

మనవాళ్లకు ఓటీటీలు ఎక్కువగా అలవాటు కావడానికి మరో కారణం.. డీటీహెచ్‌‌, మొబైల్ నెట్​వర్క్​ల రీచార్జ్ ప్లాన్లు. ఎందుకంటే.. జనాలు ఓటీటీ యాప్స్ వాడడం మొదలుపెట్టినప్పటినుంచే డీటీహెచ్ ఆపరేటర్లు ఓటీటీ ఫ్లాట్​‌‌ఫామ్స్ సబ్​స్క్రిప్షన్స్ కూడా కలిపి కొత్త ప్లాన్లు తీసుకొచ్చారు. దాంతో విడిగా సబ్​స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని, చాలామంది వాటినే కొన్నారు.

మొబైల్ నెట్​వర్క్ ప్రొవైడర్లు ఎయిర్​టెల్, వీఐ, జియోలు కూడా పోస్ట్ ‌‌పెయిడ్, ప్రి–పెయిడ్ ప్లాన్లకు టాప్ ఓటీటీ ఫ్లాట్​ఫామ్స్ సబ్​స్క్రిప్షన్స్​ని యాడ్ చేశాయి. అంటే ప్రత్యేకంగా ఓటీటీ సబ్​స్ర్కిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఓటీటీలు జనాలకు మరింత దగ్గరయ్యాయి. కొన్ని నెట్​​‌‌వర్క్ ప్రొవైడర్ ‌‌ కంపెనీలు అయితే.. ఓటీటీ ప్లాట్​‌‌ఫామ్స్​‌‌తో కలసి ప్రత్యేకంగా ఎంటర్​టైన్మెంట్ యాప్స్​‌‌ని తీసుకొచ్చాయి. ఆ యాప్ యాక్సెస్ వాళ్ల యూజర్లకు మాత్రమే ఇచ్చాయి. ఉదాహరణకు రిలయన్స్ జియో ‘జియో సినిమా’ అనే యాప్​‌‌ని తీసుకొచ్చింది.

జియో యూజర్లకు మాత్రమే ఈ యాప్ యాక్సెస్ ఉంటుంది. ఇందులో ఎక్కువగా ‘సన్​ నెక్స్ట్​’లోని కంటెంట్ ఉంటుంది. కానీ.. జియో యూజర్లు ఈ కంటెంట్​ని ఫ్రీగా చూడొచ్చు. అలాగే వోడాఫోన్​ ఐడియా ‘వీఐ యూవీస్’ అనే ఓటీటీ యాప్​ తీసుకొచ్చింది. ఇందులో కూడా చాలా కంటెంట్ ఫ్రీగానే చూడొచ్చు. కాకపోతే కచ్చితంగా వీఐ యూజర్ ‌‌అయ్యుండాలి.

మొబైల్ నెట్​‌‌వర్క్ ప్రొవైడర్లు, డీటీహెచ్ ఆపరేటర్లే కాకుండా ఫైబర్​నెట్ ప్రొవైడ్ చేసే కంపెనీలు కూడా వాళ్ల ప్లాన్లకు ఓటీటీ సబ్​స్క్రిప్షన్లను యాడ్ చేశాయి. కాస్త ఎక్కువ డబ్బులు కడితే ఇంటర్నెట్​తోపాటు ఓటీటీల సబ్​స్క్రిప్షన్స్ కూడా ఇస్తున్నాయి. అంతెందుకు, ఒక రిపోర్ట్ ప్రకారం.. ఇండియాలో డైరెక్ట్ బిల్లింగ్ ద్వారా ఓటీటీ సబ్​స్క్రిప్షన్లు తీసుకునేది 35 శాతం మంది మాత్రమే అని తెలిసింది. మిగతా 65 శాతం మంది టెలికాం, డీటీహెచ్, ఫైబర్​నెట్ సర్వీసులతో కలిసి తీసుకుంటున్నారట. 

