
‘కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. ఈ రెండింటి మధ్యదే మనిషి జీవితం’.. అన్నారు ఓ సినీకవి. అన్నదానం, రక్తదానం, నేత్రదానం..ఇలాంటి దానాల్లోకెల్లా ఎంతో ఉన్నతమైనది అవయవదానం. మనిషి మరణానంతరం తన అవయవాలను దానం చేయడం ద్వారా కొందరికైనా పునర్జన్మ ప్రసాదించినవారవుతారు.
ఎవరైనా మరణించిన తర్వాత వేరొకరిలో జీవించేందుకు అత్యుత్తమ మార్గం కూడా అవయవదానమే. ఒకరి నుంచి తీసుకునే ఆర్గాన్స్ ద్వారా మరో 8 మంది ప్రాణాలు రక్షించవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. గుండె, లివర్, కిడ్నీలు, క్లోమం (ప్రాంకియాస్), లంగ్స్, చిన్నపేగు, కార్నియా (కంటిలోని నల్లని భాగం), నరాలు, గుండె కవాటాలు (హార్ట్ వాల్వ్స్) వంటివి దానం చేయొచ్చని చెబుతున్నారు. ఇవి పసిబిడ్డ నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా అవసరం కావొచ్చు.
ముఖ్యంగా షుగర్, హై బీపీ వంటి దీర్ఘకాల జబ్బులతో బాధపడేవారిలో ఎంతోమందికి క్రమక్రమంగా అవయవాలు పనిచేయకుండా పోతుంటాయి. అలాంటి నిస్సహాయులు అవయవాల మార్పిడికి ఎదురుచూసే పరిస్థితులు నెలకొన్నాయి. యాక్సిడెంట్లలో మృతి చెందినవారు, లేదంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్ల అవయవాలను వారి బంధువులు ముందుకొచ్చి దానం చేయగలిగితే ఎంతోమంది వ్యాధిగ్రస్తుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండుతాయి.
ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశమైన భారత్ అవయవదానంలో వెనుకబడటం శోచనీయం. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాలెన్నో అవయవ దానంలో ముందంజలో ఉన్నట్టు అంతర్జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆయా దేశాల్లో ప్రతి పది లక్షల మందిలో 40 మందికి పైగా ఆర్గాన్స్ డొనేట్ చేస్తున్నట్టు, ఇది మనదేశంలో 2 కంటే కూడా తక్కువగా ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి.
గతేడాది దేశంలోని అన్ని ఆస్పత్రుల ఐసీయూల్లో బ్రెయిన్ డెడ్ కేసులను గుర్తించి ప్రత్యేకంగా పర్యవేక్షించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అలాంటి కేసుల్లో అవయవదానానికి ప్రాధాన్యతను ఇస్తూ.. బాధిత కుటుంబాలకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని కూడా కోరింది.
ప్రమాదాల్లో ఏటా లక్షల్లో మృతి చెందుతుండగా..
మన దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో రెండు లక్షలమందికిపైగాప్రాణాలు కోల్పోతున్నట్టు,లక్షల మంది గాయాలపాలవుతున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేలు వెల్లడిస్తున్నాయి. యాక్సిడెంట్లలో చనిపోయిన, బ్రెయిన్ డెడ్ వ్యక్తుల అవయవాలను బాధిత కుటుంబాలు పెద్ద మనసుతో దానం చేసేందుకు ముందుకొస్తే.. అవయవ మార్పిడికి ఎదురుచూసే ఎందరో బాధితులకు కొత్త జీవితాన్ని ప్రసాదించినవారవుతారు.
దేశవ్యాప్తంగా ఏటా అవయవ మార్పిడికి ఎదురుచూసే నిస్సహాయులు 3 లక్షల మందికిపైగా ఉంటున్నట్టు వైద్య ఆరోగ్య సర్వేలు వెల్లడిస్తున్నాయి. అవయవాలు ఫెయిలైన ఎంతో మంది బాధితులు ఏండ్లపాటు దాతల కోసం ఎదురుచూస్తుంటారు. అవి అందేలోగా ఆరోగ్యం మరింతగా దెబ్బతింటుంది. లేదంటే మరణిస్తుంటారు.
దాతలు త్వరగా స్పందించి ముందుకొస్తే మరొకరికి పునర్జన్మ ఇచ్చినవారవుతారు. అయితే, మన సమాజంలో మూఢ నమ్మకాలు, శాస్ర్తీయ విజ్ఞానంపైనా సరైన అవగాహన లేకపోవడం అవయవదానంకి ఆటంకంగా మారింది. మరోవైపు అవయవ మార్పిడి ఆపరేషన్లపై ప్రభుత్వాలు సరైన అవగాహన కల్పించకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.
