ఫోన్​ లేకపోతే పరేషాన్​ పరేషాన్.. ప్రతి నలుగురిలో ముగ్గురికి నోమోఫోబియా

ఫోన్​ లేకపోతే పరేషాన్​ పరేషాన్..  ప్రతి నలుగురిలో ముగ్గురికి నోమోఫోబియా

న్యూఢిల్లీ : కాసేపు  ఫోన్​ చేతిలో  లేకుంటే మన ఇండియన్లు తట్టుకోలేకపోతున్నారు. ఫోన్లో బ్యాటరీ అయిపోతే ఆగమాగమవుతున్నారు. దీనిని ‘నోమోఫోబియా’ (నో మొబైల్ భయం)గా పిలుస్తున్నారు.  ఫోన్​ యూజర్లలో ప్రతి నలుగురిలో ముగ్గురికి నోబోఫోబియో ఉందని తాజా స్టడీ ఒకటి బహిర్గతం చేసింది. స్మార్ట్​ఫోన్​ మేకర్​ ఒప్పో, మార్కెట్​ రీసెర్చ్​ ఫర్మ్​ కౌంటర్​పాయింట్​ కలిసి ఈ స్టడీని నిర్వహించాయి. ఫోన్ ​ పనిచేయనప్పుడు కంగారు, భయానికి గురైతే నోమోఫోబియా బాధితులు అంటారు.

ఫోన్​ బ్యాటరీ లెవెల్​ పడిపోయినప్పుడల్లా వీరు ఎలా స్పందించారో సర్వే సమయంలో రికార్డు చేశారు. సర్వే కోసం టైర్​1, టైర్​2 సిటీల్లోని 1,500 మంది ఫోన్​ యూజర్ల నుంచి వివరాలు తీసుకున్నారు. ‘‘ఈ స్టడీ చాలా ముఖ్యమైనది. మా ప్రొడక్టులను ఎలా తయారు చేయాలో దీని ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం. బ్యాటరీ సరిగ్గా పనిచేయడం లేదని కారణంతో 60 శాతం మంది యూజర్లు కొత్త ఫోన్​ కొంటున్నారు.  సర్వేలో పాల్గొన్న వారిలో 72 శాతం మంది బ్యాటరీ లెవెల్ 20 శాతం లేదా అంతకు తక్కువగా ఉంటే కంగారు పడుతున్నారు”అని ఒప్పో ఇండియా చీఫ్ మార్కెటింగ్​ ఆఫీసర్​ దమయంత్​ సింగ్​ ఖనోరియా వివరించారు. 

బ్యాటరీ బాధితులు..

ఒప్పో రిపోర్ట్​ ప్రకారం.. ఫోన్​ బ్యాటరీ పనిచేయకుంటే భయంభయంగా ఉంటుందని 82 శాతం మంది మగవాళ్లు, 74 శాతం మంది ఆడవాళ్లు చెప్పారు. తమ స్మార్ట్ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సోషల్ మీడియా కోసం అత్యధికంగా వాడుతున్నామని, తరువాతి స్థానం వినోదం కోసం ఉంటుందని అని 42శాతం మంది రెస్పాండెంట్లు చెప్పారు. బ్యాటరీని కాపాడుకోవడానికి 65శాతం మంది వాడుకదారులు ఫోన్ వాడకాన్ని మానేస్తున్నారు.

82శాతం మంది తమ సోషల్ మీడియా వాడకం సమయాన్ని పరిమితం చేసుకుంటున్నారు. ‘లో బ్యాటరీ లెవెల్​’ భయంపై రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ "స్మార్ట్​ఫోన్లు మన వ్యక్తిగత ప్రపంచంగా మారుతున్నాయి.  వ్యక్తిగతంగా,  వృత్తిపరంగా కనెక్ట్ అయి ఉండడానికి,  వినోదం కోసం కూడా ఇవి కీలకంగా మారుతున్నాయి.  మనలో అనేకమంది ఫోన్లు లేకుండా ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. ఇది వారికి ఫోబియాగా మారింది.

ఇలాంటి వ్యక్తులు బ్యాటరీ అయిపోతుందేమోనని,  తమ ఫోన్లను వాడుకోలేమేమో అనే టెన్షన్​ను తరచుగా అనుభవిస్తున్నారు. ‘లో బ్యాటరీ’ భయం 31 నుండి 40 సంవత్సరాల వయసున్న వారిలో ఎక్కువగా ఉన్నట్టు మేం గమనించాం. 25 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు వ్యక్తులలోనూ   నోమోఫోబియో కనిపిస్తోంది”అని ఆయన వివరించారు.