మొబైల్ వాడకం

ఓటీటీ వాడకం పెరగడానికి మరో ముఖ్య కారణం మొబైల్​. స్మార్ట్​ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక రంగాల్లో మార్పులు వచ్చాయి. దేశంలో అన్ని మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు స్మార్ట్​ఫోన్  చేరువైంది. టీవీలు లేని ఇండ్లల్లో కూడా స్మార్ట్​ఫోన్ ఉంటోంది. వాటితోపాటే ఓటీటీ ఫ్లాట్​ఫామ్స్ కూడా ప్రజలకు దగ్గరయ్యాయి. ఇదివరకు టీవీలు మాత్రమే ఎంటర్​టైన్మెంట్​ ఇచ్చేవి.

ఇప్పుడు స్మార్టఫోన్స్​ కూడా ఇస్తున్నాయి. అంతెందుకు, ఓటీటీ యాప్స్​ని స్మార్ట్ టీవీల్లో వాడేవాళ్ల కంటే ఫోన్లలో వాడేవాళ్లే ఎక్కువ. అందుకే కొన్ని ఓటీటీ ఫ్లాట్ ‌‌ఫామ్స్ తక్కువ ధరలో మొబైల్స్ కోసమే ప్రత్యేకంగా సబ్​స్క్రిప్షన్ ప్లాన్లు తీసుకొచ్చాయి. ఉదాహరణకు నెట్​ఫ్లిక్స్ ఇండియాలో నెలకు 149 రూపాయలతో మొబైల్ సబ్​స్క్రిప్షన్ ప్లాన్​‌‌ ఇస్తోంది. ఈ ప్లాన్ తీసుకున్నవాళ్లు మొబైల్, టాబ్లెట్​‌‌లో మాత్రమే కంటెంట్ చూడగలుగుతారు. అందుకే స్మార్ట్​ఫోన్ ఇండియాలో ఎక్కుమంది వీడియోలు చూసే డివైజ్​‌‌గా మారింది. 

అన్​స్టాపబుల్ ‌‌

థియేటర్​కి వెళ్లినా, టీవీ ఛానెల్​‌‌లో వచ్చినా.. సినిమా పూర్తయ్యేవరకు కదలకుండా చూడాలి. ఈ బిజీ లైఫ్​లో అందరికీ అంత టైం దొరక్కపోవచ్చు. పైగా ప్రత్యేకంగా అందుకోసం టైం కేటాయించలేకపోవచ్చు. అలాంటివాళ్లకు ఓటీటీ అన్​స్టాపబుల్ ఎక్స్​పీరియన్స్​ ఇస్తోంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఉదయం ఇంట్లో టీవీలో ఒక సినిమా సగం చూడగానే ఆఫీస్​కి అర్జెంట్​​గా వెళ్లాల్సి వచ్చిందనుకోండి.

అతను మిగతా సినిమాను తన కారులోని స్ట్రీమింగ్ డివైజ్​‌‌లో కూడా చూడొచ్చు. ఇంకా చూడాల్సిన సినిమా మిగిలి ఉంటే.. ఆఫీస్​కు వెళ్లాక, లంచ్ బ్రేక్​‌‌లో తన డెస్క్ ‌‌టాప్​‌‌లో చూడొచ్చు. ఇలా ఎప్పుడైనా, ఎక్కడైనా, కుదిరినప్పుడు చూడొచ్చు. ఎందుకంటే.. ఓటీటీ ఫ్లాట్​ఫామ్స్ ఒకేసారి మల్టీపుల్ డివైజ్​‌‌లలో కంటెంట్ చూసే వీలు కల్పిస్తున్నాయి. 

