ఉమ్మడి నల్గొండ జిల్లాలో భూభారతికి లక్షా 2 వేల అప్లికేషన్లు.. డేటా కరెక్షన్లే ఎక్కువ..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో భూభారతికి లక్షా 2 వేల అప్లికేషన్లు.. డేటా కరెక్షన్లే ఎక్కువ..
  • ఉమ్మడి  జిల్లాలో భూభారతి పోర్టల్​కు1,02,768 అప్లికేషన్లు 
  • పరిష్కారానికి అధికారుల కసరత్తు

యాదాద్రి, వెలుగు: చిన్న చిన్న భూ సమస్యలను సైతం ధరణి పోర్టల్​ఏండ్ల తరబడి పరిష్కరించలేకపోయింది. ఏ స్థాయి ఆఫీసర్​ను కలిసినా ఫలితం శూన్యం. దీంతో రైతులు, భూ యజమానులు ఇబ్బంది పడ్డారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం భూభారతిని  అమలులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా పైలట్​ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా 73 మండలాల్లోని 1,168 గ్రామాల్లో నిర్వహించిన ఈ సదస్సుల్లో భూ సమస్యలపై 1,02,768 అప్లికేషన్లు వచ్చాయి. వీటి పరిష్కారానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

పోర్టల్​కు రెగ్యులర్​గా అప్లికేషన్లు

ఒకవైపు రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలను పరిశీలిస్తూనే మరోవైపు భూభారతి పోర్టల్ లో రెగ్యులర్​గా వస్తున్న అప్లికేషన్లను ఆఫీసర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తహసీల్దార్​పరిశీలన అనంతరం ఆర్డీవో, అడిషనల్​కలెక్టర్​ (రెవెన్యూ) చూశాక కలెక్టర్​వద్దకు చేరుతున్నాయి. కలెక్టర్​పరిశీలన తర్వాత సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. 

14 మ్యాడ్యూల్స్​లో 8,607 దరఖాస్తులు 

ఉమ్మడి జిల్లా నుంచి 14 మ్యాడ్యూల్స్​లో వివిధ సమస్యల కోసం భూభారతి పోర్టల్​లో ప్రస్తుతం 8,607 అప్లికేషన్లు ఉన్నాయి. వీటిలో కొన్ని పరిష్కరించారు. తహసీల్దార్ల వద్ద 5,774 అర్జీలు పరిశీలనలో ఉన్నాయి. ఆర్డీవోల వద్ద 1,331, అడిషనల్​కలెక్టర్ల​వద్ద 548, కలెక్టర్ల వద్ద 1,266 దరఖాస్తులు ఉన్నాయి. 

పాస్​బుక్​ సమస్యలు యాదాద్రిలోనే ఎక్కువ 

భూభారతి పోర్టల్​లో వచ్చిన అప్లికేషన్లలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డాటా కరెక్షన్ కు సంబంధించినవే​ ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత ప్రొహిబిటెడ్​ ప్రాపర్టీ, పెండింగ్​మ్యూటేషన్లు, సక్సేషన్​దరఖాస్తులు ఉన్నాయి. ఎన్ఆర్ఐలకు సంబంధించి పట్టాదారు పాస్​బుక్​సమస్యలు యాదాద్రి జిల్లాలోనే ఎక్కువ.