దళిత ఐపీఎస్ ఆత్మహత్యపై దుమారం.. కుల వివక్ష, సీనియర్ల వేధింపులే కారణం.. 8 పేజీల సూసైడ్ నోట్

దళిత ఐపీఎస్ ఆత్మహత్యపై దుమారం.. కుల వివక్ష, సీనియర్ల వేధింపులే కారణం.. 8 పేజీల సూసైడ్ నోట్
  • తప్పుడు కేసులో ఇరికించే యత్నం
  • పూరన్ భార్య ఫిర్యాదుతో డీఐజీ, ఎస్పీలపై కేసు
  • బాధితుడి కుటుంబానికి కాంగ్రెస్ నేతల పరామర్శ

చండీగఢ్: హర్యానాలో సీనియర్ ఐపీఎస్, జైళ్ల శాఖ ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న దళిత ఆఫీసర్ పూరన్ కుమార్ ఆత్మహత్యపై దుమారం రేగుతోంది. ఉన్నత స్థానంలో ఉన్నా కుల వివక్ష తప్పలేదని, తప్పుడు కేసుల్లో ఇరికించి వేధించే ప్రయత్నం చేయడంతోనే తాను చనిపోతున్నట్లు పూరన్ కుమార్ రాసిన సూసైడ్ లేఖతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్  రాజకీయ వర్గాల్లోనూ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు శనివారం పూరన్ కుమార్ నివాసానికి వెళ్లి ఆయన భార్య, ఐఏఎస్ ఆఫీసర్ అమ్​నీత్ కు సంతాపం తెలిపారు. హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ కూడా అమ్ నీత్ ను పరామర్శించారు. పూరన్ సూసైడ్ నోట్ లో పేర్కొన్న సీనియర్ అధికారులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అమ్ నీత్​ కుమార్ సీఎం సైనీని కోరారు. తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.

సూసైడ్ లేఖలో ఏముందంటే..

2020లో తాను కుటుంబంతో కలిసి అంబాలా ఆలయాన్ని సందర్శించిన తర్వాతి నుంచే తనపై వేధింపులు మొదలయ్యాయని పూరన్ కుమార్ తెలిపారు. మానసికంగా తనను తీవ్రంగా వేధించారని, అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా మరణానికి చేరువైన తండ్రిని చూసి రావడానికి సెలవు అడిగినా ఇవ్వలేదని, అధికారుల కక్ష సాధింపు కారణంగా తన తండ్రి చివరి క్షణాలలో ఆయన చెంత ఉండలేదని పూరన్ వాపోయారు. ఈ విషయాలన్నీ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించినా ప్రయోజనం లేకుండా పోయిందని లేఖలో పేర్కొన్నారు.

 తప్పుడు ఆరోపణలతో తనను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయడం, ప్రభుత్వ వాహనం  ఇవ్వకుండా, పోలీసు భద్రతను తొలగించి.. ఇలా అన్ని రకాలుగా తనను వేధించారని చెప్పారు. ఇటీవల తన పేరు చెప్పి తన సబార్డినేట్ లంచం డిమాండ్ చేశాడని ఆరోపిస్తూ తననూ కేసులో ఇరికించారని పూరన్ వాపోయారు. ఈ ఆరోపణలను సాకుగా తనను జైళ్ల శాఖకు బదిలీ చేయడంతో విసిగిపోయి బలవన్మరణానికి పాల్పడుతున్నానని పూరన్ తన లేఖలో చెప్పారు. హర్యానా డీజీపీ సహా పలువురు సీనియర్ పోలీసు అధికారులు తనను వేధించారని, పలువురు రిటైర్డ్ ఐపీఎస్ ల హస్తం కూడా ఇందులో ఉందని పూరన్ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.