ఓటీటీ మార్కెట్​

కొన్నేండ్ల నుంచి ఓటీటీ మార్కెట్ విలువ బాగా పెరిగింది. ఇండియన్ ఎంటర్​టైన్మెంట్​ మార్కెట్​లో కూడా ఓటీటీ లాభాలు పొందుతోంది. లండన్​కు చెందిన ఓమ్డియా అనే సంస్థ ఇచ్చిన ‘ఆన్​లైన్ వీడియో ట్రెండ్స్’ నివేదిక ప్రకారం.. ఓటీటీ ఫ్లాట్​‌‌ఫామ్​‌‌లు సబ్ ‌‌స్క్రిప్షన్ల ద్వారా 2021లో 900 మిలియన్​ డాలర్లు సంపాదించాయి. ఈ గ్రోత్ రేట్ ఏటా పెరుగుతూ వస్తోంది. సబ్​స్క్రిప్షన్ల వల్ల 2020లో 500 మిలియన్ల డాలర్లు మాత్రమే వచ్చింది.

2021లో అదనంగా 400 మిలియన్లు పెరిగింది. 2021 నాటికి ఇండియాలో 7 కోట్ల 30 లక్షల ఓటీటీల సబ్​స్క్రిప్షన్లు (యూట్యూబ్ మినహాయించి) తీసుకున్నారు. ఈ సంఖ్య 2020లో 5 కోట్ల 30 లక్షలు ఉంది. అంటే.. ఈ రంగం 37 శాతం గ్రోత్ సాధించింది. అయితే.. ఇదంతా సబ్​స్ర్కిప్షన్ల సంఖ్య మాత్రమే. కొన్ని యాప్స్ ఒక్క సబ్​స్క్రిప్షన్​తో నాలుగైదు డివైజ్​‌‌లు వాడుకునే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ లెక్కన యూజర్స్ సంఖ్య చాలా ఎక్కువే. 

ఎస్బీఐ రీసెర్చ్ ప్రకారం.. 

ఇండియాలో 45 కోట్ల మందికి పైగా ఆన్​లైన్​లో వీడియోలు చూస్తున్నారు. 2023 చివరి నాటికి ఈ సంఖ్య 50 కోట్లకు చేరుకుంటుందని ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ చెప్పారు. డిస్నీప్లస్ హాట్​స్టార్​​‌‌ను14 కోట్ల మంది, అమెజాన్ ప్రైమ్ వీడియోను 6 కోట్ల మంది మంది, నెట్​ఫ్లిక్స్​ని 4 కోట్లు, జీ5ని 3.7 కోట్లు, సోనీ లివ్​ను 2.5 కోట్ల మంది వాడుతున్నారు. వీటితోపాటు వూట్, ఆల్ట్​ బాలాజీ, ఆహా లాంటి ఓటీటీలకు ప్రాంతీయంగా డిమాండ్ ఉంది. 

యాడ్స్ మార్కెట్ ‌‌

ఇండియాలో ఉన్న వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్​ఫామ్స్ 2021లో 1.2 బిలియన్ డాలర్లు సంపాదించాయి. ఈ ఏడాది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఓమ్డియా లెక్కల ప్రకారం.. 2021లో ఆన్​లైన్​లో స్ట్రీమ్ అయ్యే వీడియోల మధ్యలో వేసే అడ్వర్టైజ్​మెంట్స్​​ ద్వారా ఇండియాలో 1.2 బిలియన్ల ఆదాయం వచ్చింది. ఇందులో ఎక్కువ షేర్ ‌‌ గూగుల్, మెటా తీసుకుంటున్నాయి. మిగిలిన దాంట్లో కొన్ని బ్రాడ్ ‌‌కాస్టింగ్ కంపెనీలు, ఓటీటీ ఫ్లాట్ ‌‌ఫామ్స్ షేర్ ‌‌చేసుకుంటున్నాయి.

