చరిత్రలో చోటు దక్కని మన సైనికులు

చరిత్రలో చోటు దక్కని మన సైనికులు

చరిత్ర గురించి చెప్పాలన్నా, మాట్లాడుకోవాలన్నా.. ఆధారాలే మూలం. అవే లేకపోతే  ఏ విషయానికైనా సరే ఇంపార్టెన్స్​ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రపంచయుద్ధ చరిత్రలో మనదేశ సైనికుల గాథలు ‘చరిత్ర చెప్పని కథలు’గా మిగిలిపోయాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్​, మిత్రరాజ్యాల తరపున పోరాడిన భారతసైన్యం గురించి, ముఖ్యంగా పంజాబ్​ సైనికుల గురించి ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు. వీరి గురించి బ్రిటిషర్లు సరైన డేటాబేస్ రికార్డు చేయలేదు. కానీ అప్పటి పంజాబ్​ ప్రభుత్వం చేసిన ‘పంజాబ్​ రిజిస్టర్​​ల’ ను ఇటీవల ‘లాహోర్​ మ్యూజియంలో’ గుర్తించారు. సుమారు 3 లక్షల 20వేల మంది పంజాబ్​ సైనికులు మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడి చరిత్రకెక్కని సైనికులుగా మిగిలినట్టు ఆ రికార్డులు చెబుతున్నాయి. ఆ రికార్డుల వెనక ఉన్న కథే ఇది..

1940... రెండో ప్రపంచ యుద్ధ కాలం. ఫ్రెంచ్ నగరంలోని ‘డన్‌‌‌‌కర్క్’ ఓడరేవు దగ్గర జర్మనీ సైన్యాలు బ్రిటన్​ను, దాని సపోర్టర్స్​ను చుట్టుముట్టాయి. అక్కడి నుంచి తప్పించుకోవడమే తమ ముందున్న  మార్గం అని బ్రిటన్​ అనుకుంది. అలా బ్రిటన్​ తన సైనికులను మెల్లగా తరలించడం మొదలుపెట్టింది. చరిత్రలో దీన్ని 'డన్‌‌‌‌కర్క్ ఎవాక్యుయేషన్‌‌‌‌' అంటారు. ఆ సైన్యంలో మనదేశ సైనికులు  దాదాపు మూడు వందల మంది ఉన్నారు.  వాళ్లంతా 25వ యానిమల్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ కంపెనీకి చెందినవాళ్లు. బ్రిటిష్​ మిలటరీకి సాయం చేయడానికి12 వందల కిలోమీటర్లు ప్రయాణించి ఫ్రాన్స్ చేరుకున్నారు. వాళ్లలో నలుగురు మినహా అందరూ ముస్లింలే.  ఈ సైనికులు యుద్ధ సామగ్రి మోయడం, భోజనాలు అందించడం వంటి పనులు చేసేవాళ్లు. ఎముకలు కొరికే చలిలో 15 రోజులు జర్నీ చేసి డన్​కర్క్​ నుంచి బ్రిటన్​ సైన్యం తప్పించుకుంది. తర్వాత రోజుల్లో ఈ సైనికుల గురించి ఎక్కడా  వినబడలేదు. బ్రిటన్​ సైన్యానికి అండగా నిలిచిన వీళ్లు ఫ్రాన్స్​లోని కొన్ని గ్రామాల్లో స్థిరపడ్డారు. కానీ, చరిత్రలో వీళ్ల గురించి లేదు.  అలా రెండో ప్రపంచయుద్ధంలో వీళ్లు కనబడని హీరోలు. అయితే ఇక్కడ మూడు వందల మందే.  చరిత్ర వెనక్కి వెళ్తే... మూడు లక్షల ఇరవై వేల మంది సైనికుల గురించి చరిత్ర విస్మరించిందన్న సంగతి తెలుస్తోంది. 

