
ఓయూ, వెలుగు: మణిపూర్‌లో మహిళలపై జరిగిన అత్యాచార ఘటనలు, దాడులను నిరసిస్తూ ఓయూ స్టూడెంట్లు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా వర్సిటీలోని ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు సోమవారం మహా ర్యాలీ తీశారు. మణిపూర్‌లోని బాధిత మహిళలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కాసీం, ప్రొఫెసర్ ఆమంచి నాగేశ్వరరావు మాట్లాడుతూ మూడు నెలలుగా మణిపూర్‌లోని మైతేయ్, కూకి జాతుల మధ్యలో జరుగుతోన్న ఘర్షణలను నియంత్రించడంలో కేంద్ర, ఆ రాష్ట్రంలోని బీజేపీప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. మణిపూర్ లో శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేశారు.
ముషీరాబాద్: మణిపూర్‌లో ఆదివాసులు లేకుండా కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఆరోపించారు. మణిపూర్ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మణిపూర్ శాంతిస్థాపన సంఘీభావ సన్నాహక కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పాశం యాదగిరితో పాటు మేధావులు, ప్రొఫెసర్లు, హాజరై, విద్యార్థి నాయకులు, మహిళా ఉద్యమకారులు హాజరై మాట్లాడారు. జాతీయ మహిళా కమిషనర్ మణిపూర్‌కు ఎందుకు వెళ్లలేదని వారు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.