ఓటీటీ ఫ్లాట్​ఫామ్స్​లో యాడ్స్ ద్వారా ఎక్కువ సంపాదించేది మాత్రం డిస్నీప్లస్ హాట్​స్టార్. ఎందుకంటే ఇందులో కొంత కంటెంట్​ని ఎలాంటి సబ్​స్క్రిప్షన్ లేకుండానే చూడొచ్చు. కాకపోతే.. ఆ వీడియోలు చూస్తుంటే మధ్యలో యాడ్స్ వస్తుంటాయి. వాటి ద్వారా ఆదాయం సంపాదిస్తోంది డిస్నీప్లస్ హాట్​‌‌స్టార్​. మరికొన్ని ఓటీటీ ఫ్లాట్​ఫామ్స్ కూడా ఇలాగే వీడియోల మధ్యలో యాడ్స్ ఇస్తుంటాయి.

యూట్యూబ్ కూడా ప్రీమియం సబ్​స్క్రిప్షన్ తీసుకోని యూజర్లకు వీడియోల మధ్యలో యాడ్స్ ప్లే చేస్తుంటుంది. కాకపోతే.. కొందరు దీన్ని ఓటీటీగా గుర్తించడం లేదు. దీన్ని సోషల్ వీడియో షేరింగ్ ఫ్లాట్​ఫామ్​గా చెప్తుంటారు. కారణం.. ఎవరికైనా ఇందులో వీడియో అప్​లోడ్ చేసే యాక్సెస్ ఉండడమే. యాడ్స్ ద్వారా ఆదాయం సంపాదించడానికి అమెజాన్ ‘మినీ టీవీ’ పేరుతో స్ట్రీమింగ్ సర్వీస్​ స్టార్ట్ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్స్​​‌‌ప్లే చేయరు. కానీ.. మినీ టీవీలో యాడ్స్​ ప్లే  చేస్తారు. కాకపోతే కంటెంట్​ని ఫ్రీగా చూడొచ్చు. 

12 వేల కోట్లు

రాబోయే రోజుల్లో ఓటీటీల వల్ల ఇండియాలో మల్లీప్లెక్స్​ల మనుగడకు ముప్పు తప్పదని ఈ మధ్య ఎస్బీఐ చేసిన ఒక రీసెర్చ్​లో తెలిసింది. ఒకప్పుడు థియేటర్లకు వెళ్లలేని వాళ్లు టీవీల్లో  చూసేవాళ్లు. 1980ల్లో వీసీఆర్​లు.. ఆ తర్వాత వీసీడీలు, డీవీడీల ట్రెండ్ మొదలైంది. సినిమా రిలీజైన కొన్ని రోజులకే వీసీడీలు, డీవీడీలు వచ్చేవి. 2000 ప్రారంభంలో ఇండియాలోని చాలా పట్టణాల్లో మల్టీప్లెక్స్​‌‌లు వెలిశాయి.

ఎక్కువమంది థియేటర్లకు వెళ్లడం మొదలుపెట్టారు. అయితే.. మళ్లీ ఇప్పుడు ఓటీటీ వల్ల మల్టీప్లెక్స్​‌‌ల డిమాండ్ తగ్గుతోంది. డిమాండ్ ‌‌తోపాటు మార్కెట్ కూడా తగ్గుతోంది. అదే టైంలో ఓటీటీ మార్కెట్  పెరుగుతోంది. 2018లో 2,590 కోట్ల రూపాయల ఓటీటీ మార్కెట్ జరిగింది. ఇది 2023కు సుమారు12,000 కోట్ల వరకు పెరుగుతుందని ఎస్బీఐ అంచనా వేసింది. ఓటీటీ మార్కెట్​లో ప్రతి ఏడాదికి  36 శాతం చొప్పున పెరిగే అవకాశం ఉంది. 

