
హైదరాబాద్, వెలుగు: నల్గొండ – వరంగల్– ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమని సీపీఎం, సీపీఐ, తెలంగాణ జన సమితి (టీజేఎస్) నేతలు అన్నారు. తమ మద్దతు తీన్మార్ మల్లన్నకే అని స్పష్టం చేశారు. టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, ఆ పార్టీ నేత ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం నేతలు జూలకంటి రంగారెడ్డి, ఎస్.వీరయ్య శనివారం సీఎం రేవంత్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఇందులో కాంగ్రెస్ నేతలు మహేశ్‌కుమార్ గౌడ్, మల్లు రవి పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక చివరి రోజు ప్రచార సరళి, గెలుపోటముల అంచనాలపై వారు కొద్దిసేపు చర్చించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. కోదండరాం మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా తాము అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామని, అదే తరహాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తమ మద్దతు కాంగ్రెస్‌కేనని స్పష్టంచేశారు. ‘‘మార్పు కోసం కాంగ్రెస్‌నే గెలిపించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామిక పాలనను బలోపేతం చేయాలంటే ఇది అవసరం. ప్రజా సంక్షేమం వర్ధిల్లాలంటే కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలి. అందుకే టీజేఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలి” అని ఆయన అన్నారు. కూనంనేని మాట్లాడుతూ.. పొత్తులో భాగంగా తాము కాంగ్రెస్‌కు పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు.
ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. సీపీఐ నాయకులంతా కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాలని ఆయన సూచించారు. తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్య ఓటు వేయాలన్నారు. సీపీఎం నేతవీరయ్య మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తాము కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. విద్యావంతులంతా కాంగ్రెస్ పక్షాన నిలవాలన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ బైపోల్‌పై సీఎం సమీక్ష నిర్వహించారని, కాంగ్రెస్ గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారని అన్నారు. సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవడం సంతోషంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.