నాలో.. నా ఆలోచనల్లో.. నా ఊహల్లో.. నా జ్ఞాపకాల్లో అంతా నువ్వే

నాలో.. నా ఆలోచనల్లో.. నా ఊహల్లో.. నా జ్ఞాపకాల్లో అంతా నువ్వే

‘కృష్ణా! నేను ఎక్కడెక్కడ ఉన్నాను?’ అని అడిగిందట రాధ..అప్పుడు కృష్ణుడు ..‘నాలో.. నా ఆలోచనల్లో.. నా ఊహల్లో.. నా జ్ఞాపకాల్లో .. నా ఊపిరిలో’ అని చెప్పాడట.‘కృష్ణా నేను ఎక్కడ లేను?’ అని మళ్లీ  అడిగిందట రాధ.. కృష్ణుడు నవ్వుతూ .. ‘నా తలరాతలో’ అని చెప్పాడట. అంటే రాధ భార్య కాలేకపోయింది అని అర్థం.

ప్రేమకి నిర్వచనం రాధాకృష్ణులు. అందుకే సృష్టిలో ఎక్కడెక్కడ ప్రేమ ప్రస్తావన వస్తుందో అక్కడ రాధాకృష్ణులు ఉంటారు. కానీ, రాధ తలరాతలో కృష్ణుడు లేడు. కృష్ణుడి ప్రేమలో భౌతికంగా రాధ లేదు. మరి ఇక్కడ లోపం ఎవరిది? ప్రేమదా? దాన్ని దూరం చేసిన విధిదా? రెండూ కాదంటాడు కృష్ణుడు. ఎందుకంటే.. రాధ పరిస్థితిని అర్థం చేసుకుని తనకి దూరమయ్యాడు కృష్ణుడు. తల్లిదండ్రుల కోసం కృష్ణుని ప్రేమను త్యాగం చేసింది రాధ.  అందుకే ‘మన ఇప్పటి నిర్ణయాలే రేపటి తలరాత’ అంటాడు కృష్ణుడు.  ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి మనం ఎలా రెస్పాండ్​ అవుతున్నాం అన్నదే డెస్టినీ అంటాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక మనలో చాలామంది తప్పొప్పులు అన్నింటినీ తలరాతపై నెట్టేస్తుంటారు? ఇది ఎంత వరకు కరెక్ట్​?ఏ పిల్లాడికైనా తల్లిదండ్రుల్ని ఎంచుకునే అవకాశం ఉందా? లేదు. సృష్టిలో ఎవరికైనా వాళ్ల రూపు రేఖల్ని ఎంచుకునే అవకాశం ఉందా? అదీ లేదు. ఎందుకంటే ఆ రెండూ మన చేతుల్లో లేవు. అది తలరాత.  కానీ, మనం ఈ భూమ్మీదకి వచ్చాక ఎదురయ్యే పరిస్థితులన్నీ డెస్టినీ కాదు. ముందు చెప్పుకున్నట్టే మన నిర్ణయాలే రేపటి తలరాత. ఆ ఎదురయ్యే పరిస్థితులకి ఎలా రియాక్ట్​ అవుతున్నాం? అన్నదే భవిష్యత్తు. అందుకే జీవితంలో  జరిగే వాటన్నింటికీ తలరాతదే బాధ్యత కాదు.
ఎలా రెస్పాండ్​ అవుతున్నాం.. సరిగా చదవకపోతే ఎగ్జామ్​లో ఫెయిలవుతాం.  అంతెందుకు ప్రయత్నం గట్టిగాలేకపోతే  ఏ పనిలోనైనా ఫెయిలవుతాం. ఈ రెండు సిచ్యుయేషన్స్​కి సరిగా రెస్పాండ్​ అవ్వకపోతే జీవితంలోనూ ఫెయిల్​ అవుతాం. అంటే ఇక్కడ ప్రతి ఫెయిల్యూర్​కి రీజన్​ మనమే. మన రెస్పాన్సే మనం వెనకబడటానికి కారణం. మన అలవాట్లు, నిర్ణయాలు, ఆలోచనలే మనకి ఆటంకాలు. ఇన్ని తప్పులు మన దగ్గర పెట్టుకొని ఏ పాపం తెలియని తలరాతని నిందిస్తే ఎలా?  ఎగ్జామ్​లో ఫెయిల్​ అయితే  నెక్స్ట్​ టైం మరింత శ్రద్ధ​ పెట్టి చదవాలి. పనిలో తడబడుతున్నామా కాన్సన్​ట్రేషన్​ పెంచాలి. జీవితంలో  ఓడిపోతే గెలుపు కోసం మళ్లీ పరిగెత్తాలి. ఇలా మనకి ఎదురయ్యే సిచ్యుయేషన్స్​ అన్నింటికీ మనం ఎలా రెస్పాండ్​ అవుతున్నాం అన్నదే ఇంపార్టెంట్​. 

ఫిర్యాదులు చేయొద్దు

మన డెస్టినీకి మనమే బాధ్యులం అయినప్పుడు కంప్లైంట్స్​ వల్ల లాభం ఎవరికి? నా తలరాత ఇంతే అన్న మాటలతో మనకి మనం సర్దిచెప్పుకోవడం ఎందుకు? నలుగురిలో తలరాత తప్పొప్పులను లెక్కించడం వల్ల ప్రయోజనం ఏంటి? వీటన్నింటి వల్ల తలరాత మారుతుందా? కచ్చితంగా లేదు. మన భవిష్యత్తు  మనకి అప్పటివరకు ఏదైతే ఉందో అదే ఇస్తుంది. ఎందుకంటే  మనం ఎప్పుడూ ఏ పని  చేస్తున్నామో.. అదే చేస్తున్నాం. ప్రత్యేకంగా ఏం చేయట్లేదు. కొత్తగా ఏం చేయట్లేదు. అలాగే తలరాతని తప్పుబడుతున్నాం. దీనివల్ల ఎప్పటికీ మనం కోరుకున్నవి దక్కవు. ఏదైనా పొందాలంటే కష్టపడాలి.. కావాల్సిన దానికోసం ఎంతో శ్రమపడాలి. ఉదాహరణకు ఆవు పొదుగు పాలతో నిండాలంటే.. దానికి పుష్టిగా దానా వేయాలి.. మంచి ఉద్యోగం సాధించాలంటే రేయింబవళ్లు కష్టపడి చదవాలి. హెల్దీగా, ఫిట్​గా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి,  శరీరానికి కాస్త  పని చెప్పాలి. ఆ ప్రయత్నమే రేపటిని  డిసైడ్​ చేస్తుంది. అంతే తప్పించి ఫిర్యాదులు కాదు. 

నిర్ణయం ఎలా తీసుకోవాలి? 

జీవితంలోని ప్రతి క్షణం నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతి అడుగులోనూ రెండో  అడుగు గురించి ఆలోచించాలి అంటాడు కృష్ణుడు. ఎందుకంటే ఈ రోజు తీసుకున్న నిర్ణయమే రేపటి సంతోషాలకో  లేక  బాధలకో కారణం అవుతుంది. కేవలం మనకే కాదు మన కుటుంబానికి, రాబోయే తరాలకి కూడా.  అందుకే ఏదైనా  నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు  మనసు అతలాకుతలం అవుతుంది. ఒత్తిడికి లోనవుతుంది. అలాంటప్పుడు చాలామంది మనసుని శాంతపరుచుకోవడానికి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఉదాహరణకు మార్కులు తక్కువ వస్తే చదువు మానేయడం.. ఆటంకాలొస్తే ప్రయత్నాల్ని విరమించుకోవడం లాంటివి. కానీ, అలాంటివి ఎప్పటికీ మనకి మంచి చేయవు. అందుకే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆలోచించాలి. ప్రతిరోజూ మనతో మనం రెండు నిమిషాలు ఉండాలి. మనతో మనం మాట్లాడుకోవాలి. ఆలోచించి సిచ్యుయేషన్స్​కి రియాక్ట్​ అవ్వాలి. ఇవే మన తలరాతని మారుస్తాయి.  అలాగే మనం వేసే మొదటి అడుగే  గమ్యాన్ని డిసైడ్​ చేస్తుందన్న విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. 

::: మానసి