స్మాల్ స్క్రీన్ ‌‌.. బిగ్ బడ్జెట్ ‌‌

ఓటీటీ సంస్థలు వాళ్ల ఫ్లాట్​ఫామ్స్​‌‌లో సినిమాలు స్ట్రీమ్ చేయడంతోపాటు ‘ఒరిజినల్స్ ‌’, ‘స్పెషల్స్‌‌’ పేరుతో కొన్ని వెబ్​సిరీస్​లు, సినిమాలు, షోలు ప్రొడ్యూస్ చేస్తుంటాయి. వాటిని వాళ్ల ఫ్లాట్ ఫామ్​‌‌లోనే రిలీజ్ చేస్తుంటాయి. అయితే.. వీటి మీద కూడా లాభాలు బాగా వస్తుండడంతో బడ్జెట్ బాగా పెంచాయి. పెద్ద స్టార్లతో వెబ్​సిరీస్​లు తీస్తున్నాయి. కొన్ని వెబ్​సిరీస్​‌‌ల కోసం ఏకంగా సినిమాలకు అయ్యేంత బడ్జెట్ పెడుతున్నాయి.

ఓమ్డియా సంస్థ ఇచ్చిన రిపోర్డ్ ప్రకారం.. 2021లో ఓటీటీ ఫ్లాట్​ఫామ్స్ ఒరిజినల్ కంటెంట్ ప్రొడ్యూస్ చేయడానికి దాదాపు సుమారు 3,700 కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. నెట్​ఫ్లిక్స్ ఒక్కటే 1,479 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో 1,035 కోట్లు ఖర్చు పెట్టింది. కంటెంట్ ఇన్వెస్ట్​‌‌మెంట్​లో అమెరికా తర్వాత ఇండియానే టాప్​‌‌లో ఉంది. అన్ని ఓటీటీ ఫ్లాట్ ‌‌ఫామ్​‌‌లు పోటీ పడి మరీ ఒరిజనల్ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

ఈ ఏడాది ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా పెరిగింది. ఇప్పటికే చాలా వెబ్ సిరీస్​‌‌లు రిలీజ్ అయ్యాయి. ఈ లెక్కన ఈ సంవత్సరం బడ్జెట్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఖర్చు ఎక్కువైనా క్వాలిటీ కంటెంట్ ‌‌అందిస్తున్నాయి. ఉదాహరణకు 2019లో నెట్​‌‌ఫ్లిక్స్​‌‌లో 4కే, హెచ్​డీఆర్ ‌‌, డాల్బీ అట్మోస్ లాంటి ఫీచర్లలో కంటెంట్​ను అందుబాటులో తీసుకొచ్చింది. 

లోకల్ ఓటీటీ.. లోకల్ కంటెంట్ ‌‌

నెట్​ఫ్లిక్స్, అమెజాన్ ​ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్​‌‌స్టార్ ‌‌ లాంటి ఇంటర్నేషనల్ ఫ్లాట్​ఫామ్స్​తోపాటు ప్రాంతీయ భాషలో కంటెంట్ అందించేందుకు అనేక ఓటీటీ ఫ్లాట్​‌‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఇండియాలో దాదాపు 40కి పైగా ఓటీటీ ఫ్లాట్​ఫామ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఒకే ప్రాంతంలో ఉండేవాళ్లను ఉద్దేశించి తీసుకొచ్చిన ఫ్లాట్ ‌‌ఫామ్స్​‌‌లో రీజనల్ కంటెంట్ ఎక్కువగా ఇస్తూ అట్రాక్ట్ చేస్తున్నారు.

ఇప్పటికే తెలుగు, బెంగాలీ, పంజాబీ, మరాఠీ లాంటి భాషల్లో లోకల్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్​‌‌ఫామ్​‌‌లు కంటెంట్ అందిస్తున్నాయి. ముఖ్యంగా నీస్ట్రీమ్ (మలయాళం), ప్లానెట్ మరాఠీ(మరాఠీ), చౌపాల్ (పంజాబీ), హోయిచోయ్ (బెంగాలీ). ఆహా(తెలుగు, తమిళం)లు పెద్ద ఓటీటీ ఫ్లాట్​ఫామ్​లకు కూడా పోటీ ఇస్తున్నాయి. 

