మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో బలమైంది

మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో బలమైంది

న్యూఢిల్లీ : మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో శక్తిమంతమైందని, అలాంటి దేశానికి రాష్ట్రపతిగా సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని రామ్​నాథ్​ కోవింద్​ అన్నారు. ఆదివారంతో తన పదవీ కాలం ముగుస్తుండటంతో జాతినుద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేశారు. అన్ని వర్గాల నుంచి తనకు పూర్తి సహకారం లభించిందని చెప్పారు. అందరి మద్దతు, ఆశీర్వాదాలతోనే తన ఐదేండ్ల పదవీ కాలం విజయవంతమైందని తెలిపారు.  ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో రాష్ట్రపతిగా ఐదేండ్లు దేశానికి సేవ చేశానన్నారు. ఆదివారంతో తన పదవీ కాలం ముగిసిందని, ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని రామ్​నాథ్​ కోవింద్​  వివరించారు. 

పవర్​ఫుల్​ దేశంగా..
21వ శతాబ్దం ఇండియాదే అన్న రామ్​నాథ్​ కోవింద్.. ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసాధారణ నాయకత్వ లక్షణాలు కలిగిన దేశంగా ఇండియా పేరు.. ప్రఖ్యాతులు సంపాధించుకుందని తెలిపారు. 'చైతన్యవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థకి సెల్యూట్’ అని అన్నారు. కాన్పూర్​ దేహత్​ జిల్లాలోని పరౌంఖ్​ గ్రామంలో అతి సామాన్య కుటుంబంలో తాను జన్మించానని తెలిపారు.  ‘‘రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నేను నా సొంత గ్రామానికి వెళ్లాను. కాన్పూర్​లోనే చదువుకున్నాను. నాకు పాఠాలు చెప్పిన వృద్ధ ఉపాధ్యాయుల పాదాలను తాకి వారి ఆశీర్వాదం తీసుకున్నాను. నా జీవితంలో ఎప్పటికీ మరుపురాని క్షణాల్లో ఇది కూడా నిలిచిపోతుంది. కొన్ని నెలల కింద ప్రధాని మోడీ కూడా నా స్వగ్రామానికి వెళ్లారు. దీంతో నా గ్రామానికి గౌరవం మరింత పెరిగింది. ప్రతి ఒక్కరు తమ మూలాలను మరిచిపోవద్దు. ఇదే భారతీయ సంస్కృతిని సూచిస్తుంది” అని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ చెప్పారు. 

దేశ భక్తి అద్భుతం
సాయుధ, పారా మిలటరీ బలగాలతో పాటు ధైర్యవంతులైన పోలీసులను కలుసుకున్న సందర్భాన్ని కూడా మరిచిపోలేనని రామ్​నాథ్​ కోవింద్​ తెలిపారు. దేశ, విదేశీ పర్యటనల సందర్భంగా జరిగిన చర్చల ద్వారా ఎంతో ప్రేరణ పొందానని తెలిపారు. రైతులు, ఉపాధ్యాయులు, కళాకారులు, విద్యావంతులు, ఉద్యమకారులు, డాక్టర్లు, నర్సులు, శాస్ర్తవేత్తలు, ఇంజనీర్లు, సివిల్​ సర్వెంట్స్, సామాజిక కార్యకర్తల నుంచి తనకెంతో సహకారం లభించిందని వివరించారు. విదేశాల్లో ప్రవాస భారతీయులను కలిసినప్పుడల్లా.. దేశంపై వారికి ఉన్న ప్రేమతో తానెంతో స్ఫూర్తి పొందినట్టు చెప్పారు. వీరంతా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.