రోజూ వాకింగ్ చేస్తున్నారా.. శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

రోజూ వాకింగ్ చేస్తున్నారా.. శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

శరీరాన్ని ఫిట్ గా ఉంచే మార్గాలలో నడక కూడ ఒకటి. ముఖ్యంగా శీతాకాలంలో ఉదయం సమయంలో మంచు బాగా పడుతుంది. ఈ సమయంలో వాకింగ్ చేసే వారు ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా జాగ్రత్తలు పాటించటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

 ముఖ్యంగా చలికాలంలో బయటకు వెళ్ళటం అన్నది చాలా మందిలో పెద్ద సవాలుగా ఉంటుంది. గడ్డకట్టే చలి, మంచు మధ్య ఆరుబట వాకింగ్ చేయటం ఏమాత్రం సురక్షితం కాదు. చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ఆరుబయట వాకింగ్ చేసే వారిలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

అనారోగ్య సమస్యలతో బాదపడుతున్నవారికి పొగమంచు చాలా ప్రమాదకరంగా మారుతుంది. శీతాకాలంలో వాతావరణంలోని విష వాయువులు, చల్లని గాలి ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులను కలిగించే ప్రమాదం ఉంటుంది. ఉబ్బసం వ్యాధితో బాధపడేవారికి సమస్య మరింత తీవ్రతరమౌతుంది. జలుబు బారిన పడే ప్రమాదం ఉంటుంది. చలికాలంలో ఉదయం పూట, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్ళకుండా ఉండటమే ఉత్తమం. ఒకవేళ వాకింగ్ వంటి వ్యాయామం వెళ్ళాల్సి వస్తే మాత్రం సరైన జాగ్రత్తలు పాటించటం మంచిది.

వాకింగ్ కు వెళ్ళబోయే ముందు స్వెటర్లు, చేతికి గ్లౌజులు, తలకు ఉన్ని టోపీలు, పాదాలకు సాక్స్ ధరించటం మాత్రం మర్చిపోవద్దు. రోడ్డుపై నడవడం కంటే పార్క్, మైదానంలో నడవటం మంచిది. ఎందుకంటే రోడ్డుపై పొగమంచు కారణంగా వాహనాలు ఢీ కొట్టే ప్రమాదం ఉంటుంది. చెప్పులకు బదులుగా బూట్లు ధరించండి. వాకింగ్ కు వెళ్ళే ముందుగా నీరు తాగటం చాలా మందికి అలవాటు. అయితే అలాగని చల్లటి నీరు మాత్రం తాగకండి. శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవాలంటే గోరు వెచ్చని నీరు వాకింగ్ కు ముందు, తరువాత తీసుకోవటం మంచిది.

ఉదయం 7 గంటల తర్వాత మాత్రమే వాకింగ్ కు వెళ్ళటం మంచిది. ఎందుకంటే తెల్లవారు జామున మంచు విస్తారంగా వ్యాపించి ఉంటుంది. ఈ సమయంలో వచ్చే చల్లటి గాల వల్ల ముక్కులు బిగదీసుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఎండవచ్చిన తరువాత వెళ్ళటం వల్ల చలి నుండి రక్షించుకోవచ్చు. రోడ్డు మీద వాకింగ్ చేసే వారైతే ప్రకాశవంతమైన రంగుల దుస్తులు ధరించడంమంచిది. రహదారి వాహనాలు నడిపే వారు రోడ్డుపై నడుస్తున్న వారిని గుర్తించేందుకు వీలుంటుంది.

వాకింగ్ ను నెమ్మదిగా ప్రారంభించి ఆతరువాత మాత్రమే వేగం పెంచుకోవాలి. ఆరోగ్యపరమైన సమస్యలు గుర్తించినట్లైతే వాకింగ్ చేయటం నిలిపి వేసి వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది. చలికాలంలో దాహం పెద్దగా వేయదు. దీంతో నీరు సరిగా తాగరు. నీరు త్రాగకుండా వ్యాయామం చేయడం వల్ల డీహైడ్రేషన్‌కు దారి తీసే ప్రమాదం ఉంటుంది.

ఆస్తమా లేదా ఇతర శ్వాసకోశ సమస్యలతో బాదపడేవారు మంచు పడే చలిలో వాకింగ్ చేయకుండా ఉండటమే మేలు. ఇంట్లోనే అటుఇటు తిరగటంతోపాటు, తేలికపాటి వ్యాయామాలు చేయటం వల్ల ప్రయోజనం కలుగుతుంది