హోయిచోయ్ (బెంగాలీ): 2017లో దీన్ని మొదలుపెట్టారు. 50 లక్షల మందికి పైగా దీన్ని డౌన్​‌‌లోడ్ చేసుకున్నారు. బెంగాలీ కంటెంట్ అందించే టాప్ ఓటీటీ ఇదే. 

సన్ నెక్స్ట్​(సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ‌‌): లోకల్ భాషల్లో కంటెంట్ అందించే ఓటీటీల్లో ఇదే టాప్. ఎందుకంటే.. ఇందులో సౌత్ ఇండియాలోని తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో కంటెంట్ ఉంటుంది. దీన్ని 2017లో తీసుకొచ్చారు. ఇది సన్ టీవీ నెట్​‌‌వర్క్​లో భాగం. ఇందులో దాదాపు 4,000 సినిమాలు, అనేక లైవ్ టీవీ ఛానెళ్లు ఉన్నాయి.

ఆహా (తెలుగు, తమిళం): ఆహాని ‘అర్హా మీడియా అండ్ బ్రాడ్ ‌‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ తీసుకొచ్చింది. ఇందులో ప్రస్తుతం తెలుగు కంటెంట్ -మాత్రమే ఇస్తున్నారు. దీన్ని 2020 మార్చిలో లాంచ్ చేశారు. ఇప్పటికే దీనికి 1.8 కోట్ల మంది సబ్ ‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. వరల్డ్ డిజిటల్ ప్రీమియర్లు, వెబ్ ఒరిజినల్స్, టాక్ షోలు స్ట్రీమ్ చేస్తున్నారు. 

ప్లానెట్ మరాఠీ (మరాఠీ): దీన్ని డిసెంబర్ 2020లో మొదలుపెట్టారు. మరాఠీవాళ్ల కోసం తీసుకొచ్చిన మొదటి -స్ట్రీమింగ్ ప్లాట్​‌‌ఫామ్ ఇది. ఇందులో సినిమాలు, టీవీ షోలు, ఇన్ఫోటైన్ ‌‌మెంట్, ఎడ్యుకేషనల్ కంటెంట్, కచేరీలు, వంటలు, యోగా, లైవ్-ఫిట్​​నెస్ వీడియోలు ఉన్నాయి. 

అడ్డాటైమ్స్ (బెంగాలీ): 2016లో మొదలుపెట్టారు. ఇందులో ఒరిజినల్ వెబ్​సిరీస్​లు, షార్ట్​ఫిల్మ్​లు, మ్యూజిక్ వీడియోలు, డిటెక్టివ్ థ్రిల్లర్స్, కుకరీ షోలు లాంటి బెంగాలీ కంటెంట్ ఉంది. 

టాకీస్ (తుళు, కొంకణి, కన్నడ): ఇది 2020 చివరిలో అందుబాటులోకి వచ్చింది. కర్ణాటకలో మాట్లాడే మూడు భాషల్లో కంటెంట్ అందిస్తోంది. ఇందులో సినిమాలు, నాటకాలు, టీవీ షోలు, ఒరిజినల్ వెబ్​సిరీస్​‌‌లు ఉన్నాయి.  ::: కరుణాకర్​ మానెగాళ్ల ::: వెలుగు నెట్​వర్క్

ఇంటర్నెట్ వాడకం

ఇండియాలో జియో తక్కువ ధరకే ఇంటర్నెట్ అందించడం కూడా ఓటీటీ బలపడడానికి ఒక కారణమైంది. జియో మార్కెట్​‌‌లోకి వచ్చిన కొత్తలో కొన్ని రోజులు ఫ్రీగా ఇంటర్నెట్ ఇచ్చింది. దాంతో చాలామంది సోషల్ ‌‌మీడియా, ఓటీటీలను ఎక్కువగా వాడడం మొదలైంది. ఆ తర్వాత కూడా తక్కువ ధరకే ఇంటర్నెట్ అందించడంతో అదే ట్రెండ్ కంటిన్యూ అయ్యింది. జియో బాటలోనే అన్ని నెట్​‌‌వర్క్ ప్రొవైడర్లు తక్కువ ధరకే ఇంటర్నెట్ ఇస్తుండడంతో జనాలకు ఓటీటీ మరింత చేరువైంది. 

విజువల్​ ఎఫెక్ట్స్​ కోసమే...

పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నా. ఉదయం డ్యూటీకి వెళ్లి సాయంత్రం వస్తా. ఓటీటీలు వచ్చాక సినిమాలు ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే చూస్తున్నా. విజువల్ ఎఫెక్ట్స్​ ఉన్న సినిమాలు మాత్రమే థియేటర్​లో చూస్తున్నాం. థియేటర్​కి వెళ్తే ఖర్చు చాలా అవుతోంది. కొన్ని ఓటీటీలు సామాన్యులకు అందుబాటులో ఉన్నా, మరికొన్ని కాస్ట్లీగా ఉన్నాయి. వాటి రేట్లు తగ్గిస్తే సామాన్యులకు మరింత చేరువతాయి. మనకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు సినిమాలు చూడొచ్చు. అందుకే ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. - శ్రీనివాస్ సార్ల, చొప్పదండి

టైం ఆదా.. ఎక్కువ మందికి పని

ఓటీటీలో తక్కువ రన్​టైంతో వెబ్​సిరీస్​లను ఎపిసోడ్​ల వారీగా రిలీజ్​ చేస్తారు. దానివల్ల ఒకేసారి అన్ని ఎపిసోడ్​లు నాన్​స్టాప్​గా చూస్తున్నారు. మామూలుగా అయితే సినిమా కనీసం రెండు, మూడు గంటలు ఉంటుంది. కానీ, ఓటీటీలో మాత్రం వెబ్​సిరీస్​లు తొమ్మిది గంటలైనా సరే నాన్​స్టాప్​గా చూస్తున్నారు. 

భాష అర్థం కాకపోయినా ఇంగ్లీష్​ సబ్​టైటిల్స్​తో ఇతర భాషల సిరీస్​లు కూడా చూస్తున్నారు. కొన్ని ఓటీటీలు అయితే వాళ్లే డబ్​ చేసి రిలీజ్​ చేస్తున్నారు కూడా. వాటిలో సినిమాలూ ఉంటున్నాయి. దీనివల్ల యాక్టర్సే కాకుండా కొత్త డైరెక్టర్స్​, టెక్నీషియన్స్​, డబ్బింగ్​ ఆర్టిస్ట్​లు, ట్రాన్స్​లేటర్స్​కు పని దొరుకుతోంది. స్టూడియోల్లో కూడా కంటిన్యూస్​గా పని ఉంటోంది.

అట్రాక్ట్​ అవుతున్నరు

తక్కువ ధరల్లో ఏడాది  సబ్​స్క్రిప్షన్​తో​ ఉన్న ఓటీటీ యాప్స్​కు ఆదరణ ఉంది. ఇప్పుడిప్పుడే తెలుగు, హిందీ భాషల్లో ఓటీటీ యాప్స్​ సబ్​స్క్రయిబర్స్​ పెరుగుతున్నారు. మొబైల్​ఫోన్స్​లో కొన్ని ఓటీటీ యాప్స్ తక్కువ సబ్​స్క్రిప్షన్​తో దొరుకుతున్నాయి. దాంతో  గ్రామాల్లోని యువత అట్రాక్ట్​ అవుతున్నారు. నిజానికి థియేటర్​లో చూసిన ఎక్స్​పీరియెన్స్​ ఓటీటీలో ఉండదు.

