హైదరాబాద్ లో తుక్కు బస్సులు ఎక్కువైతున్నయ్

హైదరాబాద్ లో తుక్కు బస్సులు ఎక్కువైతున్నయ్
  • గ్రేటర్​ ఆర్టీసీ పరిధిలో 521 కాలం చెల్లిన బస్సులు
  • స్క్రాప్​పాలసీని పట్టించుకోని ఆర్టీసీ అధికారులు
  • పొల్యూషన్​ టెస్టులు చేయకుండానే తిప్పుతున్నారు
  • 15 ఏండ్లు నిండిన బస్సులతో సిటీలో పెరుగుతున్న కాలుష్యం

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలో కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు పెరిగిపోతున్నాయి. 15 ఏండ్లు నిండిన బస్సులను స్క్రాప్ చేయాల్సి ఉండగా, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. పాత బస్సులను అలానే నడిపిస్తుండడంతో సిటీ రోడ్లపై కాలుష్యం వెదజల్లుతున్నాయి. గ్రేటర్​హైదరాబాద్ జోన్ పరిధిలో 15 నుంచి 17 నిండిన 900 బస్సులను ఇప్పటికే స్క్రాప్​కు తరలించారు. 

ప్రస్తుతం 2,825 బస్సులు నడుస్తుండగా, వీటిలో ఎక్కువ శాతం 15 సంవత్సరాలు దాటిన బస్సులు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ రీజియన్ పరిధిలో 218, సికింద్రాబాద్ రీజియన్​పరిధిలో 303 కాలం చెల్లిన బస్సులు ఉన్నట్టు తెలుస్తోంది. వీటిని స్క్రాప్ గూటికి చేర్చుతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారే తప్ప చేయడం లేదు. సిటీ రోడ్లపై అలానే తిప్పుతున్నారు.

 పొల్యూషన్​టెస్టులు చేయకుండా నడిపిస్తున్నారు. సిటీలో పొల్యూషన్​పెరగడానికి ఆర్టీసీ బస్సులు కొంత కారణమవుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సుల కండిషన్​పై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. పాత బస్సులను తొలగించి, పొల్యూషన్​ఫ్రీ బస్సులను తీసుకురావాలని సూచిస్తున్నారు. అలాగే ప్రస్తుతం హైదరాబాద్ రీజియన్​పరిధిలో 10 సంవత్సరాలు దాటిన బస్సులు 330, సికింద్రాబాద్​పరిధిలో 300 బస్సులు ఉన్నట్లు సమాచారం. 

సగానికిపైగా లక్షల కి.మీ. తిరిగినవే 

టీఎస్​ఆర్టీసీ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 9,067 బస్సలు నడుస్తున్నాయి. ఇందులో ఆర్టీసీకి చెందినవి 6,629, అద్దె బస్సులు 2,700 ఉన్నాయి. ఇవి డెయిలీ 47 లక్షల మంది ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. గ్రేటర్​హైదరాబాద్​లో దాదాపు 12లక్షల మందికి సేవలు అందిస్తున్నాయి. అయితే గ్రేటర్​పరిధిలో తిరుగుతున్న సగం బస్సులు లక్షల కి.మీ. తిరిగినవే ఉన్నాయి.

 కాలం చెల్లినా అధికారులు వాటిని తొలగించడం లేదు. అలానే రోడ్లపై తిప్పుతున్నారు. వాటి స్థానంలో కొత్త బస్సులను తీసుకురావడం లేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్టీసీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో 40 వరకు కొత్త బస్సులను ప్రవేశపెట్టామని, దశల వారీగా 1,050 ఈ–- బస్సులను తీసుకొస్తామని అంటున్నారు. మే నెల నాటికి మరో 25 కొత్త బస్సులను ప్రారంభిస్తామని చెబుతున్నారు.

ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం

గ్రేటర్​పరిధిలో 15 సంవత్సరాలు దాటిన బస్సులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం. స్క్రాప్​పాలసీని అమలు చేస్తున్నాం. ప్రతి నెలా తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 450 బస్సులను స్క్రాప్​గా పరిగణించి పక్కన పెట్టాం. 15 సంవత్సరాలు నిండిన బస్సులను నడపడం లేదు. ఇటీవల ప్రభుత్వం 500 నాన్​ఏసీ బస్సులను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంది. మే నెలలో కొన్ని కొత్త బస్సులు వస్తాయి.  

వెంకటేశ్వర్లు, గ్రేటర్ ఆర్టీసీ జోన్ ఈడీ