మన ఖజానా మంత్రులు మహా ఘటికులే

మన ఖజానా మంత్రులు మహా ఘటికులే

ఇండియాకు ఫుల్‌‌టైం ఆర్థిక మంత్రిగా నియమితులైన తొలి మహిళ నిర్మలా సీతారామన్‌‌ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌‌ మీద  ఎన్నో ఆశలు పెంచుకుంటున్నారు జనం. ఆదాయపు పన్ను రాయితీల కోసం మధ్య తరగతి ప్రజలు, కొత్త ఉద్యోగాల కల్పన కోసం యువత, సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు నాన్‌‌బ్యాంకింగ్‌‌ ఫైనాన్స్‌‌ కంపెనీలు, వినియోగం పెరిగేందుకు ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ ఊపందుకోవాలని కార్పొరేట్‌‌ సెక్టార్‌‌, ఇవన్నీ బాగుంటే బుల్‌‌ పరుగులు పెడుతుందని స్టాక్‌‌ మార్కెట్‌‌…. ఇలా అందరూ నిర్మలా సీతారామన్‌‌ వైపే చూస్తున్నారు. మరి జూలై 5 న ఏయే వర్గాలను ఆనంద పరుస్తారో, ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలో పెడతారో వేచి చూడాల్సిందే. ఈ నేపథ్యంలో,  గత నలభై ఏళ్లలో ఎందరో ఉద్దండులు ఆర్థిక మంత్రులుగా దేశపు దిశ, దశలను మార్చడంలో కీలకపాత్ర పోషించారు. ఇండియా ఎకానమీ ఎదుగుదలకే కాకుండా, ప్రజల ఆర్థికాభివృద్ధిపైనా తమదైన ముద్ర వేశారు. ఆ ముద్రలేంటో చూద్దాం..

ఇండియా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అయిదో స్థానానికి దూసుకుపోతోంది. ఇండియా జీడీపీ ప్రస్తుతం 2.61 ట్రిలియన్‌‌ డాలర్లు. ఇప్పుడు అయిదో ప్లేస్‌‌లో ఉన్న యూకేను పక్కకి నెట్టి ఈ ఏడాది ఆ స్థానాన్ని ఇండియా ఆక్రమించనుంది. ఆ తర్వాత జపాన్‌‌ని వెనక్కినెట్టి 2025 నాటికి ఏషియా పసిఫిక్‌‌ ప్రాంతంలో రెండో పెద్ద వ్యవస్థగా ఇండియా అవతరించనుందని ఐహెచ్‌‌ఎస్‌‌ మార్కిట్‌‌ రిపోర్టు అంచనా వేస్తోంది. ప్రపంచం మొత్తం మీద అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశం ఇండియానే.

ఇండియా ఆర్థిక వ్యవస్థలో ఏటా ప్రకటించే బడ్జెట్‌‌కు ప్రత్యేక స్థానం ఉంది. బడ్జెట్‌‌లో ఆర్థిక మంత్రి చేసే ప్రకటనలు ఆ ఏడాది సగటు కుటుంబ ఖర్చు పెరుగుతుందా, తగ్గుతుందా అనే దాని మీదే నేరుగా ఆధారపడి ఉంటుంది. ఈ కారణంగానే బడ్జెట్‌‌ అంటే అందరికీ ఆసక్తి.

ఇండియాకు ఇప్పటిదాకా ఎందరో హేమాహేమీలు ఆర్థిక మంత్రులుగా వ్యవహరించారు. కానీ, కొందరే అప్పటి ఆర్థిక వ్యవస్థ మీద తమ విధానాలతో ప్రభావం చూపడంతోపాటు, ఇండియా నేడు ఈ ఉన్నతికి చేరడానికి కారణమయ్యారు. అలాంటి ప్రతిభ చూపిన ఆర్థిక మంత్రుల గురించి తెలుసుకుందాం. ‌‌- వెలుగు బిజినెస్‌‌ డెస్క్‌‌