పిక్చర్ క్వాలిటీ విషయంలో పెద్దగా తేడా లేకున్నా సౌండ్, కొన్ని ఎఫెక్ట్స్​ను ఓటీటీలో మిస్ అవుతాం. అయితే, సినిమా టికెట్ల రేట్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అదే ఓటీటీ యాప్స్​లో ఒకటి రెండు తప్ప మిగతావాటి  సబ్​స్క్రిప్షన్​ అంత భారం కావడం లేదు. కొన్ని యాప్స్​లో ఒక్కరు సబ్​స్క్రిప్షన్​ చేస్తే ముగ్గురు షేర్​ చేసుకునే ఫెసిలిటీ ఉంటోంది. - జాలిగామ భరత్, కోహెడ, సిద్దిపేట జిల్లా

ఓటీటీలోకి ఏఐ

అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఓటీటీలు బాగా వాడుకుంటున్నాయి. ముఖ్యంగా ఏఐ (ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ‌‌) టెక్నాలజీతో యూజర్ ‌‌ ఎక్స్ ‌‌పీరియెన్స్​‌‌ని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. కస్టమర్లు ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారో ఏఐ ద్వారా తెలుసుకుని అలాంటి కంటెంట్​ని డిస్​ప్లే చేస్తున్నాయి. దీని ద్వారా ఓటీటీల ఆదాయం పెరుగుతోంది. అంతేకాకుండా తన సబ్​స్క్రయిబర్లను కోల్పోకుండా జాగ్రత్త పడుతున్నాయి. అంతెందుకు ఏఐ వాడడం వల్ల సంవత్సరానికి ఒక బిలియన్ డాలర్లు సేవ్ అయినట్టు నెట్​‌‌ఫ్లిక్స్ ఈ మధ్యే ప్రకటించింది. 

5జీతో మరింత.. 

ఓటీటీకి ఇంటర్నెట్ మెయిన్ సోర్స్. ఇంటర్నెట్ లేనిచోట ఓటీటీలు సర్వీస్​ అందించలేవు. ఇప్పటికే ఇండియాలో దాదాపు అన్నిచోట్లా 4జీ ఇంటర్నెట్ అందుతోంది. అయినా.. కొన్నిసార్లు హై క్వాలిటీ కంటెంట్​ని స్ట్రీమ్ చేయడంలో సమస్యలు వస్తున్నాయి. కావాల్సినంత స్పీడ్​‌‌గా ఇంటర్నెట్ లేకపోవడమే దీనికి కారణం. ఇక నుంచి ఆ సమస్య ఉండదు. ఎందుకంటే.. ఇండియాలో కొన్ని సిటీల్లో 5 జీ సర్వీసులు ఇప్పటికే మొదలయ్యాయి. 5 జీ పూర్తిగా అందుబాటులోకి వస్తే.. ఇంటర్నెట్ స్పీడ్ ఇప్పుడు ఉన్నదానికంటే.. 10 నుంచి 20 రెట్లు పెరుగుతుంది. కాబట్టి హైక్వాలిటీ వీడియోని కూడా స్ట్రీమ్ చేయొచ్చు. అప్పుడు ఓటీటీ ఫ్లాట్​ఫామ్స్ మరింత క్వాలిటీ అందించేందుకు పనిచేస్తాయి. 

అందుకే ఓటీటీ బెటర్​ 

పొద్దంతా ఎవరి బిజీలో వాళ్లుంటారు.. అంతా కలిసి థియేటర్​కు వెళ్లి సినిమా చూసే ఛాన్స్ లేదు. అందుకే థియేటర్ కంటే ఓటీటీయే బెటర్. ఇంట్లోనే ఎవరికి నచ్చిన ప్రోగ్రాంని వాళ్లు, టైంని బట్టి చూడొచ్చు. ఆండ్రాయిడ్ టీవీ, మొబైల్ ఫోన్​లో యాప్ డౌన్​లోడ్ చేసుకోవడం కూడా ఈజీ. ఇంట్లో వైఫై కనెక్షన్ ఉండాలి. ఓటీటీల్లో కంటెంట్, క్వాలిటీ సూపర్బ్. నేనైతే నెట్​ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్​స్టార్, జీతెలుగు యాప్స్ వాడుతున్నా. – ఎ. భాగ్యశ్రీ, గృహిణి, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా.