స్ట్రీమ్ ఎంగేజ్..చావు ఇంట్లో పోలీస్​

స్ట్రీమ్ ఎంగేజ్..చావు ఇంట్లో పోలీస్​

చావు ఇంట్లో పోలీస్​

టైటిల్​ : తందట్టి

డైరెక్షన్​ : రామ్ సంగయ్య 

కాస్ట్ : రోహిణి, పశుపతి, దీపా శంకర్, అమ్ము అభిరామి, వివేక్ ప్రసన్న, మీనల్

లాంగ్వేజ్ : తమిళం(తెలుగు డబ్​)

ప్లాట్​ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో

హెడ్ కానిస్టేబుల్ సుబ్రమణియన్(పశుపతి) ఎప్పుడూ అనవసరమైన విషయాల్లో వేలు పెడుతూ.. పై అధికారులతో చివాట్లు తింటుంటాడు. ఒకచోటి నుంచి మరోచోటికి ట్రాన్స్​ఫర్​ అవుతూ ఉంటాడు. అలా చివరగా ఒక స్టేషన్​కి ట్రాన్స్​ఫర్​ అయ్యి.. మరో పది రోజుల్లో రిటైర్​ అయ్యే టైంలో చిక్కుల్లో పడతాడు. సుబ్రమణియన్ పనిచేసే పోలీస్ స్టేషన్ పరిధిలో కిడారిపట్టి అనే గ్రామం ఉంటుంది. ఆ ఊళ్లో తంగపొన్ను(రోహిణి) అనే పెద్దావిడ కనిపించడం లేదంటూ.. ఆమె పిల్లలు పోలీస్​ స్టేషన్​కి వస్తారు. వాళ్లు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే.. కిడారిపట్టి గ్రామం గురించి వాళ్లందరికీ తెలుసు. కానీ.. సుబ్రమణియన్ మాత్రం మిగతావాళ్లు వద్దని చెప్పినా కేసు తీసుకుంటాడు. తర్వాత ఇన్వెస్టిగేషన్​ కోసం కిడారిపట్టి వెళ్తాడు. వెళ్లే మార్గంలో తంగపొన్ను మనవడు తన నానమ్మ లైఫ్​ గురించి చెప్తాడు. చివరికి అన్నిచోట్ల వెతికితే బస్ స్టాప్​లో తంగపొన్ను కనిపిస్తుంది. కానీ.. అప్పటికే ఆమె చనిపోతుంది. దాంతో శవాన్ని ఇంటికి తీసుకొస్తారు. అక్కడామె పిల్లలు ఏం చేశారు? దాని వల్ల సుబ్రమణియన్​ ఎలా ఇబ్బంది పడ్డాడు? చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాలి. మానవ సంబంధాల గురించి బాగా చూపించారు. పశుపతి యాక్టింగ్​ బాగుంది. కామెడీ సీన్లు నవ్వు తెప్పిస్తాయి. స్క్రీన్ ప్లే బాగుంది. కథ బాగుంది. డబ్బు కోసం మనిషి ఎంతకైనా దిగజారుతాడనే విషయాన్ని బాగా చూపించారు. 

భర్త జైల్లో.. భార్య కోర్టులో..  

టైటిల్​ : ది ట్రయల్​,  

డైరెక్షన్​ : సుపర్ణ్‌‌ వర్మ

కాస్ట్ : కాజోల్‌‌, జిషు సేన్‌‌గుప్త, కుబ్రా సైత్‌‌, షీబా చద్ధా, అలీఖాన్‌‌, గౌరవ్‌‌ పాండే, విజయ్‌‌ విక్రమ్‌‌సింగ్‌‌

లాంగ్వేజ్ : హిందీ,

ప్లాట్​ ఫాం : డిస్నీ ప్లస్​ హాట్‌‌స్టార్‌‌

రాజీవ్‌‌ సేన్‌‌గుప్త (జిషు సేన్‌‌గుప్త) హైకోర్టు అడిషనల్‌‌ జడ్జిగా పనిచేస్తుంటాడు. అదే టైంలో అతనిపై  లైంగిక ఆరోపణలు వస్తాయి. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు టీవీల్లో ప్రసారం అవుతాయి. దాంతో అతన్ని అరెస్ట్‌‌ చేస్తారు. అవినీతి ఆరోపణలు రావడంతో అతని కుటుంబ ఆస్తులన్నీ సీజ్​ చేస్తారు. దాంతో కుటుంబ భారం అతని భార్య నొయోనిక సేన్‌‌గుప్త (కాజోల్‌‌) మీద పడుతుంది. తన ఇద్దరు పిల్లల్ని చదివించడం కోసం ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఆమెకు పెండ్లికి ముందు లాయర్​గా పనిచేసిన అనుభవం ఉండడంతో మళ్లీ అదే ఫీల్డ్​లో చేరుతుంది. ఆమె పాత ఫ్రెండ్​ విశాల్‌‌ (అలీ ఖాన్‌‌) సాయంతో అతను పనిచేస్తున్న సంస్థలోనే జూనియర్‌‌ లాయర్‌‌గా చేరుతుంది. అప్పుడామె ఓ కేసు గెలిచి వార్తల్లో నిలుస్తుంది. తర్వాత జైలులో ఉన్న రాజీవ్​ని కలుస్తుంది. అయితే.. రాజీవ్​ నిజంగానే తప్పు చేశాడా? అతన్ని విడిపించేందుకు నొయానిక ప్రయత్నించిందా? అనేది తెలియాలంటే సిరీస్​ చూడాల్సిందే. అమెరికన్‌‌ సిరీస్‌‌ ‘ది గుడ్‌‌ వైఫ్‌‌’ ఆధారంగా ‘ది ట్రయల్‌‌’ని తీశారు. మన నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేశారు. కాకపోతే.. సిరీస్​ కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు కాగా ఒక్కో ఎపిసోడ్‌‌ 40 నిమిషాలకుపైగానే ఉంటుంది. కాజోల్​ యాక్టింగ్​ బాగుంది. 

అంతా మోసం

టైటిల్​ : మాయాబజార్ ఫర్ సేల్

డైరెక్షన్​ : గౌతమి చల్లగుల్ల

కాస్ట్ : నరేష్, నవదీప్, ఈషా రెబ్బా, ఝాన్సీ, మెయియాంగ్ చాంగ్, హరి తేజ, రవి వర్మ 

లాంగ్వేజ్ : తెలుగు

ప్లాట్​ ఫాం : జీ5

పద్మనాభ శాస్త్రి (నరేశ్) కష్టపడి మాయాబజార్‌‌ అనే గేటెడ్ కమ్యూనిటీలో ఒక విల్లా కొంటాడు. ఆయన కూతురు వల్లి (ఈషా రెబ్బా), భార్య కుసుమకుమారి (ఝాన్సీ), కొడుకుతో కలిసి విల్లా ప్రవేశం చేస్తాడు. ఈ విల్లాలకు బ్రాండ్ అంబాసిడర్‌‌గా హీరో అభిజిత్ (నవ్‍దీప్) ఉంటాడు. అదే టైంలో  మాయాబజార్ గేటెడ్ కమ్యూనిటీని రూల్స్​కి విరుద్ధంగా కట్టారన్న ఆరోపణలు వస్తాయి. దాంతో అక్కడ విల్లాలు కొన్నవాళ్లంతా అయోమయానికి గురవుతారు. అప్పుడే వల్లి... సుధీమ్ (మేయంగ్ చాంగ్) అనే నార్త్ ఈస్ట్ అబ్బాయి ప్రేమలో పడుతుంది. ఇక అదే టైంలో పద్మనాభ శాస్త్రి ఇంటికి వచ్చిన హీరో అభిజిత్​ మేడ మీది నుంచి పడి చనిపోతాడు. అతని చావుకు కారణమేంటి? మాయాబజార్ విల్లాల సమస్య తీరిందా? లేదా? వల్లి ప్రేమ సక్సెస్ అయిందా? తెలుసుకోవాలంటే సిరీస్​ చూడాల్సిందే. అందరూ బాగా నటించారు. ముఖ్యంగా నరేష్​ యాక్టింగ్​ బాగుంది. ప్రతి ఎపిసోడ్​లో కామెడీ ఉంది. క్లైమాక్స్​ ఈ సిరీస్​కు ప్లస్​ అనే చెప్పాలి. ఈషా రెబ్బా తన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది.