
న్యూఢిల్లీ: మన దేశ విదేశాంగ విధానం పతనమైందని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఆరోపించారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఆయన మూడు ప్రశ్నలు వేశారు. పహల్గాం టెర్రర్అటాక్ తర్వాత పాకిస్తాన్‌ను ఖండించడంలో భారత్‌ను ప్రపంచంలోని ఏ ఒక్క దేశం కూడా ఎందుకు సమర్థించలేదని ప్రశ్నించారు. భారత్‌తో పాటు పాకిస్తాన్‌ను కూడా ఇతర దేశాలు సమానంగా చూడ్డానికి కారణమేంటని అడిగారు.
భారత్, పాక్ మధ్య మధ్యవర్తిత్వం చేయాలని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను కోరిందెవరంటూ రాహుల్ గాంధీ శుక్రవారం ట్వీట్ చేశారు. వీటన్నింటికీ జైశంకర్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రతిష్టతో ప్రధాని నరేంద్ర మోదీ రాజీపడ్డారని ఆరోపించారు. పాకిస్తాన్‌తో కొట్లాటను ఆపేందుకు అంగీకరించి మన దేశ ప్రయోజనాలను ఎందుకు పణంగా పెట్టారని రాహుల్ ప్రశ్నించారు.
‘‘మోదీజీ.. ఇకనైనా ఖాళీ ప్రసంగాలు చేయడం ఆపండి. టెర్రరిజంపై పాక్ ప్రకటనను మీరు ఎందుకు నమ్మారు..? ట్రంప్‌కు తలవంచి దేశ ప్రయోజనాలను ఎందుకు ఫణంగా పెట్టారు..? ఇప్పుడు కెమెరాల ముందు మాత్రమే మీ రక్తం ఎందుకు మరుగుతోంది?” అని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా నిలదీశారు.
నేడు జమ్మూకాశ్మీర్‌కు రాహుల్
పహల్గాంలో టెర్రరిస్టుల కాల్పుల్లో మరణించినవారి కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పేందుకు రాహుల్ గాంధీ శనివారం జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. జమ్మూ ప్రాంతంలోని పూంచ్‌లో ఆయన పర్యటిస్తారని, బాధిత కుటుంబాలను కలుస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తెలిపారు. కాగా, టెర్రరిస్టుల కాల్పుల ఘటన తర్వాత రాహుల్ జమ్మూకాశ్మీర్‌లో పర్యటించడం ఇది రెండోసారి. ఏప్రిల్ 25న శ్రీనగర్‌లో పర్యటించి బాధితులను పరామర్శించారు.