మనదేశాన్ని బ్రిటిష్​ వాళ్లు  ఆక్రమించుకున్న తర్వాత  వాళ్లకు అవసరమైనప్పుడు భారతదేశం భారీ  సైన్యాన్ని ఇచ్చింది.  అలా రెండు ప్రపంచ యుద్ధాల్లో ఇండియన్​ మిలటరీ బ్రిటన్​ తరపున యుద్ధంలో పాల్గొన్నది. ఈ సైన్యానికి సైనికులను అందించేందుకు ‘పంజాబ్​’  సెంటర్​గా ఉండేది.  సైనికుల శిక్షణ, యుద్ధబలగాల తయారీ అంతా పంజాబ్​ కేంద్రంగా జరిగేది. భారతీయుల సిపాయిల తిరుగుబాటులోనే పంజాబ్​ సైనికుల గురించి తెలిసింది. అట్లాంటి ప్రాధాన్యం ఉన్న పంజాబ్​కు చెందిన మనదేశ సైనికులు ఇప్పటికీ చరిత్రలో గుర్తింపు పొందలేదు. వాళ్లు చేసిన యుద్ధాల వివరాలు, వాళ్ల చరిత్ర కొద్దిమంది ద్వారానే బయటకు వచ్చాయి. అది కూడా  బ్రిటిష్​ వాళ్లు చెప్పిన కథలే చరిత్రలోకి ఎక్కాయి. కానీ, ఇటీవల కాలంలో ప్రపంచ చరిత్రలో పంజాబ్​ సైనికుల పాత్ర ఏమిటో గుర్తించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ‘యునైటెడ్ కింగ్‌‌‌‌డమ్ పంజాబ్ హెరిటేజ్ అసోసియేషన్’ ను స్థాపించిన అమన్‌‌‌‌దీప్ సింగ్​ మద్రా ఆ ప్రయత్నం చేశారు. చరిత్రలో పంజాబ్​, సిక్ సైనికుల గురించి ఆయన రీసెర్చ్​ చేస్తున్నారు. ఇటీవల3.2 లక్షల మంది సైనికుల పోరాటాలను చూపించే రికార్డులను లాహోర్​లోని మ్యూజియం నుంచి సేకరించాడు. 

ప్రత్యేక ప్రాజెక్ట్​
1914‌‌‌‌‌‌‌‌–18 నాటి యుద్ధ కాలంలో పంజాబీల సేవలను మర్చిపోయిన వారి చరిత్రను గుర్తు చేయడానికి అమన్‌‌‌‌దీప్ మద్రా ‘ఎంపైర్, ఫెయిత్, వార్’ ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు. 2014 నుంచి ఇది మొదలైంది. ఈ ప్రాజెక్ట్​ ద్వారా ఎన్నో విషయాలను వెలుగులోకి తెచ్చాడు. మన దేశం అంచుల నుంచి ఆఫ్రికా, యూరప్​ దేశాల వరకు మన దేశ సైనికులు బ్రిటన్​ తరపున పోరాడి మరణించారు. అందులో పంజాబ్​కు చెందిన వారే ఎక్కువ. ఆ సమయంలో ఇండియా జనాభాలో పంజాబ్​ రాష్ట్రంలో జనం రెండు శాతమే ఉండేవారు. కానీ  బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో 20శాతం కన్నా ఎక్కువ మంది సైనికులు పంజాబ్​ వాళ్లే. ‘అవమానకరమైన ఓటముల నుంచి మిత్రదేశాల సైన్యాన్ని  రక్షించడంలో వీళ్లు ఎంతో కీలకంగా పని చేసేవారు. అయితే యుద్ధకాలం నాటితరాలు, వారి కథలు వేగంగా మారిపోయాయి. వారి గురించి ప్రస్తుత , భవిష్యత్తు తరాలు గుర్తుంచుకోవాల్సిన కీలకమైన చరిత్ర బయటకు రాకుండా పోయింది. బ్రిటిష్​​ సామ్రాజ్యంలో సిక్కుల పాత్ర పెద్దగా తెలియని అంశంగా మారడంతో చరిత్ర చెప్పని కథనాలను  బయటకు తీసే ప్రయత్నమే నా  ప్రాజెక్ట్​.  ప్రపంచంలో  చిన్న కమ్యూనిటీ అయిన సిక్కులు అన్ని యుద్ధాల్లో కీలకంగా పని చేసి,  సాధించిన విజయాలను, వాళ్ల కథలను గుర్తించి రికార్డు చేస్తున్నాం” అన్నాడు మాద్రా.