చౌద్రి చరణ్‌‌ సింగ్‌‌ (1979–80)

దేశంలోని ఫిస్కల్‌‌ ఫెడరిజం స్వరూపాన్నే మార్చేసినదిగా చరణ్‌‌ సింగ్‌‌ బడ్జెట్‌‌ను అభివర్ణిస్తారు. ఏడో ఫైనాన్స్‌‌ కమిషన్‌‌ సిఫారసులను ఆమోదించడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్‌‌ ఆదాయంలో  రాష్ట్రాల వాటాను అప్పటి దాకా ఉన్న 20 శాతం నుంచి 40 శాతానికి పెంచారు. పరోక్ష పన్నులలో సంస్కరణలకూ ఈ బడ్జెట్‌‌ శ్రీకారం చుట్టింది. పెద్ద పునర్‌‌ వ్యవస్థీకరణ చేయకపోయినా, అనేక కన్స్యూమర్‌‌, ఫినిష్డ్‌‌ ప్రొడక్ట్స్‌‌ మీద పన్ను రేట్లను మార్చేశారు. అదే బడ్జెట్లో వ్యాల్యూ యాడెడ్‌‌ ట్యాక్స్‌‌ కూడా తొలిసారిగా కనిపించింది.

 

ఆర్​. వెంకట్రామన్‌‌ (1980–82)

ఎక్సైజ్‌‌ రంగంలో అంతకు ముందు ఆర్థిక మంత్రి చరణ్‌‌ సింగ్‌‌ చేసిన మార్పులన్నింటినీ  తన తొలి బడ్జెట్లోనే రామస్వామి వెంకట్రామన్‌‌ తొలగించారు. లైఫ్‌‌–సేవింగ్‌‌ డ్రగ్స్‌‌ను ఎక్సైజ్‌‌ నుంచి మినహాయించారు. సైకిళ్లు, వాటి విడిభాగాలు, టూత్‌‌ పేస్ట్‌‌, కుట్టు మిషన్లు, ప్రెజర్‌‌ కుకర్లు, చవుక ధర సబ్బులపైనా ఎక్సైజ్‌‌ మినహాయింపు ప్రకటించారు. ఇన్‌‌కంటాక్స్‌‌ ఎగ్జంప్షన్‌‌ పరిమితిని రూ. 8,000 నుంచి రూ. 12,000కి, ఆ తర్వాత రూ. 15,000కి ఆయన పెంచారు.  ఆ పరిమితిని ఇవాళ్టి ధరల స్థాయిలో చూస్తే రూ. 1,50,000 అవుతుంది.

పి. చిదంబరం (1997–1998, 2004–2008, 2012–2014)

1997 లో చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌ క్లాక్‌‌మేకర్‌‌ బడ్జెట్‌‌గా పేరొందింది. వ్యవస్థాపరమైన నిర్మాణం, నియంత్రణా వ్యవస్థల రూపకల్పనలపై అది దృష్టి పెట్టింది. ఆ తర్వాత 2005 లో ఆయన ప్రవేశ పెట్టిన రెండో బడ్జెటే పదేళ్ల యూపీఏ ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేసింది. భారత్‌‌ నిర్మాణ్‌‌ పేరిట చొరవ తీసుకుంది అప్పటి ప్రభుత్వం. ఇండియా షైనింగ్‌‌ అనే ఎన్‌‌డీఏ క్యాంపెయిన్ విఫలమవడంతో, ఆమ్‌‌ ఆద్‌‌మీపై ఫోకస్‌‌ పెట్టింది యూపీఏ ప్రభుత్వం. నేషనల్‌‌ రూరల్‌‌ హెల్త్‌‌ మిషన్‌‌, ఎన్‌‌ఆర్‌‌ఈజీఎస్‌‌ (మహాత్మా గాంధి నేషనల్‌‌ రూరల్‌‌ ఎంప్లాయ్‌‌మెంట్‌‌ గ్యారంటీ స్కీము) వంటివి అప్పుడే తెచ్చారు.

