గ్లోబల్ రేంజ్లో ఓయూ నిలవాలి..గవర్నర్ తో లోక్భవన్ లో ఓయూ వీసీ భేటీ

గ్లోబల్ రేంజ్లో ఓయూ నిలవాలి..గవర్నర్ తో లోక్భవన్ లో ఓయూ వీసీ భేటీ

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీకి 108 ఏండ్ల ఘన చరిత్ర ఉందని, అలాంటి వర్సిటీ ప్రపంచంలోని టాప్ వర్సిటీల సరసన నిలవాలని గవర్నర్, ఓయూ చాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించడం, సీఎం స్వయంగా వచ్చి అభివృద్ధిపై ఫోకస్ పెట్టడం శుభపరిణామం అని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం లోక్ భవన్ లో గవర్నర్  జిష్ణుదేవ్ వర్మను ఓయూ వీసీ ప్రొఫెసర్  కుమార్  మొలుగరం మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఈ సందర్భంగా యూనివర్సిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, బోధన, పరిశోధనలపై గవర్నర్​కు వీసీ వివరించారు. కొత్త ఏడాదిలో చేపట్టబోయే కార్యక్రమాల బ్లూ ప్రింట్ ను గవర్నర్ కు అందించారు. వర్సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయడం, సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన వివరాలను గవర్నర్  అడిగి తెలుసుకున్నారు. అయితే, ఫిబ్రవరిలో జరగనున్న ‘సెంట్రల్ జోన్ వైస్ చాన్సలర్ల జాతీయ సదస్సు’ కు ముఖ్య అతిథిగా రావాలని గవర్నర్​ను వీసీ కుమార్  మొలుగరం ఆహ్వానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించబోయే జాతీయ సదస్సుకూ హాజరు కావాలని కోరారు.