ఆదర్శనీయంగా పెద్దపల్లి జిల్లా అబ్బిడిపల్లె
రక్తదానం, నేత్రదానంతోపాటు అవయవదానంపైకూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలను కొనసాగించాలి. ఎప్పటికప్పుడు అవయవదానంపై ప్రజలను చైతన్యం చేస్తూ.. దాతలను, బాధిత కుటుంబాలను ప్రోత్సహిస్తే.. ఆర్గాన్స్ కొరత ఉండదు. తద్వారా అవయవ అక్రమ రవాణాకు, మాఫియా ముఠాల దందాలకు కూడా చాలావరకు చెక్ పెట్టొచ్చు.
‘మనుషులు చనిపోవచ్చు. దేశాలూ నాశనమవచ్చు.. కానీ, ఒక ఆదర్శనీయమైన పని ఎప్పుడూ సజీవంగానే ఉండిపోతుంది’ అన్నారు అమెరికా మాజీ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ. ఆయన వ్యాఖ్యల స్ఫూర్తితో తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా అబ్బిడిపల్లె గ్రామస్తులు అవయవదానానికి రాష్ట్రంలో ఆదర్శనీయమైన బాట వేశారు. కొన్నాళ్ల కింద ఊరంతా తమ మరణానంతరం అవయవదానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
దేశంలో తెలంగాణకు తొలిస్థానం
మరోవైపు రాష్ట్రంలో అవయవదానంపై జీవన్ దాన్ సంస్థ విశేష కృషి చేస్తోంది. ప్రతి ఏటా ఆగస్టు 13న అంతర్జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా అవయవదానంపై అవగాహన పెంచి, దాతలను ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అంతేకాకుండా ‘మరో జన్మ’ పేరుతో సైబరాబాద్ పోలీసులు కూడా అవయవదానంపై ప్రచారాన్ని చేపడుతున్నారు. తాజాగా అవయవదానంలో దేశంలోనే తెలంగాణ తొలిస్థానంలో నిలవడం అభినందనీయం.
అంతర్జాతీయంగానూముఠాల అక్రమ దందా
దేశంలో అవయవాల మార్పిడిని మాఫియా ముఠాలు అక్రమ దందాగా మార్చుకుంటున్నాయి. ఇందుకు ఉదాహరణగా చూస్తే.. కొద్ది నెలల కింద హైదరాబాద్ సరూర్ నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అవయవదాన అక్రమ దందా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆర్థిక కష్టాల్లో ఉన్న కుటుంబాలను, వ్యక్తుల అవసరాలను, దుర్భర పరిస్థితులను అవకాశంగా తీసుకుని అవయవ దందా ముఠాలు డబ్బుతో ఆకర్షిస్తుంటాయి.
వెలకట్టలేని మానవ అవయవాలు ఇలా అక్రమ దందాగా మారి అంగడి సరుకుగా మారుతున్న పరిస్థితులు ఉన్నాయి. దేశంలో అవయవ చట్టాలు ఉన్నా అక్రమ దందాను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగానే ఉంటున్నాయి. ఎక్కడైనా ముఠాలు పట్టుబడి వెలుగులోకి వచ్చినప్పుడే ఆ ముఠాలపై దృష్టి సారిస్తుంటాయి. కొన్నాళ్లకు పరిస్థితి మామూలుగానే ఉంటుంది. మాఫియా ముఠాల దందాకు అడ్డుకట్ట పడాలంటే ప్రభుత్వాలు కఠినంగా చట్టాలు అమలు చేయడంతో పాటు ప్రజల్లోనూ విస్తృతంగా అవగాహన కల్పించాలి. ఇది ఒక నిత్య చైతన్య కార్యక్రమంగా కొనసాగించాలి.
గతేడాది ప్రతి 10 లక్షల జనాభాకు దేశంలో సగటున 0.8 అవయవ దానాలు జరిగితే, రాష్ట్రంలో 4.88 జరిగాయని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించింది. ఇందుకుగానూ తెలంగాణకు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యు ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (నోట్టో) అవార్డు ప్రకటించింది. అవయవదానంపై ప్రజల్లో అపోహలు, మూఢ నమ్మకాలను తొలగించాలి. చనిపోయిన బాధిత కుటుంబాలను మరింతగా అవయవదానం చేసే దిశగా ప్రోత్సహించాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని ఆశిద్దాం.
-- వేల్పుల సురేష్, సీనియర్ జర్నలిస్ట్-