 

అరుణ్ జైట్లీ (2014 –2019)

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నాయకత్వంలోని ఎన్‌‌డీఏ ప్రభుత్వంలో భారీ స్థాయి ప్రోగ్రామ్‌‌లు చాలా మొదలయ్యాయి. వాటిలో ఒకటి రూ. 7,060 కోట్ల స్మార్ట్‌‌ సిటీస్‌‌ ప్రాజెక్ట్‌‌. అసంఘటిత రంగంలోని కార్మికులందరి కోసం అటల్‌‌ పెన్షన్‌‌ యోజన, డిజిటల్‌‌ ఇండియా, మేక్‌‌ ఇన్ ఇండియా వంటి అనేక ప్రోగ్రామ్స్‌‌ మొదలుపెట్టారు. దేశంలో అవినీతిని, బ్లాక్‌‌మనీని నిర్మూలించే లక్ష్యంతో 2016లో డీమానిటైజేషన్‌‌ అమలు చేశారు. రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేశారు. 2017లో అరుణ్‌‌ జైట్లీ నేతృత్వంలోనే ఇండియాలో గూడ్స్‌‌ అండ్‌‌ సర్వీసెస్‌‌ ట్యాక్స్‌‌ (జీఎస్‌‌టీ) అమలులోకి వచ్చింది.

ప్రణబ్‌‌ ముఖర్జీ (1982–84)

రాజ్యసభ సభ్యుడిగా, పలు కేబినెట్‌‌ పదవులు నిర్వహించిన తర్వాత ఆర్థిక మంత్రి స్థాయికి ఎదిగారు ప్రణబ్‌‌ ముఖర్జీ. 1982–1984 మధ్య కాలంలో ఆయన ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. తొలినాళ్లలోనే ప్రణబ్‌‌ ముఖర్జీ  సవాళ్లను ఎదుర్కొన్నారు. ద్రవ్యోల్బణం కోరల నుంచి అప్పుడే బయటపడింది దేశం. చౌదరి చరణ్‌‌ సింగ్‌‌ ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ద్రవ్యోల్బణం ఏకంగా 21 శాతానికి ఎగిసింది.

వీ.పీ. సింగ్‌‌ (1985–87)

పెద్ద పారిశ్రామికవేత్తకు భయం కలిగించడమే కాదు, అరెస్టులు కూడా చేసిన ఆర్థిక మంత్రిగా వీ పీ సింగ్‌‌ను గుర్తు పెట్టుకుంటారు. 1985 బడ్జెట్లో మాత్రం ఆర్థిక సరళీకరణ అజెండాను ముందుకు తెచ్చారు వీ పీ సింగ్. పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారనే ఆరోపణల మీద హై ప్రొఫైల్‌‌ ధీరూభాయ్‌‌ అంబానీ సహా అనేక మందిపై దాడులు నిర్వహించారు. దాంతో ఆర్థిక మంత్రిగా వీ పీ సింగ్‌‌ను ప్రధాన మంత్రి రాజీవ్‌‌ గాంధి తొలగించారు.

మాడిఫైడ్‌‌ వ్యాల్యూ యాడెడ్‌‌ ట్యాక్స్‌‌ (మోడ్‌‌వ్యాట్‌‌)ను వీ పీ సింగ్‌‌ ప్రవేశపెట్టారు. తుది ఉత్పత్తులపై డ్యూటీని రా మెటీరియల్స్‌‌పై చెల్లించిన డ్యూటీతో సెటాఫ్‌‌ చేసుకునే పద్ధతిని తెచ్చారు. దేశంలో పరోక్ష పన్నుల వ్యవస్థలో ఒక కీలకమైన సంస్కరణగా దానిని కొనియాడతారు. ఆ తర్వాత  జీఎస్‌‌టీ రావడానికి ఇది దారి కల్పించింది.

 

రాజీవ్‌‌ గాంధీ (1987–88)

మినిమం కార్పొరేట్‌‌ ట్యాక్స్‌‌ నిబంధనలను ప్రవేశ పెట్టారు రాజీవ్‌‌ గాంధి. ఇప్పుడు దానిని మినిమం ఆల్టర్నేటివ్‌‌ ట్యాక్స్‌‌ (ఎంఏటీ)గా వ్యవహరిస్తున్నారు. అత్యధికంగా లాభాలు గడించే కంపెనీలను పన్ను పరిధిలోకి తెచ్చే లక్ష్యంతోనే ఈ నిబంధనలను తీసుకువచ్చారు. జీరో–బేస్డ్‌‌ బడ్జెట్‌‌ విధానానికి  రూపకల్పన1987–88 లో మొదలైంది.  వీ.పీ సింగ్​ను మంత్రి పదవి నుంచి తప్పించిన కారణంగా ఆ ఏడాది బడ్జెట్​ను ప్రవేశపెట్టారు.

యశ్వంత్‌‌ సిన్హా (1991–92, 1998–2002)

ఇండియా ఎకానమీ వృద్ధి బాట మీద పరిగెట్టేందుకు సాయపడే ఎన్నో సంస్కరణలను తెచ్చిన వ్యక్తిగా యశ్వంత్‌‌ సిన్హాను కొనియాడతారు.  రియల్‌‌ ఇంటరెస్ట్‌‌ రేట్ల తగ్గింపు, మార్ట్‌‌గేజ్‌‌ ఇంటరెస్ట్‌‌కు టాక్స్‌‌ డిడక్షన్‌‌, టెలికం రంగంలో స్వేచ్ఛ, నేషనల్‌‌ హైవేస్‌‌ అథారిటీకి నిధులు, పెట్రోలియం ఇండస్ట్రీపై పరిమితులు తొలగించడం వంటి చర్యలు సిన్హా తీసుకున్నారు.  బ్రిటిష్‌‌ కాలం నుంచి ఉన్న సాంప్రదాయాన్ని కాదని బడ్జెట్‌‌ సమర్పణ టైమ్‌‌ను సాయంత్రం 5 గంటల నుంచి మార్చింది ఆయనే. బ్రిటిష్‌‌ పార్లమెంట్‌‌కు అనువుగా ఉండేలా అప్పట్లో ఈ టైమ్‌‌ను నిర్ణయించారు. ఆ తర్వాత చాలా కాలం అదే కొనసాగింది.

 

మన్మోహన్‌‌ సింగ్‌‌ (1991–1996)

బేలన్స్‌‌ ఆఫ్‌‌ పేమెంట్స్‌‌ సమస్యతో సతమతమవుతున్న సమయంలో దేశానికి ఆర్థిక మంత్రయ్యారు మన్మోహన్‌‌ సింగ్‌‌. విధానాల రూపకల్పనలో కొత్త ఒరవడి ప్రవేశ పెట్టారు. సరళీకరణకు అంతకు ముందు పదేళ్ల నుంచి చిన్న చిన్న చర్యలను తీసుకుంటుండగా, వాటి వేగం విపరీతంగా పెంచారు. ఇండియా ఎకానమీ గేట్లను ప్రపంచానికి తెరిచింది ఈయన హయాంలోనే. 1991 బడ్జెట్‌‌ ఇండియా రూపురేఖలనే మార్చేసిందని చెబుతారు. ఇంపోర్ట్‌‌–ఎక్స్‌‌పోర్ట్‌‌ విధానాన్ని సమూలంగా మార్చేశారు. దిగుమతుల లైసెన్సింగ్‌‌ విధానం తీసేయడంతోపాటు, ఎగుమతులు పెంచడం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.  ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడేందుకు వీలుగా సాఫ్ట్‌‌వేర్‌‌ కంపెనీలకు కన్సెషన్స్‌‌ ఇవ్వడం వంటి చొరవ ప్రదర్శించారు.