లాహోర్​ లైబ్రరీలో రికార్డులు
యుద్ధకాలంలో బ్రిటిష్​ వారి తరపున పోరాడిన  మనదేశస్తుల వివరాలను తెలిపే రికార్డులను యు.కె. చరిత్రకారులు డిజిటలైజ్ చేశారు.  అప్పటి పంజాబ్ ప్రభుత్వం రికార్డ్​ చేసిన ‘పంజాబ్ రిజిస్టర్లు’ పాకిస్తాన్‌‌‌‌లోని లాహోర్ మ్యూజియంలో  ఉన్నాయని గుర్తించారు.  యు.కె. పంజాబ్ హెరిటేజ్ అసోసియేషన్​ హెడ్​ అమన్‌‌‌‌దీప్ మద్రా మ్యూజియం అధికారులను కలిసి రికార్డులు పరిశీలించాడు. రికార్డుల్లో ఉన్న సైనిక కుటుంబాలకు రాతపూర్వక ఎవిడెన్స్​ ఇవ్వడానికి లైబ్రరీ  పర్మిషన్​ కూడా పొందాడు. ఈ లాహోర్​ రికార్డుల ప్రకారం..1918 నవంబర్ 11న యుద్ధం ముగిసింది. యుద్ధ విరమణ సందర్భంగా పైలట్ ప్రాజెక్ట్  ​ రెడీ అయింది. యుద్ధ కారణాలు, సైన్యాలు, పోరాడిన తీరు, ధన, ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరాలన్నీ పైలట్ ప్రాజెక్ట్‌‌‌‌  లో రికార్డు చేశారు. భారతదేశంలోని జలంధర్ , లూథియానా, పాకిస్తాన్‌‌‌‌లోని సియాల్‌‌‌‌కోట్ అనే మూడు జిల్లాల నుండి 45,000 రికార్డులుఈ ప్రాజెక్ట్​లో పొందుపరిచారు. అయితే పంజాబ్‌‌‌‌లోని మిగిలిన 25 జిల్లాలకు సంబంధించిన రికార్డులను కూడా అప్​లోడ్​ చేస్తారని ఆశించారు. కానీ, బ్రిటిష్​ ప్రభుత్వం అది చేయలేకపోయింది. 2,75,000 మంది సైనికుల వివరాలతో ప్రాజెక్ట్​ను పూర్తి చేసింది. అయితే మొదటి ప్రపంచ యుద్ధానికి పంజాబ్ ఐదులక్షల కంటే ఎక్కువమంది సైనికులను పంపింది, మొత్తం భారతీయ సైనికులలో మూడో వంతు అది. ఆస్ట్రేలియా వంటి ఇతర కామన్వెల్త్ భూభాగాల కంటే ఎక్కువమంది మన ఇండియా సైన్యం నుంచే ఉన్నారు.  వీళ్లలో కూడా  హిందువులు, సిక్కులు, ముస్లింలు ఉన్నారు. ఫ్రాన్స్, మిడిల్ ఈస్ట్, గల్లిపోలి, ఈడెన్​, సౌత్​ ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో యుద్ధం చేయడానికి సైనికులను పంపినట్లు ఈ రికార్డులు చూపిస్తున్నాయి. పంజాబ్ రిజిస్టర్ల ప్రకారం గ్రామాల నుంచి (అర్హులైన) 40 శాతం మంది వారంతటవారే సైన్యం కోసం పని చేశారని రికార్డుల్లో ఉంది. 

‘మొదటి ప్రపంచ యుద్ధంలో పంజాబ్​ వలంటీర్ల వ్యక్తిగత, కుటుంబ చరిత్రలు చాలా మంది వారసులకు కూడా తెలియవు. కొంతమంది ఇండియన్ ఆఫీసర్లు మిలటరీలో వారి సేవకు సంబంధించిన రికార్డులను మిగిల్చారు. కానీ, అందరూ అలా చేయకపోవడం వల్ల పంజాబీల చరిత్ర తెలియకుండా పోయింది’ అనేది కొందరి మాట. అయితే బ్రిటిష్ , ఐరిష్ సైనికుల రికార్డుల డేటాబేస్‌‌‌‌లను సులభంగా ఐడెంటిఫై  చేసే అవకాశం ఉంది.   కానీ, ఇండియా నుంచి వచ్చిన సైనికుల వారసులకు అలాంటి అవకాశం లేదు. అందుకే వాళ్ల గురించి గానీ, వాళ్లు చేసిన సేవల గురించి గానీ తెలియకపోవడానికి గల కారణం అని చరిత్రకారులు అంటున్నారు. 

