మా పొరబాటు వల్ల డ్రోన్ అటాక్‌లో 10 మంది మృతి

మా పొరబాటు వల్ల డ్రోన్ అటాక్‌లో 10 మంది మృతి

కాబూల్ ఎయిర్‌‌పోర్టుపై దాడి చేసేందుకు ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు నక్కి ఉన్నారని ఇంటెలిజెన్స్ ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ వల్ల పొరబాటుగా సామాన్యులు ఉన్న కారుపై డ్రోన్ అటాక్ చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ కెన్నెత్‌ మెకెన్జీ తెలిపారు.  అఫ్గాన్ తాలిబాన్ల చేతిలోకి రావడంతో గత నెల 15 నుంచి రోజూ వేలాది మంది ఆ దేశం విడిచి వెళ్లిపోయేందుకు కాబూల్ ఎయిర్‌‌పోర్టుకు క్యూ కట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టు 26న కాబూల్ ఎయిర్‌‌పోర్టు వద్ద ఐఎస్‌ఐఎస్–కే ఉగ్ర సంస్థ రెండు ఆత్మాహుతి దాడులకు పాల్పడి దాదాపు 130 మందిని పొట్టబెట్టుకున్నారు. అయితే ఆ తర్వాత 48 గంటల్లో మళ్లీ అటాక్స్ జరగొచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. 29వ తేదీన ఎయిర్‌‌పోర్టుకు దగ్గరలోని ఓ ఏరియా ఇండ్ల మధ్య కారులో పేలుడు పదార్థాలతో ఐఎస్ టెర్రరిస్టులు దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారని యూఎస్ బలగాలకు రిపోర్ట్ అందింది. దీంతో ఎయిర్‌‌పోర్టు దగ్గర పబ్లిక్‌ను కాపాడాలన్న ఉద్దేశంతో వెంటనే డ్రోన్ అటాక్స్ చేశారు. ఈ దాడిలో పది మంది సామాన్య పౌరులు చనిపోయారు. దీనిపై అప్పట్లో తాలిబాన్ లీడర్లు అమెరికాపై సీరియస్ అయ్యారు. 

అమెరికా రక్షణ మంత్రి క్షమాపణ

ఈ ఇష్యూపై ఇప్పుడు అమెరికా వివరణ ఇచ్చింది. నాటి ఘటనపై ఇన్వెస్టిగేషన్ చేశామని,  ఆ దాడి తమ ఇంటెలిజెన్స్ పొరబాటు వల్ల జరిగిందని, తమ తప్పు వల్ల సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని  మెకెన్జీ వెల్లడించారు. బాధిత కుటుంబాలకు ఎలా పరిహారం ఇవ్వాలన్న దానిపై అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు.  దీనిపై అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్‌ క్షమాపణ చెబుతూ స్టేట్‌మెంట్ విడుదల చేశారు. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు చెప్పారు. ఈ ఘటనకు క్షమాపణ చెబుతున్నామని పేర్కొన్నారు.  ఈ ఘోర తప్పిదం నుంచి తాము పాఠం నేర్చుకుంటామని చెప్పారు.