
- ఆందోళన పడుతున్న రైతులు
మెదక్, వెలుగు: జిల్లాలో రైతులను వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. సరైన సమయంలో సరిపడ వర్షాలు కురియక పూర్తి స్థాయిలో పంటలు సాగు చేయలేకపోతున్నారు. అడపాదడపా కురిసిన వానలకు వేసిన పంటలకు నీటి తడులు అందని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఈ వానకాలం సీజన్ లో అన్ని రకాల పంటలు కలిపి 3,50,164 ఎకరాలు సాగవుతాయని అంచనా వేశారు. ఇప్పటి వరకు 2,36,255 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా లక్ష ఎకరాలకు పైచిలుకు భూమి ఖాళీగా ఉంది.
ఇంకా అన్ని రకాల పంటలు కలిపి 1,11,255 ఎకరాలు సాగు కావాల్సి ఉంది. ఇందులో అత్యధికంగా వరి పంట ఉంది. ఈ సీజన్ లో మొత్తం 3,05,100 ఎకరాల్లో వరి పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 1,95,982 ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగింది. ఇంకా 1,09,118 ఎకరాల సాగు కావాల్సి ఉంది. పత్తి పంట సాగు అంచనా 37,200 ఎకరాలు కాగా 34,055 ఎకరాలు సాగు చేశారు. మొక్క జొన్న 2,640 ఎకరాలకు 1,980 ఎకరాలు, కంది 1,500 ఎకరాలకు 646 ఎకరాలు, పెసర 1,500 ఎకరాలకు 658 ఎకరాలు, కూరగాయ పంటలు 708 ఎకరాలకు 665 ఎకరాలు, జొన్న 100 ఎకరాలకు 49 ఎకరాలు సాగుచేస్తున్నారు. ఒక్క మినుము పంట మాత్రమే 550 ఎకరాలకు 1,070 ఎకరాలలో సాగు చేస్తున్నారు.
12 మండలాల్లో వర్షపాతం లోటు..
వర్షాకాలం ప్రారంభం అయినప్పటి నుంచి ఆగస్టు 4 వరకు జిల్లాలో 348 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 280 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే కురిసింది. కురవాల్సిన దానికన్నా 19 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. కేవలం ఒక్క మండలంలో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ వర్షం కురవగా, 8 మండలాల్లో సాధారణ వర్ష పాతం నమోదైంది. 12 మండలాల్లో వర్షలోటు ఉంది. అడపాదడపా కురిసిన వర్షాలకు రైతులు పంటలు సాగు చేస్తుండగా సరైన నీటి తడులు అందడం లేదు.
బోర్లు కూడా సరిగా నీరందించక పోవడంతో బోర్ల ఆధారంగా సాగు చేసిన పంటలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. వేసవిని మరిపించేలా ఎండలు కొడుతుండడంతో వేసిన పంటలు దక్కుతాయ లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే పంటలు ఎండిపోయి పెట్టుబడి నష్ట పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కౌలుకు తీసుకుని నాటేసినా
మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వానలు పడగానే నాటేసిన. మూడు బోర్లు ఉన్నా సరిపడ నీళ్లు రావట్లేదు. భూమి లోపల నీళ్లు లేకపోవడంతో పొలం పారుతలేదు. ఇట్లనే ఎండలు కొడితే నాటు వేసిన పొలం అంతా ఎండిపోయి అప్పుల పాలవుతాం.- గెల్లు ఎల్లయ్య, రైతు, నందిగామ
మరో పదిరోజుల గడువు ఉంది
వానాకాలం పంటల సాగుకు మరో పది రోజుల గడువు ఉంది. ఆగస్టు 15 వరకు వరి నాట్లు వేసుకోవచ్చు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వరినారు ముదిరి పోతే నారు కొనలు తుంచేసి నాటు వేసుకోవాలి. రెండు, మూడు పిలకలకు బదులు ఆరు, ఏడు పిలకలు నాటాలి. - దేవ్‌కుమార్, డీఏఓ, మెదక్