ఇండియాకు చెందిన గుర్రాలు, గాడిదలు , ఒంటెలతో సహా మొత్తం 1, 72,815 జంతువులు  యుద్ధంలో పాల్గొన్నాయని రికార్డులు చెబుతున్నాయి. ‘1918 నవంబర్​ నెలలో యుద్ధం ముగిసే  టైంకి  దాదాపు పదిశాతం మంది ఇండియన్​ సైనికులు మరణించారు. కొంతమంది తప్పిపోయారు. ఇంకొందరు గాయపడ్డారు. లెక్కల ప్రకారం..  సుమారు 72,000 మంది మృతి చెందగా, 80 వేల కంటే ఎక్కువమంది గాయపడ్డారు.  మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడి మరణించిన దాదాపు 50 వేల మంది భారతీయ సైనికులను..  అమరవీరులుగా స్మరించుకోవడం లేదనే  రిపోర్టుల తర్వాత...  బ్రిటిష్ ప్రభుత్వం మొన్నటి ఏప్రిల్‌‌‌‌లో క్షమాపణ చెప్పింది.

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత యూరప్‌‌‌‌లో, భారతదేశంలో కూడా పరిస్థితులు చాలా మారిపోయాయి. యుద్ధ వివరాలు, చరిత్ర కొద్దిమంది ద్వారానే బయటకు వచ్చాయి. అదీ,  బ్రిటిషర్లు, చెప్పిన కథలే చరిత్రపుటల్లోకి ఎక్కాయి. రెండు ప్రపంచ యుద్ధాల్లో మనదేశ సైన్యం చేసిన పోరాటాలు, త్యాగాల గురించి తెలిసే లోపే పరిస్థితులు మారిపోయాయి. దాంతో ప్రపంచ యుద్ధాలు, భారతదేశ చరిత్ర గురించి బ్రిటిషర్లు చెప్పిందే చరిత్ర అయిందని చరిత్రకారులు  చెబుతుంటారు.

మొదటి ప్రపంచ యుద్ధంలో మేమంతా బ్రిటిష్, మిత్ర దేశాల కోసం పోరాడుతున్నాం. మేమువెనకడుగు వేయలేం. పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. యుద్ధంలో ఒక వ్యక్తి పడిపోయిన చోట, మరొకరు అతని స్థానంలో నిలబడుతున్నారు.  కానీ, భారతదేశానికి తిరిగి వస్తామనే ఆశ మాలో ఎవరికీ లేదు. ఇది యుద్ధం కాదు. ప్రపంచ నాశనంగా అనిపిస్తోంది.
– 1915 ఫిబ్రవరి 15న మార్సెయిల్స్‌‌‌‌లోని సిక్కు అశ్విక దళ సైనికుడు ఒకరు మన  దేశానికి ఒక లేఖ పంపాడు. దాని సారాంశం. 

ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సహకారం నిజానికి ఆస్ట్రేలియా, కెనడా , న్యూజిలాండ్​ కామన్వెల్త్ దేశాల సాయం కంటే చాలా గొప్పది. భారతీయుల త్యాగాన్ని, వీరత్వాన్ని ఇంగ్లిష్​ మెయిన్​ స్ట్రీమ్​​ మీడియా విస్మరించింది. చరిత్ర ఆధారాలకంటే ఫూట్​నోట్లు మాత్రమే బయటకు వచ్చాయి. పంజాబ్​, సిక్కుల చరిత్రను చెప్పడం ద్వారా ఇండియన్​ ఆర్మీ చరిత్రను మేము రికార్డు చేయాలి అనుకుంటున్నాం. మొదటి ప్రపంచ యుద్ధ చరిత్రలో మిస్​ అయిన  ఇండియా  గురించిన సమాచారాన్ని   పూర్తి చేయాలి అనుకుంటున్నాం. 
– 2014 జూలైలో  ప్రాజెక్ట్ లాంచ్ ఎగ్జిబిషన్‌‌‌‌లో అమన్‌‌‌‌దీప్ సింగ్ మద్రా