ఓయూకు త్వరలో కరెంటు బిల్లుల నుంచి రిలీఫ్ ..!

ఓయూకు త్వరలో కరెంటు బిల్లుల నుంచి రిలీఫ్ ..!

ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) తన కరెంటు అవసరాలను తీర్చుకోవడానికి క్యాంపస్‌లో సోలార్ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది . ఇంధన భారం, విద్యుత్ బిల్లుల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. క్యాంపస్ లోని కాలేజీలు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, ఇతర బిల్డింగులకు సోలార్ పవర్ అందించేందుకు దాదాపు 1 మెగావాట్ శక్తిని ఉత్పత్తి చేయాలని వర్సిటీ యోచిస్తోంది. సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌తో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం ఓయూకు నెలకు రూ.1కోటికి పైగా విద్యుత్ బిల్లులు వస్తోంది. సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు బదిలీ చేయడం వల్ల వర్సిటీకి ఆదాయం సమకూరుతుందని అధికారులు అంటున్నారు

ఈ భారీ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు దాదాపు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశముంది. దీని కోసం విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇటీవల రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన గ్రాంట్‌ల నుండి నిధులను సేకరించాలని విశ్వవిద్యాలయం యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన రూ.500 కోట్లలో దాదాపు రూ.170 కోట్లు మంజూరు చేయాలని కోరినట్లు అధికారులు చెబుతున్నారు. “ఉస్మానియా యూనివర్సిటీకి రూ.80 కోట్ల నుంచి రూ.90 కోట్లు విడుదల చేయనున్నట్లు తమకు సమాచారం అందిందని. ఈ నిధులతో యూనివర్శిటీలో సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోందని, దానికి సరిపడా భూమి అందుబాటులో ఉందని ఓ అధికారి తెలిపారు.

సోలార్ పవర్ ప్లాంట్‌తో పాటు ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం మరో 500 పడకల హాస్టల్‌ను నిర్మించాలని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. మహిళలు, పురుషులకు ఒక్కో హాస్టల్ ను నిర్మించేందుకు గిరిజన సంక్షేమ శాఖతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. కాగా ఇటీవలే గిరిజన సంక్షేమ శాఖ అధికారులు క్యాంపస్‌ను సందర్శించి భూ సర్వే చేశారు. క్యాంపస్ కాలేజీల్లో చేరే గిరిజన విద్యార్థుల కోసం నిర్మించే ఈ హాస్టల్స్ నిర్మాణం కోసం త్వరలోనే ఎంఓయూపై సంతకాలు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం క్యాంపస్‌లో 24 హాస్టళ్లలో 8,500 మంది విద్యార్థులు ఉంటున్నారు. వారిలో 70 శాతం మంది విద్యార్థినులు ఉన్నారు. కొన్ని హాస్టళ్లు బాగానే ఉన్నా.. మరికొన్ని మాత్రం శిథిలావస్థలో ఉన్నాయని, వాటికి వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులు కోరుతున్నారు.